తలైవా వస్తున్నాడు..
ABN , First Publish Date - 2020-12-13T18:22:50+05:30 IST
డిసెంబర్ 12... నిన్ననే వెళ్లిపోయింది. తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రోజు...

డిసెంబర్ 12... నిన్ననే వెళ్లిపోయింది. తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రోజు... పొంగల్.. క్రిస్‌మస్.. రంజాన్ కలిసి వచ్చినంత సంబరం. ఆ రోజు తమ అభిమాన హీరో రజనీకాంత్ పుట్టినరోజు. అందుకే సంబరాలు మిన్నంటుతాయి. ఇక రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే పక్కనున్న మలేషియా, సింగపూర్‌లలోనే కాదు ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికాలలో కూడా సందడే సందడి. అందుకే ఆసియాలో జాకీచాన్ తరవాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ రజనీ సార్ అంటారు ఫ్యాన్స్.
రజనీ మానియా...
అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ రజనీకాంత్‌కి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆయన పుట్టిన రోజంటే అభిమాన సంఘాలు అన్నదానాలు, రక్తదానాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం మామూలే. వీటన్నిటితో పాటు రజనీ సార్ ఏదైనా ప్రకటన చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. రజనీ ప్రతి చిత్రంలో రాజకీయాలకు సంబంధించి ఒక డైలాగ్ ఉంటుంది కాబట్టి, ఆ డైలాగ్‌ను పట్టుకుని.. గత ఇరవై అయిదేళ్లుగా ప్రతి డిసెంబర్ 12 న వేయి ఆశలతో ఎదురుచూస్తూనే ఉన్నారు. తన బర్త్‌డే నాడు ‘బీ రెడీ.. ఐయామ్ కమింగ్’ అని ఆయన ఒక్క ప్రకటన చేస్తారేమోనని చూస్తూ ఉన్నారు. కానీ అంతులేని నిరాశే మిగిలేది. ఎన్నోసార్లు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచాయగా మాట్లాడినా.. మళ్లీ వెనకడుగు వేసేవారు. ఏదీ తేల్చేవారు కాదు. ఈ ఏడాది మాత్రం పుట్టిన రోజుకు ముందే రజనీ ప్రకటించాడు రాజకీయాల్లోకి వస్తున్నట్టు. అంతేకాదు 2021 మేలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించి అభిమానుల్ని ఆనందంలో ముంచేశాడు. ‘మారుద్దాం... అన్నింటినీ మారుద్దాం... ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’ అంటూ శ్రేణులకు పిలుపునిచ్చాడు. డెబ్భయ్యోపడిలో తన జీవితానికి సంబంధించి అతి పెద్ద అడుగు వేయబోతున్నాడు తలైవా.
బెంగళూరులో పుట్టిన మరాఠీ
రజనీకాంత్‌గా తెరపై పరిచయం అయిన ఈ సూపర్‌స్టార్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. బెంగళూరులో జన్మించాడు. మరాఠీ కుటుంబం. చిన్నప్పుడే అమ్మ మరణించింది. నాన్న, అన్నయ్యలు పెంచిపెద్దచేశారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు అల్లరి పిడుగు. మొండి ఘటం. సినిమాల్లోకి రాకముందు జీవనభృతి కోసం కార్పెంటర్‌గా, కూలీగా ఎన్నో అవతారాలెత్తాడు. ఆఖరుకి బెంగళూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. తొలి సంపాదన రూ.750. నాటకాలంటే భలే ఇష్టం. ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక బలపడింది. నాన్న వారించినా వినకుండా, స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని మద్రాస్‌కు వెళ్లిపోయి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఓ నాటకం వేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దృష్టిలో పడ్డాడు. తన సినిమాలో నటించే అవకాశమిస్తానని అభయం ఇస్తూనే.. తమిళంలో మాట్లాడితేనే అంటూ ఓ షరతు పెట్టాడాయన. దాంతో తక్కువ సమయంలో తమిళం నేర్చుకోవడమే కాదు అందులో ప్రావీణ్యం సంపాదించాడు శివాజీ. బాలచందరే అతడి పేరును ‘రజనీకాంత్’గా మార్చారు.
