అంతటా రాధికే!

ABN , First Publish Date - 2020-09-06T17:12:15+05:30 IST

రాధిక ఆప్టే... తారాలోకంలో ఓ సంచలనం. ఓ ఫైర్‌ బ్రాండ్‌. అంతర్జాతీయ స్టార్‌. పాత్ర నచ్చితే చాలు నటించేస్తుంది. అది సినిమానా, రంగస్థలమా, షార్ట్‌ ఫిల్మా, డాక్యుమెంటరీనా, వెబ్‌ సిరీసా, సింగిల్‌ ఎపిసోడా అన్నది లెక్కచేయదు. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు మరచిపోలేనంతగా మాయచేస్తుంది...

అంతటా రాధికే!

రాధిక ఆప్టే... తారాలోకంలో ఓ సంచలనం. ఓ ఫైర్‌ బ్రాండ్‌. అంతర్జాతీయ స్టార్‌. పాత్ర నచ్చితే చాలు నటించేస్తుంది. అది సినిమానా, రంగస్థలమా, షార్ట్‌ ఫిల్మా, డాక్యుమెంటరీనా, వెబ్‌ సిరీసా, సింగిల్‌ ఎపిసోడా అన్నది లెక్కచేయదు. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు మరచిపోలేనంతగా మాయచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రాధిక ఆప్టే నటించిన మర్డర్‌ మిస్టరీ ‘రాత్‌ అకేలీ హై’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి రివ్యూలు పొందుతోంది.   • రేపు రాధిక ఆప్టే పుట్టిన రోజు సందర్భంగా..


‘నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేశావే’ అంటూ ‘లెజెండ్‌’ సినిమాలో రాధిక ఆప్టేను చూసి ప్రతి కుర్ర హృదయం పాడుకుంది. ఆ తరవాత బాలకృష్ణతో ‘లయన్‌’లోనూ జతకట్టింది. రాధిక తెలుగు తెరకు పరిచయం అయ్యింది మాత్రం రామ్‌గోపాల్‌వర్మ ‘రక్తచరిత్ర’తో. ముగ్ధమనోహర రూపంతో తళుక్కున మెరిసింది. రజనీకాంత్‌ ‘కబాలీ’లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ వంటి బహు భాషా చిత్రాలలో నటించిన తారగా గుర్తింపుపొందింది. ‘బద్లాపూర్‌’, ‘అంధాధున్‌’, ‘ఏ కాల్‌ టూ స్పై’ చిత్రాలతో పాటు ‘సేక్రెడ్‌ గేమ్స్‌’, ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘స్టోరీస్‌ బై రవీంద్రనాథ్‌ టాగూర్‌’ వెబ్‌ సీరిస్‌లు ఆమెను డిపెండబుల్‌ స్టార్‌గా చేశాయి. సినిమాల్లోకి వచ్చి పదేళ్లు దాటుతోంది. అయినా ప్రతి పాత్రా విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే క్యారెక్టర్‌ తప్ప తను కనిపించదు. అలాగే పాత్ర కోరితే బోల్డ్‌గానూ నటించగలదు. అంతేకాదు తెరపై నటన తప్ప మరేదీ వార్త కాకూడదు అనే స్వభావం తనది. షూటింగ్‌ అయిపోయాక తాను తారనన్నదే మర్చిపోతుంది. ఎలాంటి సినీ ప్రమోషన్స్‌లో పాల్గొనదు. ఎండోర్స్‌మెంట్స్‌ చేయదు. ఓ రకంగా చెప్పాలంటే స్వశక్తితో పైకి రావడమే కాదు సినిమా నియమాలన్నిటినీ ఛేదించి ఉన్నత స్థితికి చేరుకున్న విభిన్న తార రాఽధిక. ఆమె ఎంచుకున్న మార్గం అనితర సాధ్యం. స్ట్రీమింగ్‌ స్టార్‌గా రాధిక పేరుతెచ్చుకుంది.కీర్తికాంక్షలపై మోజులేదు

మా అమ్మానాన్నలిద్దరూ వైద్యరంగానికి చెందిన వారు. చదువుల్లో ముందుండే దాన్ని. కానీ నటనంటే పిచ్చితో మొదట రంగస్థలంలో నటించి ఆ తరవాత సినిమాల్లోకి వచ్చాను. మంచి ప్రాజెక్టులో భాగం అయితే నాకెంతో సంతోషం కలుగుతుంది. దాని వల్ల వచ్చే కీర్తిని నేను పట్టించుకోను. అసలు నాకు గుర్తింపే ఇష్టం ఉండదు. సినీరంగంలో ఉండాలంటే ఓ విధమైన లైఫ్‌ సెయిల్‌ అలవర్చుకోవాలి. నిన్ను నీవు నిలబెట్టుకోవడానికి డబ్బు సంపాదించాలి. అవన్నీ నాకు నచ్చవు. అయినా ఈ రంగంలోనే కొనసాగుతున్నానంటే దానికి కారణం నటన. అనేక పాత్రల్లో నటించడం వల్ల చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అదొక్కటే నన్ను ఇక్కడ నిలిపింది.

మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల మహిళల ప్రాతలు పెరుగుతున్నాయన్నది నిజమే. మునుపెన్నడూ లేనంతగా మహిళా ఆర్టిస్ట్‌లకు ఇప్పుడు మార్కెట్‌  పెరిగింది. అయితే ఎప్పటి నుంచో ‘ఫిమేల్‌ సెంట్రిక్‌ స్టోరీస్‌’ సినిమాల్లో ఉన్నాయి. షబానా అజ్మీ, స్మితా పాటిల్‌, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ లాంటి తారలెందరో అద్భుతమైన మహిళా చిత్రాల్లో నటించారు. అయితే గణాంక పరంగా నేడు వీటి సంఖ్య ఎలా పెరిగిందనేది అంతగా తెలియదు.


బంధు ప్రీతి

మన భారతీయ సమాజం బంధుప్రీతిని పెంచిపోషించింది  ఇది ప్రతి రంగంలోనూ కన్పిస్తుంది. అనాదిగా కొన్ని కుటుంబాలని, వారి పిల్లలను మనం అభిమానిస్తున్నాం. సినిమాలలో కూడా ఫలానా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనగానే ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తారు. ఊరుపేరూ లేని అనామకుడి సినిమా చూడడానికే కాదు అసలు తీయడానికి కూడా ఏ నిర్మాతా రాడు. దీన్నంతా మార్చగల శక్తి ప్రేక్షకులలోనే ఉంది. వాళ్లు తలచుకుంటే మొత్తం మారుతుంది. సినీ పరిశ్రమలో వివిధ శాఖల్లో కొత్త వాళ్లు కనిపిస్తున్నారు. కంటెంట్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు, వెబ్‌ సిరీస్‌లకు ప్రజలు పట్టం కడుతున్నారు. మహమ్మారి వల్ల పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజవుతున్నాయి. కానీ కుటుంబ సమేతంగా థియేటర్లలో సినిమా చూడడం మన సంస్కృతి. థియేటర్లలో సినిమా చూడడంలో ఉండే మజానే వేరు. థియేటర్లు మళ్లీ మొదలయ్యే రోజులు త్వరలో వస్తాయనే ఆశిద్దాం.అప్పుడు తప్పలేదు

కెరీర్‌ మొదట్లో నేనూ డబ్బు సంపాదించడానికే నటించాను. ఏ పాత్ర దొరికితే అది చేశాను. వేషాల కోసం అష్టకష్టాలు పడ్డాను. ముంబయిలో బతకడం మన వల్ల కాదని ఇంటికి వెళ్లిపోయాను. మనసు చంపుకోలేక మళ్లీవచ్చాను. విజయం సాధించాను. కాకపోతే ఆఫర్‌ చేసిన ప్రతి పాత్రా చేయను. నాకు నచ్చితేనే చేస్తున్నాను. ఆ విషయంలో గట్టి క్లారిటీ లేకపోలేదు.లండన్‌లో ఐసోలేషన్‌

బెనడిక్ట్‌ టైలర్‌తో 2012లో పెళ్లైనప్పటి నుంచి ముంబయి, లండన్‌ల మఽఽధ్య తిరుగుతూ ఉన్నాం. మొన్న మార్చిలో లండన్‌కి వచ్చాం. లాక్‌డౌన్‌ మొదలవడంతో ఇక్కడే ఉండిపోయాం. బెనడిక్ట్‌ వయొలిన్‌ వాద్యకారుడు. అతడి సంగీతం వింటూ అలా గడిపేయొచ్చు. ఈ లాక్‌డౌన్‌ ను ఎప్పుడు ఎత్తేస్తారా పుణెలోని అమ్మానాన్నలని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఎదురుచూస్తున్నాను. లండన్‌ నాకు కొత్త కాదు. ‘కాంటెంపరరీ డ్యాన్స్‌’లో కోర్సు చేసేప్పుడు ఇక్కడ ఓ ఏడాది పాటున్నాను. ఆ తరవాత ఎక్కువగా ఇక్కడుంది ఈ లాక్‌డౌన్‌ సమయంలోనే. ఇంతకు మునుపు నన్నెవరూ గుర్తించేవాళ్లు కాదు కానీ ఇటీవల వెబ్‌ సిరీస్‌లు ఎక్కువగా చూస్తున్నట్టున్నారు. మా ఇంటి బయట కొంత మంది నా కోసం ఎదురుచూడడం ఆశ్చర్యం కలిగించింది.Updated Date - 2020-09-06T17:12:15+05:30 IST