వాళ్లు ఆ విషయం మర్చిపోయారు!

ABN , First Publish Date - 2020-05-17T06:45:18+05:30 IST

‘‘కరోనా తీవ్రతను ముందే ఊహించా. మార్చి ప్రారంభంలో షూటింగుల్లో కరోనా గురించి మాట్లాడితే చుట్టుపక్కల జనాలు నవ్వేవారు. ‘ఊరుకోండి! అంతేమీ లేదు. మన వాతావరణానికి రాదు.

వాళ్లు ఆ విషయం మర్చిపోయారు!

రష్మీ గౌతమ్‌...

‘జబర్దస్త్‌’ యాంకర్‌! గ్లామరస్‌ హీరోయిన్‌!!

బుల్లితెరకు తన గ్లామర్‌ హంగులు అద్దారు!

వెండితెరపై ‘గుంటూర్‌ టాకీస్‌’ వంటి చిత్రాల్లో గరమ్‌ గరమ్‌గా కనిపించారు!!

అలాగని, అందం గురించి మాత్రమే ఆమె మాట్లాడతారని అనుకుంటే పొరపాటే.

యాంకర్‌, యాక్టర్‌ కంటే ముందు రష్మీ గౌతమ్‌ సమాజంలో సగటు మనిషి.

వ్యక్తిగా ఆమెకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. కరోనా కాలంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, మూగ జీవాలు పడుతున్న ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ, ఇతర అంశాలపై ‘నవ్య’తో రష్మీ గౌతమ్‌ ప్రత్యేకంగా సంభాషించారు.


‘‘కరోనా తీవ్రతను ముందే ఊహించా. మార్చి ప్రారంభంలో షూటింగుల్లో కరోనా గురించి మాట్లాడితే చుట్టుపక్కల జనాలు నవ్వేవారు. ‘ఊరుకోండి! అంతేమీ లేదు. మన వాతావరణానికి రాదు. ఎండకు చస్తుంది’ అన్నవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే తప్పు మనుషులదే! ప్రభుత్వాలది కాదు!! ప్రజలకు ఏది చెప్పినా పాటించరు. సొంత థీరీలు చెబుతారు. జాగ్రత్తలు చెబుతున్న ప్రపంచఆరోగ్య సంస్థ ప్రతినిధులు, వైద్యులు పిచ్చోళ్లా?


సరొగసీ ఎందుకు? దత్తత తీసుకోవచ్చు కదా!

‘కరోనాను సీరియస్‌గా తీసుకోవాల్సిందే. విదేశాల్లో చూడండి’ అని నేను చెబితే... ‘వేరే దేశానిది. మనకు రానే రాదు’ అన్నారు. కరోనా చెప్పి వస్తుందా? పాస్‌పోర్ట్‌ తీసుకుంటుందా? ఇప్పటికీ చాలామంది సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆహారం లేదనో, మరొకటో చెబుతున్నారు. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం చేసే తప్పుల వల్లే! జనాభాను పెంచుకుంటూ వెళ్లడం వల్లే! జనాభా నియంత్రణే అన్నిటికీ పరిష్కారం.


పశువులకు అయినా సీజన్‌ ఉంటుందేమో? మనుషులయితే ఎప్పుడు పడితే అప్పుడే! సీజన్‌ ఉండదు, ఏమీ ఉండదు! ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రజలు దత్తత తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సరొగసీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. దాని బదులు దత్తత తీసుకోవచ్చు కదా! సొంత రక్తం అయితేనే ప్రేమించగలరా? అయామ్‌ సారీ! సహజంగా పిల్లలకు జన్మనివ్వడం ఓకే! సరోగసీ ఏంటి? నాకర్థం కాదు. ఇది వివక్ష చూపించడమే. కులాభిమానం, మతాభిమానం వంటిదే. పిల్లల విషయంలో జీన్స్‌ కొంతవరకే వర్కవుట్‌ అవుతుంది. మిగతాదంతా పెంపకంలో, పిల్లలకు నేర్పడంలో ఉంటుంది.


ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు!

తొలిదశ లాక్‌డౌన్‌లో నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండో దశలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎలాంటి సమస్యలూ లేవు. ఎట్‌ లీస్ట్‌... డబ్బున్నవాళ్లకు ఎటువంటి సమస్యలూ లేవు. అయినా కొందరు జనాలు భయపడ్డారు. అప్పట్లో కొందరైతే ఇంట్లో కేక్‌ చేయాలని అవసరమైన సరుకుల కోసం లైనుల్లో నిలబడ్డారు. దాంతో నిజంగా నిత్యావసరాల కోసం వెళ్లినవాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి! ఏదో రకంగా మేనేజ్‌ చేయండి. చేయవచ్చు కూడా! పిజ్జాలు, స్విగ్గీలు రాక ముందు జీవితాలు నడిచాయి కదా! కరోనా ఎట్నుంచి, ఎలా వస్తుందో తెలియదు.


వచ్చినా... రెండు వారాల వరకూ తెలియదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వస్తే నేను మద్దతిస్తా. షాపులన్నీ తీసి ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్యలు లేవు. సుమారు రెండు నెలల లాక్‌డౌన్‌ ఏదైతే నడిచిందో... అది ఒక డ్రిల్‌. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వచ్చే వరకూ కరోనా వైరస్‌ మనతోనే ఉంటుంది. అందుకని, ప్రతిరోజూ కరోనాతో యుద్ధం చేయాలి. వ్యక్తిగత శుభ్రత ఎలా పాటించాలి? ఉద్యోగాలకు, షాపులకు వెళితే ఎలా ఉండాలి? అనేది ఈ రెండు నెలల డ్రిల్‌ నుంచి తెలుసుకోవాలి. ఇప్పట్నుంచీ మన జీవితం ఇక ఇలాగే ఉంటుంది. దురదృష్టం ఏంటంటే... ఈ సంగతి చాలామంది జనాలు ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదు.


పోతే పోతామని అనుకొనే వాళ్ల వల్లే...

ఇతర దేశాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, మన దేశంలో కష్టం. ఎందుకంటే? జనసాంద్రత ఎక్కువ. ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి. ఎవరూ రూల్స్‌ పాటించడం లేదు. కొందరు ‘పోతే పోతాం! మందు తాగేసి పోతాం’ అంటారు. వాళ్లతో కుటుంబానికీ, సమాజానికీ ఏం ప్రయోజనం? ఐదు వందలు వస్తే తాగేసి ఇంటికివెళ్లి ఆడవాళ్లను కొడతారు. కరోనా కాకపోతే... కిడ్నీ, లివర్‌ వంటివి ఫెయిల్‌ అయి వాళ్లే పోతారు. మెరుగైన జీవితం (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) మన దేశంలో లేదు. దాని మీద ఫోకస్‌ లేదు. జనాభా ఇంత ఉన్నప్పుడు ఎవరు ఎవరికి మెరుగైన జీవితం ఇవ్వగలరు? పోతే పోతామని అనుకునే వాళ్ల వల్ల... భవిష్యత్తు బావుండాలనీ, బతకాలనీ ఓ లక్ష్యంతో ముందుకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


సాధారణ జీవితం తప్పేమీ కాదు!

ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఈ మధ్య జీతం ఎంతొస్తే అంత, అంతకంటే పదివేలు ఎక్కువ నెలవారీ వాయిదాలు (ఈఎమ్‌ఐలు) కడుతూ బతుకుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు. కానీ, కనీసం ఆరు నెలల జీవనోపాధి ఉండాలి. ఇప్పుడీ మహమ్మారి వచ్చింది. అలా కాకుండా యాక్సిడెంట్‌ జరిగితే? ఏవో సమస్యల వల్ల ఆరు నెలలు పని చేయలేకపోతే? బ్యాకప్‌ ప్లాన్‌ ఉండాలి కదా! డబ్బులు ఉంటే ఖర్చుపెట్టడంలో తప్పులేదు. కానీ, చాలామంది లేకపోయినా... ఓవర్‌ బోర్డ్‌ వెళ్లి, లోన్స్‌ తీసుకుని షో చేస్తున్నారు. చివరకు అప్పుల్లో కూరుకొని, ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యల వరకూ వెళుతున్నారు. సాధారణ జీవితం గడపడంలో తప్పేమీ లేదు.


