అక్క నుంచి అమ్మనయ్యాను!
ABN , First Publish Date - 2020-05-13T06:14:23+05:30 IST
పనులు లేక, పూట తిండికి నోచుకోని గిరిజనుల దైన్యం ఆమెను పల్లె బాట పట్టించింది. ట్రాక్టర్ల మీదా, బైకుల మీదా ప్రయాణించారు. వాహనాలు వెళ్ళలేని మార్గాల్లో మైళ్ళ కొద్దీ నడిచారు. కొండలు ఎక్కారు. వాగులు దాటారు. స్వయంగా సరుకుల మూటలు...

పనులు లేక, పూట తిండికి నోచుకోని గిరిజనుల దైన్యం ఆమెను పల్లె బాట పట్టించింది. ట్రాక్టర్ల మీదా, బైకుల మీదా ప్రయాణించారు. వాహనాలు వెళ్ళలేని మార్గాల్లో మైళ్ళ కొద్దీ నడిచారు. కొండలు ఎక్కారు. వాగులు దాటారు. స్వయంగా సరుకుల మూటలు మోశారు. ఆపన్నుల ఆకలి తీర్చారు. 48 రోజులుగా సాగుతున్న ఈ సేవా ప్రయాణంలో ఆమె 470కి పైగా పల్లెలూ, గూడాలూ, వాడలను సందర్శించారు. అందుకే ఇప్పుడు ఆమె వాళ్ళకు సీతక్క కాదు... సీతమ్మ! ‘‘ఈ కరోనా విపత్తు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది’’ అంటున్న ఈ యాత్రలో తెలంగాణా రాష్ట్ర ములుగు ఎమ్మెల్యే, ఆలిండియా మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ అలియాస్ సీతక్క తన సేవా విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘కరోనా కాలం... పనులు లేక, పూట గడవక ఆదివాసీలు అవస్థ పడుతున్నారు. ఆ రోజు తాడ్వాయి అడవుల్లోని మొండెలతోగు అనే గొత్తి కోయగూడానికి సరుకులు పంచడానికి వెళ్ళాం. నేను వస్తున్న విషయం తెలిసి ఒక బాలుడు చేతిలో గిన్నె పట్టుకొని ఎదురొచ్చాడు. ప్రతిరోజూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా నిత్యావసరాలతోపాటు పులిహోర, అన్నం, పప్పు వండి, తీసుకువెళ్ళి, వడ్డిస్తూ వచ్చాం. కానీ, ఆ రోజే ఎందుకో వంట చేయించలేదు. ఖాళీ గిన్నెతో ఎదురొచ్చిన ఆ చిన్నారిని చూస్తే కడుపు తరుక్కు పోయింది. నేను అన్నం పెడతానని రెండుగంటలకు పైగా ఆ పిల్లాడు నా పక్కనే తచ్చాడాడు. చివరకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా తీసుకోలేదు. అప్పుడు నిర్ణయించుకున్నా- ఇక నుంచి ఏ ఆదివాసీ గూడానికి వెళ్లినా భోజనం వెంట తీసుకువెళ్లాలని!
అసలు ఈ కథ ఎలా మొదలైందో చెప్పాలి. లౌక్‌డౌన్ వల్ల అవస్థలు పడుతున్న సామాన్యులకు సాయం చెయ్యడం కోసం నా ప్రయాణం ఇప్పటికి 48 రోజుల క్రితం ప్రారంభమైంది. మార్చి 26న ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డకు చెందిన ఇరవై మంది నిరుపేద కూలీ కుటుంబాలకు అయిదు కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేశాం. జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రజల పరిస్థితే ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో అనిపించింది. ఆరా తీస్తే పనులు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక అనేకమంది అల్లాడుతున్నారని తెలిసింది. వెంటనే సేవాయాత్రను మొదలుపెట్టాం. ఇప్పటికే మా ములుగు నియోజకవర్గంలో 470కి పైగా జనావాసాల్లో, సుమారు 25 వేల కుటుంబాలకు సరుకులు అందించాం. ఇప్పటి వరకూ 550 క్వింటాళ్ళకు పైగా బియ్యం, అంతకు మించి కూరగాయలు పంపిణీ చేశాం. మరో 110 పల్లెలూ, గూడాలు మిగిలి ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో వాటికి కూడా సాయం అందిస్తాం. మా పొరుగు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కూడా సరుకులు పంపిణీ చేశాం. కానీ జనావాసాలకు దూరంగా ఆకలితో అలమటిస్తున్న అనేకమందికి అన్నం పెడదామంటే దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పోలీసులు అనుమతించడం లేదు.
