సేంద్రీయంగా సాధికారత వైపు

ABN , First Publish Date - 2020-11-19T05:38:41+05:30 IST

సేంద్రీయ వ్యవసాయం.. ప్రకృతి వ్యవసాయం.. ఏ పేరుతో పిలిస్తే ఏముంది? ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా.. ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించని వ్యవసాయం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తోంది...

సేంద్రీయంగా సాధికారత వైపు

సేంద్రీయ వ్యవసాయం.. ప్రకృతి వ్యవసాయం.. ఏ పేరుతో పిలిస్తే ఏముంది? ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా.. ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించని వ్యవసాయం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 6.20 లక్షల హెక్టార్ల సాగుభూమిని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకువచ్చింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న మన తెలుగు మహిళ అడిదం నీరజ శాస్త్రి నేతృత్వం వహిస్తున్నారు. ‘‘వ్యవసాయం ఒక వృత్తి కాదు. మన దేశంలో కొన్ని కోట్ల మందికి జీవన విధానం.  ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది’’ అంటున్న నీరజను నవ్య పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు.


నల్ల గోధుమ.. కివీ వైన్‌.. పసుపు క్యాప్స్యూల్స్‌.. వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఈ కొత్త ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఉత్పత్తులన్నింటినీ మహిళా పారిశ్రామికవేత్తలే వెలుగులోకి తీసుకురావటం ఒక విశేషం. ‘‘కివీలతో వైన్‌ చేస్తారని విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయా! ఈ వైన్‌కు జపాన్‌, చైనాలలో మంచి డిమాండ్‌ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కివీలు ఎక్కువగా పండుతాయి. అయితే సరైన మార్కెటింగ్‌ లేకపోవటం.. దూర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి రావటంతో ఈ కివీలు చాలా వరకూ పాడైపోతాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక యూనిట్‌ పెట్టాలనుకున్నాం. మహిళలు ఆ యూనిట్‌ను నడిపితే బావుంటుందనుకున్నాం కూడా. ఆ సమయంలో... కివీ వైన్‌ చేయటానికి ముందుకు  ఐఏఎంలో చదువుకున్న టాజీ రీటా వచ్చారు. మన దేశంలో కివీలతో వైన్‌ చేయటం అదే తొలిసారి. అయినా ఆ వైన్‌ ఎంత ప్రసిద్ధి పొందిదంటే- టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ కోసం కూడా ఆర్డర్లు వచ్చాయి..’’ అంటారు నీరజ. 


తొలి అడుగులు..

మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టింది. ఆ సమయంలో సేంద్రీయ ఉత్పత్తులకు అంతగా డిమాండ్‌ లేదు. సేంద్రీయ వ్యవసాయ విస్తీర్ణం కూడా చాలా తక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (పీకేవీవై) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాలు సహా జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, కేరళలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రొత్సహించటం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి మొదటినుంచీ నీరజ నేతృత్వం వహిస్తున్నారు. ‘‘మన దేశంలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధికి చాలా కీలకం. వ్యవసాయంలో మహిళలు పరోక్షంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. వారి సహకారం లేనిదే ఏ పథకం విజయవంతం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అందుకే ఈ పథకానికి సంబంధించిన ఎక్కువ సక్సెస్‌ స్టోరీలు అక్కడివే ఉంటాయి’’ అంటారు నీరజ. మొదట్లో ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపకపోయినా- ప్రభుత్వం అందించే ప్రొత్సహకాలను గమనించి అనేక మంది రైతులు సేంద్రీయ సాగును చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం 6.2 లక్షల హెక్టార్లలో ఈ తరహా సాగు జరుగుతోంది. 


మహిళలకు సాధికారత..