తెలుగులోనే మొదట హీరోగా...
‘అపూర్వరాగంగల్’తో 1975లో తెరంగేట్రం చేశాడు రజనీ. తొలి రెండేళ్లు అన్నీ నెగటివ్ క్యారెక్టర్లే. తమిళ చిత్రంతో హీరో అయ్యాడనుకుంటే పొరపాటే. తెలుగు చిత్రం ‘చిలకమ్మ చెప్పింది’ ద్వారా హీరోగా తొలి అవకాశం వచ్చింది. మొదటి కమర్షియల్ చిత్రం మాత్రం తమిళ ‘బిల్లా’నే. అది 1980. ఇక అప్పటి నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. హిట్, సూపర్ హిట్లు కొడుతూ బ్లాక్‌బస్టర్‌లనూ సాధించాడు. 1995 ‘బాషా’ విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పీకల్లోతు అవినీతి ఆరోపణలలో మునిగిపోయింది. ‘రాజకీయాల్లోకి రావడం ఖాయం, ఎప్పుడు వస్తానో ఎవ్వరికీ తెలియదు’ అని నర్మగర్భంగా మాట్లాడాడు రజనీకాంత్. అభిమానుల్లోనే కాదు తమిళనాడు ప్రజల్లో ఒక్కసారిగా ఆశలు రేగాయి అతడిపై. కానీ తమిళనాట కెప్టెన్‌గా ప్రసిద్ధిచెందిన హీరో విజయ్‌కాంత్ చెన్నైలోని మెరీనా బీచ్‌లో పెద్ద బహిరంగ సభ నిర్వహించాడు. దానికి కరుణానిధిని అతిథిగా ఆహ్వానించి ఆయనకు బంగారు కలాన్ని బహూకరించాడు. ఆ బంగారు పెన్నుతోనే కరుణానిధి సీఎంగా తొలి సంతకం చేయాలని కోరాడు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో కరుణానిధి అఖండ విజయం సాధించాడు. రజనీ డీఎంకేకు మద్దతు ఇవ్వడమే కాదు, ఆమె (జయలలిత) మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడని విమర్శించాడు. ఆ తరవాత స్తబ్దుగా ఉండిపోయాడు సినిమాలు చేసుకుంటూ. సినిమాల్లో రజనీ మ్యానరిజమ్స్, స్టయిల్, నడక, పంచ్‌డైలాగ్స్ 50 వేలకు పైగా ఫ్యాన్స్ క్లబ్స్ ఏర్పడేలా చేశాయి. వాళ్లందరూ ముద్దుగా ‘తలైవా (నాయకుడు)’గా పిలవడం పరిపాటి. తెరపై స్టయిల్‌కి మరో పేరు రజనీ. అందుకే ఆయన పుట్టిన రోజుని ‘వరల్డ్ స్టయిల్ డే’గా జరుపుకుంటారు.
అతి సామాన్యం
‘శివాజీ’ చిత్రంతో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా ఆసియాలో రెండో స్థానంలో నిలిచాడు. అంత ఎదిగినా కూడా ఎంతో సింపుల్‌గా ఉండడం రజనీ నైజం. వెండితెరపై అసాధారణ హీరో కానీ బయట మాత్రం అతి సామాన్యం. నిజజీవితంలో ఎలాంటి భేషజాలు ఉండవు. కనీసం పౌడరు అద్దుకున్న దాఖలాలు కూడా కనిపించవు. క్రమశిక్షణకు మారు పేరు. రాత్రి తొమ్మిది దాటితే ఎవరినీ కలుసుకోడు. ప్రతి సినిమా విడుదల తరవాత హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేయడం ఆయనకు అలవాటు. ఇలా 1995 నుంచి జరుగుతోంది.
పొలిటికల్ టైమ్ లైన్
1995 : ‘ఎప్పుడు వస్తాననేది ఎవ్వరికీ తెలియదు. కానీ సరైన సమయంలో ప్రవేశిస్తాను..’
1996 : ‘ఆమె (జయలలిత) మళ్లీ అధికారంలోకి వస్తే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు..’ (తన పిలుపు మేరకే ప్రజలు జయలలితకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈనాటికీ రజనీ చెబుతారు).
1998 : కరుణానిధి, మూపనార్‌లకు సఖ్యతను తెలిపారు. లోక్‌సభలో డిఎంకే- మూపనార్ టీఎంసీ ద్వయాన్ని సమర్థించారు.
1999- 2003 రాజకీయాల గురించి మౌనంగా ఉన్నారు.
2004 : ఎస్.రామస్వామి స్థాపించిన పిఎంకే పార్టీ అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించమని రజనీ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో డీఎంకేతో చేతులు కలిపిన పీఎంకే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది.
2004- 2014 మౌనాన్నే ఆశ్రయించారు.
2014 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ.. రజనీకాంత్ ఇంటికి వచ్చారు. రజనీ బీజేపీకి మద్దతు చెప్పలేదు మౌనంగానే ఉన్నారు. కానీ మోదీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మే, 2017 : అభిమాన సంఘాలను ప్రత్యేకంగా కలవడం మొదలు పెట్టారు. రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది.
డిసెంబర్ 2017: రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు.
మార్చి 2020 : సీఎం పదవిపై ఆసక్తి లేదని ప్రకటిస్తూనే తన రాజకీయ విజన్‌ను ప్రకటించారు. ప్రజల బాగోగుల కోసం ఉద్యమం చేపట్టాలని రజనీ ప్రకటించారు.
తిరుగులేని డైలాగ్స్
- దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు
- నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు
- న్యాయానికి బంధం బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు
- నా దారి... రహదారి
- కష్టపడందే ఏదీ రాదు... కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు
- ఒక పిరికివాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు
- అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు
- నాన్నా పందులే గుంపుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది
- ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది... ఏదో నీకు కావలసినంత ఉంచుకుని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది
- తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత
అభిరుచులు..
ఆహారం: మసాలా దోశ
నటులు: అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, సిల్వెస్టర్ స్టాలోన్
నటీమణులు: రేఖ, హేమమాలిని
సంగీతకారుడు: ఇళయరాజా
రాజకీయవేత్త: లీ క్వాన్ యూ (సింగపూర్ మాజీ ప్రధాన మంత్రి)
సామాజికవేత్త: అన్నా హజారే
క్రీడ: క్రికెట్
ప్రదేశం: హిమాలయాలు
రంగు: నలుపు
ఎంజీఆర్ -2 కాగలరా?
నేటికీ తమిళుల ఆరాధ్య తెరవేల్పు, ప్రియతమ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్. ఆయన నటించిన సినిమాల్లో పాతిక వంతు ద్రవిడ సిద్ధాంతంపైనే నడిచాయి. ఎంజీఆర్ రాత్రికి రాత్రే సీఎం అయిపోలేదు. ఆయన 1953 వరకూ కాంగ్రెస్ సభ్యుడు. ఖాదీనే ధరించేవాడు. సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలు నచ్చి డీఎంకేలో చేరాడు. కానీ పదేళ్లు వెయిట్ చేస్తే కానీ ఎన్నికలకు అవకాశం రాలేదు. ఎంఎల్‌సీగా 1962లో ఎన్నికయ్యాడు. అయిదేళ్ల తరవాత ఎంఎల్‌ఏ అయ్యాడు. అప్పుడు ఎంజీఆర్‌కి యాభై ఏళ్ల వయసు. అన్నాదురై మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్ ట్రెజరర్‌గా సరిపెట్టుకున్నారు. ఇద్దరికీ విభేదాలు రావడంతో 1972లో ఎంజీఆర్ బయటికి వచ్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు. 1977లో కానీ ముఖ్యమంత్రి కాలేదు. అంత పెద్ద హీరో అయినా ఎంజీఆర్ సీఎం కావడానికి ఇన్నేళ్లు కష్టపడాల్సి వచ్చింది. కరుణానిధి సినీ రచయితగా ద్రవిడ సిద్ధాంతాన్ని కీర్తిస్తూ ఎన్నో సినిమాలకు డైలాగులు రాశారు. ఆ రంగంలో ఆయనకు ఎంతో పేరుంది. ఇక జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు ఏఐఏడీఎంకే ప్రచార సెక్రటరీగా రాజ్యసభ సభ్యురాలిగా చేశారు. రాజకీయాల్లో అసలు ప్రవేశమే లేని రజనీకాంత్ ఆంధ్రుల ఆరాధ్యనటుడు ఎన్టీఆర్‌లా ప్రభంజనం సృష్టించగలరా? ఎంజీఆర్‌ను ‘యుగపురుషుడు’ గా రజనీ కీర్తిస్తారు. మరో వెయ్యేళ్లు గడిచినా ఎంజీఆర్‌లాంటి నేత రాడు, నేను ఎంజీఆర్‌ను కాను, కాలేను. కానీ ఆయన లాంటి పరిపాలన అందిస్తా’నని రజనీ భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆయన బయటివాడు..
