సహనం కన్నా స్వాభిమానం అవసరం!

ABN , First Publish Date - 2020-03-02T06:56:47+05:30 IST

ఆమె... జాతీయ మహిళా కమిషన్‌ తొలి సభ్యురాలిగా 23 బిల్లుల తయారీలో కీలక పాత్ర పోషించారు. సత్వర న్యాయ పరిష్కార వేదిక ‘మహిళా లోక్‌ అదాలత్‌’ రూపకర్తల్లో ఒకరు! జాతీయ బాల భవన్‌ డైరెక్టర్‌గా పుష్కరకాల సేవలో...

సహనం కన్నా స్వాభిమానం అవసరం!

ఆమె... జాతీయ మహిళా కమిషన్‌ తొలి సభ్యురాలిగా 23 బిల్లుల తయారీలో కీలక పాత్ర పోషించారు. సత్వర న్యాయ పరిష్కార వేదిక ‘మహిళా లోక్‌ అదాలత్‌’ రూపకర్తల్లో ఒకరు! జాతీయ బాల భవన్‌ డైరెక్టర్‌గా పుష్కరకాల సేవలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రెండో లోక్‌సభ సభాధ్యక్షుడు మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ కూతురు పద్మాసేథ్‌ (87) ‘అంకురం’ నిర్వహణలోని రంగారెడ్డి జిల్లా ‘సఖి’ కేంద్రం సందర్శనకు విచ్చేసిన సందర్భంగా... తన జీవితస్మృతుల్లో కొన్నింటిని ‘నవ్య’తో పంచుకున్నారు.


‘‘నేను చిన్నప్పటి నుంచీ కాస్త రెబెల్‌ టైప్‌! మా కుటుంబానికి దుర్గాబాయమ్మ (దుర్గాబాయి దేశ్‌ముఖ్‌) ఆత్మీయురాలు. ఆమె వల్లే నా జీవితానికి ఒక సార్థకత చేకూరింది. నా మెట్రిక్యులేషన్‌ పూర్తయిన వెంటనే నాన్న నాకు పెళ్లిచేయాలనుకున్నారు. నాకేమో పెద్ద చదువులు చదవాలని కోరిక. ఒక రోజున దుర్గాబాయమ్మతో ‘ఇదీ సంగతి’ అని చెప్పాను. ఆమె నాన్నతో ‘అమ్మాయిని చదివిస్తే బావుంటుంది’ అనగానే, నన్ను చెన్నైలోని ఆంధ్రమహిళా సభ కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చేర్పించారు.


అక్కడే నాకు కల్పగం (సీతారాం ఏచూరి అమ్మ), ఉషా భాటియా (కొమ్మూరి పద్మావతీదేవి కూతురు) మంచి స్నేహితులయ్యారు. మొదటి నుంచి నాలో స్వతంత్ర భావాలు ఎక్కువే. చదువు, కెరీర్‌, జీవిత భాగస్వామి ఎంపిక... ఇలా నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో పూర్తి నిర్ణయాధికారం నాదే! రాజీపడటం నా డిక్షనరీలోనే లేదు. ఒక సందర్భంలో జాతీయ మహిళా కమిషన్‌ వ్యవహారాల్లో బ్యూరోక్రాట్స్‌ జోక్యం మితిమీరడంతో, కమిషన్‌ సభ్యురాలిగా నేను నేరుగా ఆనాటి ప్రధాని దేవెగౌడని కలిసి ‘మీ అధికారులు మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదు... ఇలాగైతే రాజీనామా చేస్తాం’ అన్నాను. ఆయన వెంటనే స్పందించారు. ఆడవాళ్లకి సహనం కన్నా, స్వాభిమానమే అసలైన అలంకారం, అవసరం కూడా. పరాధీనతకు నేను పూర్తి వ్యతిరేకం.


నా భర్త సతీశ్‌ చంద్ర సేథ్‌. మాది ప్రేమ వివాహం. మా పెళ్లికి  మొదట నాన్న ఒప్పుకోలేదు. ‘నా పెళ్లంటూ జరిగితే సతీశ్‌తోనే’ అని తెగేసి చెప్పడంతో చివరకు అంగీకరించారు. మా నాన్న సున్నిత స్వభావి. నా చిన్నతనంలో ఆయన ఇంట్లో కన్నా, జైల్లోనే ఎక్కువ గడిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు నాన్నని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతుంది. అప్పుడు స్కూలు విద్యార్థిగా ఉన్న నేను జైలుకెళుతున్న నాన్నను చూసి, ఆయన కూతురిగా పుట్టినందుకు గర్వించాను. 1947లోనే నాన్న రెండు ప్రత్యేక బస్సుల్లో దళితులను తిరుమల తీసుకెళ్లి, ఆలయ ప్రవేశం చేయించారు. ఇక ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి నాకు స్వయానా మేనబావ. టంగుటూరి ప్రకాశం పంతులు మా నాన్నకు గురువు. 