ఆ తృప్తితో అలసట కొట్టుకుపోతుంది
ములుగులోని నా క్యాంప్ కార్యాలయం ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లా మారిపోయింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులతో నిండిపోతోంది. మర్నాడు చేయాల్సిన యాత్ర కోసం ముందురోజే షెడ్యూల్ తయారుచేసుకుంటున్నాం. ఏయే గ్రామాలకు వెళ్లాలి? అక్కడ ఎంతమంది పేదవాళ్లు ఉన్నారు? ఎన్ని సరుకులు తీసుకువెళ్ళాలి అని లెక్కలు వేసుకుంటున్నాం. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే ముందు నా వాహనం, వెనుక సరుకుల బళ్ళు బయలుదేరుతున్నాయి. ఒక్కోరోజు రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణం సాగుతోంది. రోజూ అయిదు క్వింటాళ్లకు తగ్గకుండా బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పులను పంచిపెడుతున్నాం. ‘‘మీరెందుకు వెళ్ళడం? ఎవరితోనైనా పంపిస్తే సరిపోతుంది కదా!’’ అని కొందరు అన్నారు. కానీ, అమ్మ స్వయంగా వండి,, బిడ్డలకు తినిపిస్తే లభించే సంతృప్తి ముందు ఎంతటి అలసటైనా కొట్టుకుపోతోంది కదా!
అలాంటి ప్రాంతాన్ని జీవితంలో చూళ్ళేదు!
నా సోదరి, ములుగు సబ్ రిజిస్ర్టార్ తస్లీమ్ మహమ్మద్ చేసిన ‘గో హంగర్ గో’ ఛాలెంజ్‌ను స్వీకరించాను. మేమిద్దరం వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి ఇద్దరం బయలుదేరాం. ‘అమ్మ ఫౌండేషన్’ వారు నిత్యావసరాలను సమకూర్చారు. ఇన్నేళ్ళ నా జీవితంలో అలాంటి ప్రాంతాన్ని ఎన్నడూ చూసి ఎరుగను. పదిహేను కిలోమీటర్ల దూరం ఉండే అడవిలో గుట్ట మీద ఉన్న ఆ గ్రామానికి చేరుకోవడం సాహసమే. అక్కడికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. అయిదు గుట్టలు, మూడు వాగులు దాటాం. మేము తీసుకువెళ్లిన వాహనాలు రాళ్ల దారిలో దెబ్బ తినడంతో అక్కడే వదిలేసి వెళ్ళాం. కనీసం కరెంటు సదుపాయమైనా లేకుండా, బాహ్య ప్రపంచానికి దూరంగా ధైర్యంగా బతుకున్న అక్కడి ఇరవై కుటుంబాలు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ప్రకృతితో మమేకమై, రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకుల్లో మార్పుతేవాలన్న సంకల్పం నాలో కలిగింది. ఆ దిశగా నా ప్రయత్నం సాగుతోంది.

వలస కూలీలను స్వస్థలాలకు పంపించాం
కరోనా విలయం పేదల రెక్కలను కట్టేసింది. డొక్కలను మాడ్చేస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి ముంబయ్ వలస వెళ్లిన కూలీలు నాకు ఫోన్ చేసి, వారి ఇబ్బందుల గురించి చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ముంబయ్‌లో ఉన్న 700 మందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ఫండ్ కింద నిత్యావసరాలు అందేలా చేశాం. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పనిచేస్తున్న వందమందికి పైగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు చెందిన వలస కూలీలను స్వస్థలాలకు పంపించాం. గమ్యం చేరిన తర్వాత వారు నాకు ఫోన్ చేసి, క్షేమ సమాచారంతో పాటు కృతజ్ఞతలు చెబుతుంటే నా మనసు కాస్త నెమ్మదించింది.