రాజకీయ పార్టీ నెలకొల్పుతానని రజనీకాంత్ ప్రకటించగానే.. ‘అతడు తమిళుడు కాదు’ అనే వాదాన్ని కొంతమంది లేవనెత్తారు. తమిళనాడులో ఓ విచిత్ర సంప్రదాయం నడుస్తోంది. ఎంజీఆర్ శ్రీలంకలో పుట్టిన మలయాళీ, జయలలిత కన్నడిగురాలు, కరుణానిధి మాతృభాష తెలుగు. విజయ్‌కాంత్ కూడా తెలుగువాడే. ఆ మాటకొస్తే ద్రవిడ ఉద్యమం ప్రారంభించిన ఈవీ రామస్వామి నాయకర్ తల్లిభాష తెలుగే. రజనీకాంత్‌ని పక్కా తమిళవాడు కాదు అనే వాళ్లందరికీ ఆయన చెప్పే సమాఽధానం ఒకటే. ‘ఇరవై రెండేళ్లు మాత్రమే నేను బెంగళూరులో ఉన్నా. ఆ తరవాతంతా చెన్నైలోనే, ఈ మట్టిలో కలిసిపోయాను’ అంటాడు. అయినా సరే తమిళనాడులో ప్రాంతీయత ఒక బలమైన భావోద్వేగం. ప్రాంతీయ పార్టీల చేతుల్లో లోకల్, నాన్‌లోకల్ అనేది బలమైన అస్త్రం కానుంది.
తొమ్మిది గంటల నిరాహార దీక్ష
సినిమాలు తప్పితే తమిళుల కోసం రజనీకాంత్ చేసిందేమీ లేదని ద్రవిడ నేతలు విమర్శిస్తున్నారు. అది నిజమని చాలా సందర్భాలలో నిరూపితమైంది. సమస్య తలెత్తినప్పుడు రజనీ గొంతు విన్పించింది కొన్నిసార్లే. 2002లో కావేరీ జలాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ‘రజనీ స్పందించకుండా, మాతృభూమి కన్నడసీమకు మద్దతు ఇస్తున్నాడ’ని దర్శకుడు భారతీరాజా దుమ్మెత్తిపోశాడు. ఆ మరుసటి రోజే తొమ్మిది గంటల నిరాహార దీక్ష చేస్తూ, తక్షణమే తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్ చేశాడు రజనీ. నదీ జలాల సమస్య తీరడానికి హిమాలయ నదులతో ద్వీపకల్పనదులను అనుసంధానం చేయడానికి తన వంతుగా కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. కానీ పద్దెనిమిది ఏళ్లయినా ఆ సమస్యలో కదలిక లేదు. 2008లో హోగెనెక్కల్ ప్రాజెక్టు విషయంలో కూడా కర్ణాటకపై దాడి చేశాడు రజనీ. అయితే అతడి ‘కుసేలన్’ సినిమాను అడ్డుకుంటామని కన్నడిగులు ఎదురుదాడికి దిగేసరికి తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. భవిష్యత్తులో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆచితూచి మాట్లాడతానని తెలియజేశాడు. అప్పటి నుంచి ఎన్నో సామాజిక సమస్యలు వచ్చినా మౌనంగానే ఉండిపోయాడు. తమిళనాడు ఫిల్మ్‌ఫెడరేషన్ గొడవల్లోనూ ఆయన మిన్నకుండిపోయాడు. విశాల్‌లాంటి హీరోలు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడారు.
