కరోనాపై సరికొత్త సూపర్‌ హీరో!

ABN , First Publish Date - 2020-03-19T06:25:01+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మాటే వినిపిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ గురించిన చర్చే నడుస్తోంది.

కరోనాపై సరికొత్త సూపర్‌ హీరో!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మాటే వినిపిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ గురించిన చర్చే నడుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా పెద్దవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  చిన్నపిల్లలకు కూడా కరోనా వైరస్‌ మీద అవగాహన కల్పించేందుకు సీబీఎస్‌ఈ వెబ్‌సెట్లో ఒక కామిక్‌ పుస్తకాన్ని ఉంచారు. బొమ్మల రూపంలో సులభంగా అర్థమయ్యేలా ఉన్న ఈ పుస్తకం పిల్లలతో సహా అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. 


ఎవరు రూపొందించారు?

ఛండిగఢ్‌కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ‘కిడ్స్‌, వాయు అండ్‌ కరోనా వూ విన్స్‌ ద ఫైట్‌’ పేరుతో ఆన్‌లైన్‌ కామిక్‌ పుస్తకం రాశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అడిషనల్‌ ప్రొఫెసర్‌ రవీంద్రా ఖజ్వాల్‌, పంజాబ్‌ యూనివర్సిటీ పర్యావరణ అధ్యయన విభాగంలో ప్రొఫెసర్‌ సుమన్‌ మోరే కరోనా వైరస్‌ మీద పిల్లల్లో అవగాహన పెంచేందుకు ఈ పుస్తకం రూపొందించారు. 


ఈ పుస్తకం విశేషాలు..

* ఈ పుస్తకంలో 22 పేజీలున్నాయి. తెల్ల చొక్కాతో సూపర్‌మ్యాన్‌ వేషంలో ఉన్న ‘వాయు’ అనే సూపర్‌ హీరో ముగ్గురు పిల్లలకు కరోనా వైరస్‌ గురించి వివరిస్త్తుంటాడు. ఈ వైరస్‌ సోకకుండా ఎలా జాగ్రత్తపడాలో కూడా చెబుతాడు. 

* మొదటి పేజీలో తల్లితండ్రులు 12 ఏళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలకు కరోనా వైరస్‌ గురించి చెప్పడం ఎంత అవసరమో చెబుతారు. పిల్లలకు కరోనాకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వాలని సూచన ఉంటుంది.

* ముగ్గురు పిల్లలు టీవీలో కరోనా వైరస్‌ గురించి వార్తలు చూస్తారు. వాళ్లకు ఏమీ అర్థం కాదు. దాంతో వాళ్లు ఈ వైరస్‌ గురించి తెలుసుకునేందుకు తల్లితండ్రుల వైపు తిరగడంతో కథ మొదలవుతుంది. అయితే పేరెంట్స్‌ ‘తర్వాత చెబుతాంలే’ అని అనడంతో పిల్లలంతా ‘వాయు’ దగ్గరకు వెళతారు.

* అప్పుడు ‘వాయు’ కరోనా వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది, ఈ వైరస్‌ సోకితే కనిపించే లక్షణాలు, మన ఒంట్లోకి చేరాక ఏం చేస్తుంది, వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలను కామిక్‌ బొమ్మల ద్వారా పిల్లలకు చక్కగా వివరిస్తాడు. వారికి అవగాహన పెంచుతాడు. 


ఆలోచన వచ్చిందిలా

‘‘మొదటగా ఈ పుస్తకాన్ని పిల్లలకు కాలుష్యం మీద అవగాహన పెంచాలనే ఉద్దేశంతో రూపొందించాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగా అన్ని క్యారెక్టర్లు రాసుకున్నాం. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి తెలియడంతో ప్రమాదకరమైన ఈ వైరస్‌ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం అత్యవసరం అని భావించి మార్పులు చేసి దీన్ని తీసుకువచ్చాం. నేను, నా బృందం కరోనా గురించి పూర్తి వాస్తవ సమాచారం సేకరించేందుకు చాలా పరిశోధన చేశాం. కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్లలో ఉన్న కొంత సమాచారాన్ని తీసుకొని కామిక్‌లో పొందుపరిచాం’’ అంటారు ప్రొఫెసర్‌ రవీంద్ర. 


డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు

* నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ డిసీజ్‌ అధికారులు ఈ కామిక్‌ పుస్తకాన్ని పరిశీలనగా చూసి ఓకే చెప్పారు. దాంతో ఆరోగ్య శాఖ ఈ పుస్తకాన్ని సీబీఎస్‌ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఝజీుఽజీట్టటడౌజజ్ఛ్చిజ్టూజి.ఛిౌఝ, ఛిఛట్ఛ.ఛిౌఝ వెబ్‌సైట్లలోకి వెళ్లి ఈ ఆన్‌లైన్‌ కామిక్‌ బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విదేశీయులు సైతం ఈ కామిక్‌ బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.  


విదేశీ భాషల్లోకి...

* చెక్‌ రిపబ్లిక్‌, చైనా, జపాన్‌, కెనడాతో పాటు మరికొన్ని దేశాలు ‘కిడ్స్‌, వాయు అండ్‌ కరోనా, వూ విన్స్‌ ద ఫైట్‌’ కామిక్‌ పుస్తకాన్ని తమ భాషల్లో ముద్రించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.

Updated Date - 2020-03-19T06:25:01+05:30 IST