శక్తి ఉన్నంతకాలం సేవ చేస్తా!
నిజం చెప్పాలంటే... ఆకలిని మించిన శత్రువు లేదు. దాన్ని పేదలకు దూరం చెయ్యాలన్నదే నా తపన. అక్క వస్తే అన్నం తెస్తుందని మారుమూల గూడెం జనం ఇప్పుడు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే నాలో శక్తి ఉన్నంతకాలం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను. ప్రభుత్వ సాయం, ఆపన్న హస్తం అందక లక్షలాదిమంది అలమటిస్తున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించడంలో రాజకీయ కోణాన్ని వీడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి అందరికీ బియ్యం, నిత్యావసరాలు అందించాలి. ఆర్థికంగా చేయూతనివ్వాలి.
మా చేతులు కట్టెయ్యకండి!
అందరూ మానవత్వాన్ని చాటాల్సిన సమయం ఇది. కానీ కొందరు రాజకీయాలు చేయడం చూసి ఆవేదన కలుగుతోంది. కరోనానుంచి రక్షణ కోసం ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని గడచిన అసెంబ్లీ సమావేశాల్లో నేను కోరితే మాస్కులెందుకని సీఎం కె. చంద్రశేఖరరావు అవహేళనగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాస్క్ ధరించనివారికి గరిష్ఠంగా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జీవో జారీ చేయించారు. దీన్ని ఏమనాలి? నేను నటిస్తున్నానంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు నటించడం రాదు. అవసరంలో ఉన్న వారికి అన్నం పెట్టలేకపోతే కనీసం అంబలైనా పోయండి. కానీ, చేతనైన సాయం చేస్తున్న చేతులను కట్టేసే ప్రయత్నం మాత్రం చేయకండి! అదే నా వినతి.
ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నా
పదహారేళ్ళ ప్రాయంలోనే తుపాకీ చేతపట్టి, అడవి బాటపట్టి, నక్సలైట్‌గా మారాను. ఎనిమిదేళ్ళు అజ్ఞాతంలో ఉన్నాను. అప్పుడూ, పదహారేళ్ళ నా రాజకీయ జీవితంలో అంతా నన్ను ‘అక్కా’ అని పిలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ‘అమ్మా’ అని పిలుస్తున్నారు. ఆ మాట వింటున్నప్పుడు నా కళ్ళు చెమరుస్తున్నాయి. బుక్కెడు బువ్వ పెడితే కృతజ్ఞతగా చూస్తున్న ప్రాణాలు నాలో స్ఫూర్తిని నింపుతున్నాయి. నక్సలిజం, రాజకీయాల కన్నా కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పింది. భవిష్యత్తులో నా లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా, సూటిగా చూపించింది.
ఆ కవిత ఉత్తేజపరచింది!
‘‘కరోనా సంక్షోభ సమయంలో నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల్లో స్థిరపడిన అనేకమంది నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఎన్నారైల ద్వారా ఇప్పటి వరకూ రూ. 3.20 లక్షలు సమకూరాయి. ఇంకా సాయం వస్తూనే ఉంది. ఈ విరాళాలతో అత్యవసర నిధి ఏర్పాటు చేసి, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలకు ఖర్చు చేద్దామనుకుంటున్నాను. నా కార్యక్రమాలపై స్పందిస్తూ, ‘‘తంగేడు లేకుండా బతుకమ్మ లేదు, సీతక్క లేకుండా తెలంగాణ లేదు’’ అంటూ ప్రవాస భారతీయుడు సందీప్ వంగాల ఫేస్‌బుక్‌లో నా గురించి ఓ కవిత రాశాడు. ఆ పదాలు నాలో మరింత ఉత్తేజాన్ని నింపాయి.’’