సిగ్గుపడొద్దు. ఎవరో జడ్జ్‌ చేస్తారని బతకొద్దు. ఎవరొచ్చి బిల్లులు, ఈఎమ్‌ఐ, అద్దెలు కడతారు? ఎవరూ కట్టరు.  ‘మీ పిల్లలకు ఐప్యాడ్‌ లేదా? ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదవడం లేదా?’ అని ఎవరో అడుగుతారని ఏదో చేయవద్దు. ‘జీవితంలో ఏది కావాలి? ఏది వద్దు?’ అనేది ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి. అలాగే, ఎదుటివారి దగ్గర లేదని చిన్నచూపు చూడడం తప్పే!


నేనే కాదు... చాలామంది ఆ పని చేశారు!

సాధారణ రోజుల్లో వీధుల్లో తిరిగే మూగ జీవాలు ప్రజలు పడేసే ఆహారం, హోటల్స్‌లో వ్యర్థాలపై ఆధారపడతాయి. లాక్‌డౌన్‌తో అన్నీ మూత పడడంతో ఆహారానికి ఇబ్బంది పడుతూ, అవి ఆకలితో అలమటిస్తున్నాయి. నాకు వీలైనంత వరకూ ఆహారం అందిస్తున్నా. ఆ ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో మరికొందరు ముందుకొచ్చి మంచి పనిలో భాగస్వామ్యులయ్యారు. లాక్‌డౌన్‌కి ముందూ నేనే కాదు, చాలామంది ఈ విధంగా ఆహారం అందించారు. ఇది చాలా సాధారణ విషయమే.


దేవుడు మనుషులను సృష్టించింది భూమ్మీద ఇతర పశుపక్ష్యాదులను జాగ్రత్తగా చూసుకోవడానికే! కో-ఎగ్జిస్టెన్స్‌ అనేది నేచురల్‌ థింగ్‌. మనుషులు తమ స్వార్థపూరిత ధోరణితో ఆ విషయాన్ని మర్చిపోయారు. ‘మా జీవితం, తిండి, పిల్లలు’ అనుకుంటూ రాబోయే ఏడు తరాలకు ఎలా సంపాదించి పెట్టాలి? ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? అని ఆలోచిస్తున్నారు. అందుకనే, కరోనా లాంటివి వస్తుంటాయి. అది సమతౌల్యం తీసుకురావడానికి ప్రకృతి చేసే పని!



కామెంట్స్‌ చేయడం మానేసి...!

‘మీరు పశువులకు సాయం చేస్తున్నారు. మనుషులకు ఎవరు చేస్తారు?’ అని చాలామంది సోషల్‌ మీడియాలో అడుగుతున్నారు. నేను పశువులకు చేస్తున్నా. వాళ్లను మనుషులకు చేయమంటే చేయరు. ప్రశ్నిస్తారు. ఇండస్ట్రీలో ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు హెల్ప్‌ చేస్తున్నాం. అలాగని, ఫొటోలు దిగి పోస్ట్‌ చేయలేను. కొందరు అది అర్థం చేసుకోరు. ఎటువంటి దానం, సేవ అయినా సరే అది పూర్తిగా సొసైటీ రెస్పాన్సిబిలిటీ. సోషల్‌ మీడియాలో టైమ్‌ వేస్ట్‌ చేసేవాళ్లు, ఆ పని మానేసి మంచి పనులు ప్రారంభిస్తే మంచిది.

సంభాషణ: సత్య పులగం

Updated Date - 2020-05-17T06:45:18+05:30 IST