వ్యవసాయ సంబంధిత అంశాలలో మహిళలకు సాధికారత చాలా తక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని ఔత్సాహిక వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను అందించటం ప్రారంభించారు. దీనితో అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త ఉత్పత్తులతో ముందుకు వచ్చారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది.  నల్ల గొఽధుమలు, నల్ల బియ్యం, ఔషధ విలువలు విరివిగా ఉన్న పసుపు, శిలాజిత్తుతో పరిపుష్టమైన తేనె.. ఇలా ఒకటేమిటి రకరకాల ఉత్పత్తులు మన వద్ద ఉన్నాయి. వీటికి అనేక దేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇప్పుడిప్పుడే ఇతర దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. వచ్చే రెండుమూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం’’ అంటున్నారు నీరజ. 


ఒకో చోట.. 

సేంద్రీయ వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలోను పర్యటించే సమయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు తన దృష్టికి వచ్చాయంటారు నీరజ. ‘‘మన దేశంలో గొప్పతనమేమిటంటే - ఏ రెండు రాష్ట్రాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, వ్యవసాయ పద్ధతులు ఒక విధంగా ఉండవు. ఇవన్నీ స్థానిక పరిస్థితులకు తగినట్లుగా ఉంటాయి. అయితే దేశంలోని అన్ని ప్రాంతాల్లోను మహిళలు కష్టపడే తీరు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. వారు దేశం కోసం ఆలోచించకపోవచ్చు. తమ కుటుంబం కోసం.. తాము నివసిస్తున్న ప్రాంతం కోసం వారు పడే తపనను మనం తప్పనిసరిగా అభినందించాలి’’ అంటారామె. సేంద్రీయ వ్యవసాయం మరింతగా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు తేవాలని ఆశిద్దాం.


కొత్త ఉత్పత్తులివే..

శిలాజిత్తు తేనె

మధ్యప్రదేశ్‌లోని కొన్ని ఆదివాసీ ప్రాంతాల్లోని పర్వత సానువుల్లో శిలాజిత్తు లభిస్తుంది. శిలాజిత్తు జిగురు మాదిరిగా రాళ్ల చీలికలలో ఉంటుంది. దీనిని ఆదివాసీలు సేకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ జిగురును తేనెటీగలు కూడా ఆస్వాదిస్తాయి. శిలాజిత్తుతో తేనెను తయారుచేస్తాయి. ఈ తరహా తేనెలో 57 శాతం దాకా శిలాజిత్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉత్పత్తికి విపరీతమైన గిరాకీ ఉంది. 


నల్ల బియ్యం.. నల్ల గోధుమలు

ఈశాన్య రాష్ట్రాల్లో నల్ల బియ్యం, నల్ల గోధుమలను పండిస్తారు. వీటిలో సాధారణ బియ్యం, గోధుమల కన్నా ఎక్కువ పౌష్టికాహార విలువలు ఉంటాయి. 


పసుపు క్యాప్సుల్స్‌..

పసుపుకి అనేక వ్యాధులను తగ్గించే గుణం ఉంది. అందువల్ల దీనిని ఆయిర్వేదంలో విరివిగా వాడతారు. కరోనా వ్యాప్తి నేపఽథ్యంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచటానికి వీలుగా పసుపుతో క్యాప్స్యూల్స్‌ను కూడా తయారుచేస్తున్నారు.



నల్ల బియ్యం - పోషక విలువలు

వంద గ్రాముల్లో..

  • క్యాలరీలు- 323.
  • కొవ్వులు- 0
  • కొలెస్ట్రాల్‌ -0
  • కార్బోహైడ్రేట్స్‌- 80 గ్రా.
  • చక్కెరలు- 0
  • ప్రొటీన్‌- 0.59 గ్రా.
  • విటమిన్‌ సి- 0.15 మి.గ్రా.
  • ఐరన్‌- 0.41 గ్రా.



నల్ల గోధుమ పిండిలో

  • యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.
  • పోషకాలకు సరైన వనరు
  • అమినో ఆమ్లాలు, విటమిన్లు, లవణాలు ఎక్కువగా లభిస్తాయి.
  • గ్లైసెమిక్‌ నియంత్రణలో తోడ్పడుతుంది. 





ఈశాన్య మహిళల లాభాల పంట


నల్లబియ్యం సాగులో...

లైశ్రమ్‌ రీమా దేవీ... సువాసనతో నిండిన నల్ల బియ్యం (చక్‌ హో) అమ్మకాలు సాగించే రీమాఫుడ్స్‌ కంపెనీ అధిపతి.. మణిపూర్‌లో పండే ఈ ప్రత్యేకమైన బియ్యంలో పోషకాలు అధికపాళ్లలో ఉంటాయి. కింగ్‌ చిల్లీ, వెదురు రెమ్మలు, పుట్టగొడుగులతో తయారు చేసిన పచ్చళ్లు అమ్మాలనే ఆలోచనతో ఈ కంపెనీని 2014లో వెయ్యి రూపాయల స్టైఫండ్‌తో ప్రారంభించారు రీమా. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ పంటలను మార్కెట్‌ చేయడంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం కోసం ఏర్పాటైన మిషన్‌ ఆర్గానిక్‌ వాల్యూ చెయిన్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ (ఎంవోవీసీడీఎన్‌ఈఆర్‌) పథకంలో చేరిన ఆమె నల్లబియ్యం (పోహా), నమక్‌ పరా (స్నాక్‌), టీ వంటివి తయారుచేశారు. అంతేకాదు ఇంఫాల్‌లోని రైతు సంఘాలతో మాట్లాడి నల్లబియ్యాన్ని పండించేలా ఒప్పందం కుదుర్చుకొని, వారికి ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తున్నారు.




ఎందరికో ఆసరాగా...

మహిళలు నిర్వహిస్తున్న మీరా ఫుడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి హంగ్జమ్‌ శుభ్ర దేవీ యజమానురాలు. వివిధ రకాల ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వ్యాపారానికి పెట్టింది పేరు. పచ్చళ్లు, తీపి పదార్థాలు, నిల్వ పండ్ల ముక్కలు, స్వీట్లు మీరా ఫుడ్స్‌లో దొరకుతాయి. ప్రస్తుతం మూడు యూనిట్లు ఉన్న ఈ కంపెనీలో 50 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పాటు పలు స్వయం సహాయక సంఘాలు లబ్ది పొందుతున్నాయి. పచ్చళ్లతో మొదలెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు మణిపూర్‌తో పాటు ఈశాన్య ప్రాంతాల్లోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించింది. ఈ ప్రయాణంలో హంగ్జమ్‌కు మణిపూర్‌ ఆర్గానిక్‌ మిషన్‌ ఏజన్సీ చేదోడుగా నిలిచింది. రైతులతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా, ఉద్యోగులకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించి స్థానిక మహిళల సాధికరతకు తోడ్పడుతున్నారు హంగ్జమ్‌. 2015-16 సంవత్సరానికి గానూ ఆమె ‘నార్త్‌ఈస్ట్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ అవార్డు గెలుచుకున్నారు.




కివి వైన్‌కు ఎంతో డిమాండ్‌

నారా అబా (కివి వైన్‌) మనదేశంలోనే కివి పండు నుంచి తయారుచేసిన మొదటి వైన్‌. కివి పండించే రైతులు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి, అమ్ముకునే లోపు వాటిలో చాలావరకు కుళ్లిపోయేవి. నష్టం వచ్చేది. దాంతో చాలామంది వేరే వృత్తులను చూసుకున్నారు. రైతులకు మేలు జరగాలంటే కివి పండ్ల నుంచి వైన్‌ తయారుచేయడమే మంచి ఆలోచన అనుకున్నారు అగ్రికల్చరల్‌ ఇంజనీర్‌ టగే రీతా. ఆమెకు ఎంవోవీసీడీఎన్‌ఈఆర్‌ ఆర్థిక సాయం అందించింది. ఒక బ్యాచ్‌లో 40 వేల లీటర్ల వైన్‌ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటుచేశారు. కివి పండ్ల నుంచి వైన్‌ తయారు చేయడానికి నాలుగు నెలలు పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా కివీ వైన్‌ ఎక్కువ డిమాండ్‌ ఉంది. కివి వైన్‌కు టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌కు పెద్ద మొత్తంలో ఆర్డర్‌లు వచ్చాయి.


- సివిఎల్‌ఎన్





Updated Date - 2020-11-19T05:38:41+05:30 IST