అక్కడ అంతే
తమిళనాడులో సినిమాలకూ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. తెరవేల్పులనే తమ ప్రియతమ నాయకులుగా చూడాలని కోరుకుంటారు అభిమానులు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా వచ్చిన వారే. సినిమాలను తమ రాజకీయ ఎదుగుదలకు బలమైన సాధనంగా మార్చుకున్న వాళ్లే. ఇన్నేళ్లూ గుంభనంగా ఉన్న రజని నేడు ఒక్కసారిగా ఎందుకు బయటికి వచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకరకమైన అనిశ్చితి. జయలలిత అకస్మిక మరణం అక్కడ ఓ అగాధాన్ని ఏర్పరచింది. ఎత్తుకుపైఎత్తులు వేయగల కరుణానిధి నేడు జీవించిలేరు. అందుకే ద్రవిడ పార్టీలతో పాటు మిగతా వారి కళ్లు కూడా రానున్న ఎన్నికలపై పడ్డాయి. కమల్‌హాసన్ ఇప్పటికే పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో పావులు కదుపుతున్నాడు. ఇంతకాలమూ తండ్రి చాటు బిడ్డగా ఉన్న ఎం.కె.స్టాలిన్‌కు, అతడి నేతృత్వంలోని డీఎంకే పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. రజనీకంటే స్టాలిన్ మూడేళ్లే చిన్నవాడు. ఇక 95 నుంచి రజనీ రాజకీయ అరంగేట్రం కోసం కాచుకుని కూర్చున్న అభిమానులందరూ యాభైలలోకి చేరువయ్యారు. ఈ అయిదు నెలల సమయంలో వాళ్లెంత హుషారుగా రజనీకోసం పనిచేయగలరు అన్నది ప్రశ్నార్థకమే. విజయ్‌కాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి, పార్టీ స్థాపించి కూడా చక్రం తిప్పలేకపోయాడు. నేడు టాప్‌హీరోలుగా ఉన్న విజయ్, అజిత్‌లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలే యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. డిసెంబర్ 31న రాజకీయ పార్టీపేరు వెల్లడిస్తానని రజనీ అంటున్నారు. ఈ కొద్దిపాటి సమయంలో ధీటైన పార్టీ అభ్యర్థులని ఎంచుకోగలరా? నేటి పోటాపోటీ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయగలరా? బరిలోకి రానంతవరకే రజనీ హీరో. ఒక్కసారి పాలిటిక్స్‌లోకి వస్తే... ప్రతి ఒక్కరూ విమర్శల వర్షం కురిపిస్తారు. అసలు రాష్ట్రానికి ఏమి చేయబోతున్నావు? నీ విధానాలేంటి? కేంద్రంపై నీ వైఖరి ఏంటి? ఇలాంటివన్నీ అడిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికీ ఆచితూచి అడుగులు వేసే రజనీకాంత్... ఈ ధాటికి తట్టుకోగలరా? అనేది ఆయనకు సవాలుగా మారనుంది. తక్కువ సమయంలో.. పార్టీ పేరు, గుర్తును ప్రజల్లో తీసుకెళ్లగలరా? గ్రామస్థాయిలో ప్రచారం చేయగలరా? వయసుమీద పడటం, కిడ్నీ మార్పిడి, అంతంత ఆరోగ్యం, కరోనా కారణంగా రాష్ట్రమంతా తిరిగి రజనీ ప్రచారం చేయగలరా..? ఇదివరకు సినిమావాళ్లను ఆదరించినట్లు ఇప్పుడు ఆదరించగలరా? ఇవన్నీ ప్రశ్నార్థకాలే!. ఆయన సినీ చరిష్మా ముఖ్యమంత్రి పీఠం వరకూ తీసుకువెళుతుందా? మరో అయిదు నెలల వరకూ ఆగవలసిందే?.
- డి.పి.అనురాధ