ఈ గ్రహణం వీడిపోతుంది!

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

ఖగోళపరంగా సంభవించే గ్రహణాల ప్రభావం జీవకోటి మీద ఉంటుందని ప్రాచీన భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ప్రభావాన్ని తగ్గించే చర్యలను జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది...

ఈ గ్రహణం వీడిపోతుంది!

ఈ నెల 21న సూర్య గ్రహణం


ఖగోళపరంగా సంభవించే గ్రహణాల ప్రభావం జీవకోటి మీద ఉంటుందని ప్రాచీన భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ప్రభావాన్ని తగ్గించే చర్యలను జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది.


ఖగోళ శాస్త్ర పరంగా గ్రహణాలకు విశిష్టత ఉంది. గ్రహణ సమయాలను కచ్చితంగా నిర్ధారించడం సనాతన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. వివిధ రాశులపై గ్రహణాలు చూపే ప్రభావం గురించి జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కరోనా మహమ్మారి సర్వమానవాళినీ భయపెడుతున్న ఈ సమయంలో... ఈ నెల 21వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావం ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష పండితులు చేస్తున్న సూచనలు:

సూర్యగ్రహణాలు అమావాస్య రోజున ఏర్పడతాయి. ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం ఏర్పడే ఈ గ్రహణాన్ని ‘చూడామణి నామక సూర్యగ్రహణం’ అని పిలుస్తున్నారు.  ఇది ఆదివారం ఉదయం సుమారు 10.14 నిమిషాలకు ప్రారంభమై, మధ్యాహ్నం దాదాపు 1.51నిమిషాలకు ముగుస్తుంది. ప్రాంతాల వారీగా కొన్ని నిమిషాల హెచ్చు తగ్గులు ఉండవచ్చు. 


జోస్యుల మాట...

ఇది మిథున రాశిలో సంభవిస్తోంది కాబట్టి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలవారు చూడకూడదని పండితులు చెబుతున్నారు. మేషం, కన్య, మకర, సింహ రాశుల వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుందనీ, వృషభ, ధనుస్సు, తుల, కుంభ రాశులకు మధ్యమ ఫలం లభిస్తుందనీ, మిథునం, వృశ్చికం, కర్కాటకం, మీన రాశులకు అధమ ఫలం ఉంటుందనీ జోస్యుల మాట. గ్రహణం సంభవించే మిథున రాశి వారు శాంతులు చేయించుకోవడం శ్రేయస్కరమని వారి సూచన.


ఇవీ సూచనలు

గ్రహణం సందర్భంగా సనాతనులు సూచించే నియమాలు ఇలా ఉన్నాయి...


 1. గ్రహణ సమయంలో నక్షత్ర జపాలు చేసుకోవడం శ్రేయస్కరం. 
 2. గురుముఖంగా ఉపదేశం పొందిన మంత్రాలను జపం చేయాలి.
 3. సూర్య స్తుతి, సూర్య గాయత్రి చదువుకోవడం మంచిది. 
 4. గ్రహణం తరువాత ఇంటినీ, పూజా మందిరాన్నీ శుభ్రం చేసుకోవాలి.
 5. పూజామందిరంలోని దేవతా విగ్రహాలను శుద్ధి చేయాలి.
 6. తరువాత దీపారాధన చేసి, సూర్యుడికి ప్రీతికరమైన పరమాన్నాన్ని నివేదించాలి. 
 7. గ్రహణానికి ముందు వండిన పదార్థాలు తినకూడదు. గ్రహణ స్నానం తరువాత శుచిగా వండుకొని తినాలి. 
 8. గ్రహణ సమయంలో దైవస్మరణతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 


సూర్యగ్రహణ పీడా పరిహార స్తోత్రం

గ్రహాధిపతి అయిన సూర్యుణ్ణి ప్రార్థిస్తే, గ్రహణం కారణంగా సంభవించే గ్రహ పీడలు తొలగిపోతాయని సనాతన సంప్రదాయంలో నమ్మిక. గ్రహణ సమయంలో, గ్రహణం ముగిసిన తరువాత స్నానం చేశాక ఈ స్తోత్రాన్ని పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయంటారు.


 • యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః
 • సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపోహతు
 • ముఖం యః సర్వదేవానాం సప్తార్చి రమిత ద్యుతిః
 • చంద్ర సూర్యోపరాగోత్థాం అగ్నిః పీడాం వ్యపోహతు
 • యః కర్మసాక్షీ లోకానాం యమో మహిష వాహనః
 • చంద్ర సూర్యోపరాగోత్థాం గ్రహ పీడాం వ్యపోహతు
 • రక్షో గణాధిపః సాక్షాత్‌ ప్రళయానల సన్నిభః
 • ఉగ్రః కరాళో నిరృతిః గ్రహపీడాం వ్యపోహతు
 • నాగపాశధర దేవః సదా మకర వాహనః
 • వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపోహతు
 • యః ప్రాణరూపో లోకానాం వాయుః కృష్ణమృగప్రియః
 • చంద్ర సూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు
 • యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః
 • చంద్ర సూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు
 • యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః
 • చంద్ర సూర్యోపరాగోత్థాం దోషం నాశయతు ధ్రుతమ్


శాంతి మంత్రం

ఇంద్రానలో దండధరశ్చ రక్షః

ప్రాచేతసో వాయు కుబేర శర్వాః

మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే

సూర్యోపరాగం శమయంతు సర్వే

Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST