మూసను బద్దలు కొట్టింది!
ABN , First Publish Date - 2020-03-08T05:56:08+05:30 IST
క్రికెట్ అనగానే ఓ కోహ్లీనో... ఏ ధోనీనో... గుర్తుకువస్తారు. కానీ పురుషాధిక్యం ఉన్న ఈ ఆటలో మగాడిగా వేషం మార్చుకుని ఓ అమ్మాయి అదరగొట్టింది. సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో ఆట మొదలుపెట్టి...

క్రికెట్ అనగానే ఓ కోహ్లీనో... ఏ ధోనీనో... గుర్తుకువస్తారు. కానీ పురుషాధిక్యం ఉన్న ఈ ఆటలో మగాడిగా వేషం మార్చుకుని ఓ అమ్మాయి అదరగొట్టింది. సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో ఆట మొదలుపెట్టి... చివరకు అతడి ముప్ఫై ఏళ్ల రికార్డునే బద్దలు కొట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టాప్ బ్యాట్స్‌ఉమన్‌గా ఎదిగి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో దుమ్ములేపుతున్న పదహారేళ్ల షఫాలీ వర్మ పురుషాధిక్య సమాజంలో మూసను బద్దలు కొట్టిన నవతరం యువతి. ఇవాళ జరుగుతున్న టీ 20 మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లో స్టార్ కూడా.
‘చిచ్చరపిడుగు’... ముప్ఫై ఏళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మాజీలు ఇచ్చిన కితాబిది. ఎంతటి బౌలర్‌నైనా అలవోకగా ఆడే నైపుణ్యం... బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులెత్తించగల సామర్థ్యం... అతడికే ప్రత్యేకం. ఇది చరిత్ర. ఇప్పుడు... అతడినే ఆరాధిస్తూ బ్యాట్ పట్టిన షఫాలీ వర్మ భారీ షాట్లతో చెలరేగుతోంది.
హరియాణాలోని రోహ్తక్... షఫాలీ పుట్టిన ఊరు. స్థానిక మణిదీప్ సీనియర్ సెకండరీ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆమెకు తన తండ్రే మార్గదర్శి. ఆయనది చిన్నపాటి నగల వ్యాపారం. తొమ్మిదేళ్లప్పుడు స్టేడియంలో తొలిసారి సచిన్‌ను చూసిన తరువాత షఫాలీ మనసు మారిపోయింది. క్రికెటర్ కావాలన్న ఆకాంక్ష బలంగా నాటుకుపోయింది. ఆరంభంలో నాన్న వద్దే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న షఫాలీ... ఎలాగైనా మగవారితో కలిసి ఆడాలనుకుంది. అందు కోసం తన జుత్తు కత్తిరించుకొని, క్రాఫ్ తీసి... తన సోదరుడిగా తనను తాను పరిచయం చేసుకుంది. క్రమంగా ఆటను మెరుగుపరుచుకుని హరియాణా రాష్ట్ర జట్టుల్లో స్థానం సంపాదించింది.
సచిన్ రికార్డు తిరగరాసి...
రాష్ట్ర జట్లలో నిలకడైన ప్రదర్శనతో షఫాలీ వర్మకు భారత సీనియర్ జట్టులో స్థానం దక్కింది. దక్షిణాఫ్రికాతో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కొన్ని వారాల తరువాత వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన షఫాలీ చెలరేగిపోయింది. అక్కడ అర్ధశతకం బాది... అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ముప్ఫై ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డు దాంతో తెరమరుగైపోయింది. క్రికెట్ దేవుడిని ఆరాధిస్తూ ఆట మొదలుపెట్టిన ఈ హరియాణా హరికేన్... అతడి రికార్డునే తిరగరాయడం ఓ మరపురాని ఘట్టం.
అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తున్న షఫాలీకి మరో అద్భుత అవకాశం వచ్చింది. అదే ప్రస్తుతం ఆస్ర్టేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడే భారత జట్టులో చోటు! అవకాశం వచ్చిందే తడవుగా ప్రపంచ కప్‌లో ఆకాశమే హద్దుగా అదరగొడుతోంది షఫాలీ. తాజాగా టీ20 బ్యాట్స్ఉమెన్ ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తరువాత టాప్‌లో నిలిచిన భారత క్రికెటర్ షఫాలీనే!