తొలి కేసు విజయంతో..!

మొదటి జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా పనిచేయడం నాకు దక్కిన అరుదైన అవకాశం. తొలినాళ్లలో మాకు ఒక టైప్‌ రైటర్‌, ఒక పర్సనల్‌ అసిస్టెంట్‌ మినహా మరే ప్రాథమిక సదుపాయాలూ ఉండేవి కావు. అయినా, మా బాధ్యతను ఒక సవాల్‌గా తీసుకున్నాం. ఢిల్లీ వీధుల్లో చద్దర్లు అమ్ముకునే ఇరవై ఏళ్ల అమ్మాయిని ఒక సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ అక్రమంగా అరెస్టు చేసిన విషయం మా దృష్టికొచ్చింది. అదే మాకు అందిన తొలి ఫిర్యాదు. ఢిల్లీలో నన్ను చాలామంది పోలీసులు గుర్తుపడతారు కాబట్టి, అసలు విషయం ఆరా తీసేందుకు మారు వేషంలో వెళ్లాలని మా ఛైర్మన్‌ జయంతీ పట్నాయక్‌కి సూచించాను.


అందుకు అంగీకరించిన ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో రహస్యంగా వాయిస్‌ రికార్డర్‌ పెట్టుకొని, బాధితురాలి పిన్నిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే సదరు ఎస్‌ఐ ఆ అమ్మాయిని నోటితో చెప్పరాని మాటలతో తిడుతూ..‘‘నీవు అందంగా ఉన్నావు. దందా చేస్తే, మస్త్‌ పైసలొస్తాయి. ఆ బిజినె్‌సలో నాకు తెలిసిన వాళ్లను పరిచయం చేస్తాను. రోజుకి రూ. లక్ష కూడా సంపాదించుకోవచ్చు’’ అంటున్నాడు. ఆ మాటలన్నీ రికార్డు అయ్యాయి. అప్పటికే సమయం రాత్రి పది దాటింది. ఆ వేళప్పుడు నేనూ, జయంతీ కలిసి పోలీసు కమిషనర్‌ ఇంటికెళ్లి అసలు విషయం వివరించాం. ‘‘ఇలాంటి వ్యక్తులను డిపార్టుమెంటులో పెట్టుకొని, ప్రజలకు మీరేమి భద్రత కల్పిస్తార’’ని ఆయనతో కాస్త కటువుగానే మాట్లాడాం. విజిలెన్స్‌ కమిషన్‌ విచారణలో నేరం రుజువు అయింది. ఆ ఎస్‌ఐని ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశారు. మా తొలికేసు విజయాన్ని జాతీయ వార్తా పత్రికలు ప్రముఖంగా రాశాయి. దాంతో వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. ఇలా ఒకటా, రెండా కొన్ని వందల కేసులను పరిష్కరించాం. రెండు సార్లు కమిషన్‌ సభ్యురాలిగా పనిచేశాను. తద్వారా బాధిత మహిళలకు నా వంతు సహకారాన్ని అందించగలిగానన్న తృప్తి ఉంది. 


ఒక్కరోజులో 700 కేసులు పరిష్కారం...!

మహిళలు, పిల్లలకు సంబంధించిన దాదాపు 23 బిల్లులను డ్రాఫ్ట్‌ చేశాను. గృహహింస నిరోధక చట్టం వంటి పలు చట్ట సవరణల్లోనూ పాలుపంచుకొన్నా. పిల్లలపై ‘ఇన్‌సి్‌స్ట’ నేరాలకు సంబంధించి ఒక్క చట్టం లేదు. దానిపై ప్రత్యేకంగా ముసాయిదాను రూపొందించాను. కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడటం, రక్తసంబంధీకులు పిల్లలపై దౌర్జన్యానికి దిగడం వంటి నేరాలను అరికట్టడం ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం. పిల్లలు, మహిళల అంశాలపై పలు కేసుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టులు వెల్లడించిన కొన్ని అరుదైన తీర్పులతో ‘ఏ విజన్‌ స్టేట్‌మెంట్‌ ఆన్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమన్‌’ పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు. అందులోని విషయాలను చదివి, ఆయనే నిర్ఘాంతపోయారు.


మహిళల కోసం ప్రత్యేకంగా స్థానిక కోర్టుల ఆవరణలో ‘ఉమన్‌ లోక్‌ అదాలత్‌’ నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా ఆనాటి లీగల్‌ సర్వీస్‌ అఽథారిటీలోని జస్టిస్‌ రామస్వామికి విన్నవించాం. మా మనవిని ఆలకించిన ఆయన, అన్నీ హైకోర్టులకూ లేఖ రాశారు. అలా ఒక్క రోజులో కొన్ని వందల కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం అందించగలిగాం. ఢిల్లీ న్యాయస్థానంలో ఒక్కరోజులో 256 కేసులను పరిష్కరించాం. మధ్యప్రదేశ్‌, భూపాల్‌ సెషన్స్‌ కోర్టులో ఒక్కరోజులో 700 కేసులను పరిష్కరించాం. నియమ, నిబంధనల చట్రానికే పరిమితం కాకుండా త్వరితగతిన బాధితులకు న్యాయం అందించే దిశగా న్యాయనిపుణులు పనిచేయడం వల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందనుకుంటున్నా. 


పిల్లల ఆలింగనం అరుదైన బహుమతి... 

జాతీయ బాలభవన్‌కు 12ఏళ్లు డైరెక్టరుగా వ్యవహరించిన నాకు, ఆ బాధ్యత మధురానుభూతిని మిగిల్చింది. అప్పటి వరకు ఒక క్రాఫ్ట్‌ సెంటర్‌గా మాత్రమే ఉన్న బాలభవన్‌ కార్యకలాపాలను పూర్తి ప్రక్షాళన చేసే అవకాశం దక్కింది. పిల్లలు ఏదో ఒక ఆర్ట్‌ని నేర్చుకోవడం కోసమే శిక్షణా తరగతులు కాదు, అసలు వాళ్లు నేర్చుకునే ప్రక్రియే చాలా ముఖ్యం అంటాను. బాలభవన్‌ను ఒక క్రియేటీవ్‌ రీసోర్స్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాను.


12ఏళ్ల లోపు పిల్లలను పలు పోటీలకు దూరంగా ఉంచాల్సిందిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించాను. చిన్నారుల సృజనను పోటీ పేరుతో కట్టడిచేయడం భావ్యం కాదని నా ఉద్దేశం. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక అమ్మాయి మా క్యాంప్‌లో పాల్గొంది. ఆ చిన్నారి అమ్మ సైంటిస్టు. కూతురిని చూసి అనుక్షణం కుమిలిపోతున్న ఆమెకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమేగాక, ఆ పాప ఆసక్తి మేరకు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించాం. ఒకరోజు ఆ చిన్నారి నన్ను ఆలింగనం చేసుకొని, నా నుదురుపై ముద్దుపెట్టడం నేను అందుకున్న అరుదైన బహుమతి. నిజానికి ఆ పన్నెండేళ్లలో చిన్నారుల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.


తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా మహిళా కమిషన్‌ను నియమించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కమిషన్‌ అంత యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపించడంలేదు. ఇరు ప్రాంతాలలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ పనితీరు గురించి చెప్పనక్కర్లేదు! ప్రభుత్వాలు, సేవాసంస్థలు కలిసి పనిచేయడం ద్వారా సమాజంలోని చాలా సమస్యలకు ముగింపు పలకవచ్చని నమ్ముతాను.’’ 

- వెంకటేశ్‌, ఫొటోలు: చారి


మహిళలు, బాలల హక్కుల కమిషన్లను పటిష్టం చేసి, అవి సక్రమంగా పనిచేసేలా చూడాల్సింది ప్రభుత్వాలే. బాధిత మహిళలకు, పిల్లలకు సహాయం అందించే ‘అంకురం’ వంటి పలు సేవాసంస్థలకు ప్రభుత్వం అండగా నిలవాలి. ‘సఖీ’ కేంద్రం పనితీరు బావుంది. అయితే, ఇలాంటి కేంద్రాల సంఖ్య మరింత పెరగాలి. మన పాలకులు, పోలీసులు, న్యాయనిపుణులకు జెండర్‌ సెన్సిటైజేషన్‌ అత్యవసరం. 

Updated Date - 2020-03-02T06:56:47+05:30 IST