సాత్వికం.. సుమధురం

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

రోగనిరోధకశక్తి బలంగా ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవడమే మేలని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్‌...

సాత్వికం.. సుమధురం

  • రోగనిరోధకశక్తి బలంగా ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవడమే మేలని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్‌. ఆయన సూచిస్తున్న అలాంటి సాత్వికమైన కొన్ని వంటకాలు ఇవి. వెరైటీ రుచులను ఆస్వాదించాలంటే ఈ వారం మీరూ వీటిని ట్రై చేయండి.


రాగి అటుకులతో ఆధరువులు

కావలసినవి

రాగి అటుకులు - పావుకేజీ, క్యారెట్స్‌ - మూడు, బీన్స్‌ - నాలుగైదు, క్యాబేజీ - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒకకట్ట, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మెంతులు - కొన్ని, మినప్పప్పు - పావు టీస్పూన్‌, సెనగపప్పు - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం 

  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి.

  • తరువాత మెంతులు, మినప్పప్పు, సెనగపప్పు వేయాలి. 

  • తరిగిన క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. 

  • ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు వేగించాలి.

  • ఇప్పుడు రాగి అటుకులు వేసి కలపాలి. 

  • చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

నల్లబెల్లం సంకటి

కావలసినవి

బియ్యప్పిండి - అరకేజీ, పుట్నాలు - అరకేజీ, మెంతులు - 50గ్రా, శొంఠి - 50గ్రా, నల్లబెల్లం - ఒకకప్పు, నూనె - అరకప్పు, నీళ్లు - తగినన్ని.


తయారీ విధానం 

ముందుగా పుట్నాలు, మెంతులు, శొంఠిని విడివిడిగా వేగించుకోవాలి.


ఇప్పుడు బియ్యప్పిండి తీసుకుని అందులో వేగించిన పుట్నాలు, మెంతులు, శొంఠి వేసి మిక్సీలో గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.


స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు వేడెక్కిన తరువాత నల్ల బెల్లం వేసి ఉడికించాలి. కాస్త ఉడికిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.


వడకట్టిన నీటిని మళ్లీ మరిగించాలి.


మరో పాత్రలో కొద్దిగా నూనె వేసి, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పిండి వేసి కలపాలి. తరువాత స్టవ్‌ సిమ్‌లో పెట్టి మరిగించిన బెల్లం నీటిలో కొద్దిగా కలపాలి. 

20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని దింపాలి.


కాసేపయ్యాక బెల్లం నీరు తేరుకుంటుంది. దీన్ని వడకట్టి పెట్టుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. 


మజ్జిగ సంకటి


కావలసినవి

బియ్యప్పిండి - రెండు కప్పులు, పులిసిన మజ్జిగ - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, పసుపు - అరస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు.


తయారీ విధానం 

బియ్యప్పిండిలో మజ్జిగ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి పలుచగా కలపాలి.


స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి. 


తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి.


ఇప్పుడు కలిపిపెట్టుకున్న బియ్యప్పిండిని నెమ్మదిగా పోయాలి. అడుగంటకుండా కలపాలి.


కొద్దిగా వెన్న ముద్దలా ఉన్నప్పుడే దింపాలి.


మొక్కజొన్న అటుకులతో...


కావలసినవి

మొక్కజొన్న అటుకులు - 100గ్రా, క్యారెట్‌ - రెండు, బీన్స్‌ - నాలుగైదు, క్యాబేజీ - కొద్దిగా, ఆవాలు - పావు టీస్పూన్‌, నూనె సరిపడా, సెనగపప్పు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, మెంతులు - పావు టీ స్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం 

ముందుగా మొక్కజొన్న అటుకలను నానబెట్టి, తరువాత బట్టలో ఆరబెట్టుకోవాలి.


తరువాత స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి.


సెనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి మరి కాసేపు వేగించాలి.


క్యారెట్‌ ముక్కలు, బీన్స్‌, క్యాబేజీ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.


ఇప్పుడు మొక్కజొన్న అటుకులు వేసి కలియబెట్టుకోవాలి. 


రెండు నిమిషాలు పాటు మగ్గించి దింపాలి. 


పిల్లలు సైతం వీటిని ఇష్టంగా తింటారు.


బీట్‌రూట్‌ ఆటుకులతో...


కావలసినవి

బీట్‌రూట్‌ - ఒక కప్పు, అటుకులు - ఒక కప్పు, కొబ్బరినూనె - రెండు టీస్పూన్‌లు, ఆవాలు - పావుటీస్పూన్‌, సెనగపప్పు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - పావు టీస్పూన్‌, అల్లం ముక్క - కొద్దిగా, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు - కొంచెం, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం 

ముందుగా ఆటుకులు నానబెట్టుకోవాలి. తరువాత వడకట్టి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి.


స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి.


తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. అల్లం ముక్క వేసి పచ్చి వాసన పోయే దాకా వేగించుకోవాలి.


బీట్‌రూట్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి వేసుకోవాలి. 


కాసేపు వేగిన తరువాత అటుకులు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. 


చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST