కదలి వచ్చిన కరుణశ్రీ
ABN , First Publish Date - 2020-05-13T06:20:35+05:30 IST
పోలీస్ అంటే పైకి కనిపించే ఖాకీ... చేతిలో లాఠీ... మోముపై కాఠిన్యమే కాదు... దాని వెనక స్పందించే హృదయం కూడా ఉంటుంది. ఈ కరోనా కష్టకాలం వారిలోని మానవీయ చిత్రాలెన్నింటినో ఆవిష్కరించింది. అలాంటి ‘చిత్రమే’ ఒకటి తెలుగు సినీ హీరో చిరంజీవిని కదిలించింది. ఒడిశాలోని మహిళా పోలీస్ అధికారి శుభశ్రీ నాయక్...

పోలీస్ అంటే పైకి కనిపించే ఖాకీ... చేతిలో లాఠీ... మోముపై కాఠిన్యమే కాదు... దాని వెనక స్పందించే హృదయం కూడా ఉంటుంది. ఈ కరోనా కష్టకాలం వారిలోని మానవీయ చిత్రాలెన్నింటినో ఆవిష్కరించింది. అలాంటి ‘చిత్రమే’ ఒకటి తెలుగు సినీ హీరో చిరంజీవిని కదిలించింది. ఒడిశాలోని మహిళా పోలీస్ అధికారి శుభశ్రీ నాయక్... మతిస్థిమితం లేని అభాగ్యురాలికి అన్నం తినిపిస్తున్న వీడియో అది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూసినప్పటి నుంచీ చిరంజీవి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారట! చివరకు మాతృదినోత్సవంనాడు ఆ అధికారిణితో వీడియో కాల్‌లో ముచ్చటించిన చిరు... ఆమెలోని ‘అమ్మ’దనానికి చేతులెత్తి నమస్కరించారు. చిరంజీవిని అంతగా చలింపచేసిన ఆ పోలీస్ అధికారిణి వీడియో వెనక కథ ఇది...
శుభశ్రీ నాయక్... ఒడిశాలోని మల్కాన్‌గిరి మోడల్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్. మరికొంతమంది అధికారులతో కలిసి ఇటీవలే ఆమెను అక్కడకు పోస్ట్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసే బాధ్యతను కూడా వారిపై పెట్టింది అక్కడి ప్రభుత్వం. అప్పటి నుంచి విధి నిర్వహణలో వారికి కంటిపై కునుకు లేకుండా పోయింది. ఎందుకంటే అది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు. అటు నుంచి ఇటు ఎవరినీ రానీయకూడదు... ఇటు నుంచి ఎవరినీ ఊరు దాటనీయకూడదు. నిజానికి ఈ ‘కట్టడి’ చాలా కష్టం అంటారు శుభశ్రీ.
ఓ రోజు విధుల్లో భాగంగా ఆమె మల్కాన్‌గిరి ప్రాంతంలో లాక్‌డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం. నలభై మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఎండ. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అది. అంతటి మండుటెండలో ఓ మహిళ ఆకలితో అలమటిస్తోంది. పట్టెడన్నం పెట్టేవారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ దృశ్యం శుభశ్రీని కదిలించింది. వెంటనే జీపులో ఉన్న తన లంచ్ బాక్స్‌ను తీసుకొని ఆమె వద్దకు వెళ్లారు. దగ్గరకు వెళితే కానీ తెలియలేదు... ఆ అభాగ్యురాలికి మతిస్థిమితం లేదని..! వికలాంగురాలని! దాంతో లంచ్ బాక్స్ తానే తెరిచి... అందులో అన్నం తీసి... ముద్దలు చేసి... తన చేతులతో ఆమె నోటికి అందించారీ ఎస్‌ఐ.
ఇప్పుడే కాదు... డ్యూటీలో ఉన్నా తనూ ఓ అమ్మనేనని శుభశ్రీ గతంలోనూ చాటుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో కంట పడిన అభాగ్యుల కడుపు నింపుతున్నారు.
‘‘డ్యూటీలో రోడ్డుపై వెళుతున్న నాకు ఓ మహిళ కనిపించింది. నిలువ నీడ లేదు. తినడానికి తిండి లేదు. ఇంత ఎండలో కాళ్లు ఈడ్చుకొంటూ... పక్కనున్న బోరింగ్ పంపు వద్ద నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆమె పంపు కూడా కొట్టలేని పరిస్థితుల్లో ఉంది. వెంటనే ఆమెను ఓ ఇంటి నీడన కూర్చోబెట్టి, దాహం తీర్చాను. పండ్లు తినిపించాను’’ అంటూ శుభశ్రీ మరో ఘటన గుర్తుచేసుకున్నారు. అయితే ఇందులో తను ప్రత్యేకంగా చేసిందేమీ లేదనీ, ఎవరైనా అలానే స్పందిస్తారనీ ఆమె వినయంగా చెప్పారు. తన గొప్ప మనసు చాటుకున్నారు.
శుభశ్రీ చేసిన సాయం చిన్నదే కావచ్చు... కానీ ఆమెలో పరిమళించిన మానవత్వం వెలకట్టలేనిది. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు కొందరు. అది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరకు వెళ్లింది. ఆయన శుభశ్రీలోని మానవతామూర్తిని కొనియాడారు. బాలీవుడ్ పాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఈ పోలీస్ మాటలు నాకు అర్థం కాలేదు. కానీ... ఖాకీ యూనిఫామ్ వేసుకునే సమయంలో వారు చేసే ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారని మాత్రం ఇది చూసిన తరువాత బాగా అర్థమైంది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత చిరంజీవి సైతం ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడి, అభినందించారు.
ఒక్క శుభశ్రీనే కాదు... కరోనా మహమ్మారిపై పోరు మొదలైనప్పటి నుంచి తమ విధి నిర్వహణలో పైకి కనిపించే కాఠిన్యంతో పాటు కరుణ కూడా ఉందని రుజువు చేస్తున్నారు పోలీసులు. ‘రక్షకభటు’లనే పదానికి నిజమైన అర్థాన్నిస్తున్నారు. అందుకే జనం వారికి జేజేలు పలుకుతున్నారు.
