ఈ దుకాణాలు భలే స్పెషల్‌...

ABN , First Publish Date - 2020-07-22T05:30:00+05:30 IST

ఏదైనా కొనేందుకు దుకాణానికి వెళతాం. అవసరమైనవి తీసుకొని దుకాణ యజమానికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరమ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో అలా కాదు...

ఈ దుకాణాలు భలే స్పెషల్‌...

ఏదైనా కొనేందుకు దుకాణానికి వెళతాం. అవసరమైనవి తీసుకొని దుకాణ యజమానికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరమ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో అలా కాదు. చాలినంత డబ్బు లేకున్నా కూడా కావాల్సిన  కూరగాయలు, పండ్లు తీసుకెళ్లవచ్చు. ‘ఇంత తక్కువ ఇచ్చారేంటీ?’ అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే అక్కడి దుకాణాల్లో యజమానులు ఎవరూ ఉండరు. కానీ దుకాణంలో కూరగాయలు, పండ్లు, పూలు వంటివి చక్కగా ప్యాక్‌ చేసి ఉంటాయి. అక్కడ ఏర్పాటుచేసిన అట్టముక్క మీదో, పలక మీదో వాటి ధర రాసి ఉంటుంది. కస్టమర్లు తమకు కావాల్సినవి తీసుకొని అక్కడ ఏర్పాటు చేసిన చెక్క పెట్టెలోనో, లేదా ప్లాస్టిక్‌ డబ్బాలోనో డబ్బులు వేస్తారు. పేదవాళ్లు అయితే ఎంతో కొంత అందులో వేసి తమకు కావాల్సినవి తీసుకువెళతారు. డబ్బు ఉన్నవాళ్లు దుకాణదారుల ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ కొంత ఎక్కువ డబ్బు కూడా డబ్బాలో వేస్తారు. 




సంస్కృతిని కాపాడుతూ...

మిజోరమ్‌లోని సెలింగ్‌ కొండ ప్రాంతం గుండా వెళుతుంటే దారికి ఇరువైపులా వెదురు బొంగులు, తడికలతో ఏర్పాటుచేసిన చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి. వీటిని స్థానిక తెగ ప్రజలు నిర్వహిస్తారు. స్వతహాగా వీరు ఎంతో నిజాయతీపరులు.   తమ పూర్వీకుల నుంచి దయ, ఆతిథ్యం, నిస్వార్థం, సేవాగుణం వంటి లక్షణాలను వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. నేటికీ ఆ విలువలను ఆచరిస్తున్నారు. రోజూ ఉదయాన్నే కూరగాయలు, పండ్లు, పూలు, స్థానిక రుచులను ప్లాస్టిక్‌ కవర్లలో చక్కగా ప్యాక్‌ చేసి, వాటి ధరల సూచికను అక్కడ ఉంచి, పొలం పనులకు వెళతారు. తిరిగి సాయంత్రం వచ్చి దుకాణం కట్టేసి వెళతారు. వీరు అనాదిగా వస్తోన్న ‘నగాహ్‌ లౌ దరవ్‌ కల్చర్‌’ (యజమానులు లేని దుకాణాలు) సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏడాది పొడవునా ఈ దుకాణాలు తెరిచే ఉంటాయి. ‘‘ఇది 2020వ సంవత్సరం. కరోనా వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో మిజోరమ్‌లో ‘నిజాయతీ, ఆతిథ్యం, నమ్మకం’ వంటివి పెల్లుబికుతున్నాయి. ‘యజమానులు లేని దుకాణాలు’ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. వారికి అవసరమైనవి తీసుకునేలా, సామాజిక దూరం పాటించేలా చేస్తున్నాయి’’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం విశేషం. సోషల్‌ మీడియాలో ఈ వినూత్న దుకాణాల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. చూసిన వారంతా వీటి నిర్వాహకులను ఎంతో అభినందిస్తున్నారు. 



Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST