ఆ అనుభూతి వన్స్‌మోర్!
ABN , First Publish Date - 2020-05-24T05:30:00+05:30 IST
లాక్డౌన్ పుణ్యమా అని టీవీలో పాత సీరియల్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. దూరదర్శన్‌లో 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘రామాయణ్’ సీరియల్‌ను లాక్డౌన్ సమయంలో ప్రసారం చేస్తే ఊహించని వీక్షకాదరణ...

లాక్డౌన్ పుణ్యమా అని టీవీలో పాత సీరియల్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. దూరదర్శన్‌లో 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘రామాయణ్’ సీరియల్‌ను లాక్డౌన్ సమయంలో ప్రసారం చేస్తే ఊహించని వీక్షకాదరణ లభించింది. దాంతో ఒకప్పుడు హిట్ అయిన సీరియళ్ల బూజు దులిపి ఈ జనరేషన్ కోసం తిరిగి ప్రసారం చేస్తున్నారు. వాటిని ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ ప్రేక్షకులు తెగ చూస్తుంటే, ‘నోస్టాల్జియా’ను గుర్తుచేసుకుంటూ మురిసిపోతున్నారు వాటిల్లో నటించిన తారలు.
షారుఖ్ ధైర్యం చెప్పేవారు!
ఎత్తయిన ప్రదేశాల నుంచి కిందికి చూస్తే జడుసుకునే నాకు ‘సర్కస్’ సీరియల్లో నటించే అవకాశం రావడం విధి విచిత్రం. అదొక భయంకర అనుభవం. నేను చేయనని భీష్మించుకుని కూర్చున్నా. అయితే షారుఖ్ (సినిమాల్లోకి రాకముందు షారుఖ్ ఖాన్ ఈ సీరియల్లో నటించారు), దర్శకుడు కుందన్ షా నా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. ‘సర్కస్’ సీరియల్ మా అందరికి మర్చిపోలేని ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఇందులో నాకు బాగా గుర్తుండిపోయిన ఒక షాట్ ఏమిటంటే... రాత్రిపూట నేను ‘సర్క్స’లోని ఒక నిచ్చెనను రకరకాల విన్యాసాలతో ఎక్కుతూనే నాలుగు అడుగుల మీద నుంచి బ్యాలెన్స్ తప్పి కింద ఉన్న నెట్లో పడాలి. ముందుగా పైకి ఎక్కగానే అక్కడి నుంచి గట్టిగా ఎడవడం మొదలెట్టా. అలాంటి పరిస్థితుల్లో ముఖంలోని భయం కెమెరాకు కనిపించకుండా నటించాలంటే కష్టమే. అయితే డైరెక్టర్ నాకు ధైర్యం చెబుతూ ఆ సీన్‌ను పూర్తి చేశారు. అప్పుడు తెలిసింది మనసులోని భయంతో కెమెరాకు పనిలేదని, మన టాలెంట్ మాత్రమే అవసరమని.
- రేణుకా సహానీ, నటి, ‘సర్కస్’ సీరియల్
రేఖాజీ మెచ్చుకున్నారు!
‘ఆఫీస్ ఆఫీస్’ సీరియల్లో పాన్ నమిలే ప్యూన్ శుక్లాగా నా పాత్రను ఎవరూ మర్చిపోరు. పాత్రలో లీనమైపోయేవాణ్ణి. అలవాటు అయ్యేందుకు పాన్లు తెగ నమిలేవాణ్ణి. దాంతో కాంపౌండ్‌వాల్ మీద పాన్ మరకలున్నాయని కంప్లయింట్ చేసేవారు. బాగా చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చిన నేను పాత్ర కోసం ఇలా చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయేవాణ్ణి. అయితే ఈ సీరియల్లో నటించేటప్పుడు నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే... ఒకరోజు కమలిస్థాన్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే రేఖగారు అక్కడికి వచ్చారు. అందరితో మాట్లాడుతున్న ఆమె హఠాత్తుగా నన్ను చూసి ‘‘ఇందులో నీ నటన నాకు బాగా నచ్చింది. నువ్వు బాగా చేస్తున్నావ్’’ అని మెచ్చుకున్నారు. రేఖా మామ్ నుంచి అనుకోని ప్రశంస నాకు లభించడంతో సెట్లో అంతా నన్ను ఆటపట్టించడం మొదలెట్టారు. ఆమె ప్రశంస నన్ను ఆకాశంలో తేలిపోయేలా చేసింది.
- సంజయ్ మిశ్రా, నటుడు, ‘ఆఫీస్ ఆఫీస్’ సీరియల్

ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది!
‘సీఐడీ’ సీరియల్ ఒకప్పుడు ఎంత పాపులరో తెలిసిందే. ఆ సీరియల్లో ‘ది కేస్ ఆఫ్ డెడ్లీ వైరస్’ అనే ఎపిసోడ్ నాకు బాగా గుర్తుంది. 1998లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ ఇప్పటి పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఒక తెలియని వైరస్‌ను ఛేదించేందుకు మేము శరీరానికి కిట్స్, ముఖానికి మాస్క్‌లు వేసుకుని నటించాం. చాలా వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌ను కట్టడి చేసేందుకు మా టీమ్ రంగంలోకి దిగుతుంది. 20 ఏళ్ల పాటు ప్రసారమైన ఈ సీరియల్లోని మరో ఎపిసోడ్ ‘ది ఇన్హెరిటెన్స్’. దీని కోసం 22 మంది నటులతో 111 నిమిషాల నిడివి గల ఎపిసోడ్‌ను ఏకధాటిగా ఒకే షాట్లో షూట్ చేశారు దర్శకుడు బీపీ సింగ్. ఈ విధంగా ఆ ఎపిసోడ్ గిన్నిస్‌బుక్, లిమ్కాబుక్ రికార్డుల్లోకి ఎక్కింది. లోనావాలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్లో సీరియల్ షూటింగ్ జరిగింది. కారు ఛేజింగ్‌లు, బాంబ్ బ్లాస్ట్‌లు... ఇలా ప్రతీది క్రమశిక్షణతో, ఒక టీమ్‌వర్క్‌గా సాగేది. మేమంతా ఒక కుటుంబంలోని వ్యక్తుల్లా ఉండేవాళ్లం.
- శివాజీ సాతమ్, నటుడు, ‘సీఐడీ’ సీరియల్

అర్ధరాత్రి ఫోన్ వచ్చింది...
‘దేఖ్ భాయ్ దేఖ్’ సీరియల్లో సమీర్ దివాన్ పాత్ర ఎంతగా పాపులరయ్యిందో తెలిసిందే. అందులోని మొదటి ఎపిసోడ్లో షేర్‌మార్కెట్ పడిపోయిందనే వార్త తెలిసి సమీర్ దివాన్ మెట్ల మీద నుంచి కిందపడిపోతాడు. నేను రబ్బర్ సోల్ ఉన్న బూట్లు వేసుకున్నా. మెట్ల మీద కార్పెట్ వేసి ఉంది. అక్కడ స్లిప్ కావడం అసాధ్యం. కానీ నేను నా శక్తిమేరకు నటించి ఇంటికి వెళ్లిపోయా. అర్థరాత్రి 2 గంటలకు దర్శకుడు ఆనంద్ మహేంద్రూ ఫోన్ చేశారు. ‘‘శేఖర్ .. నువ్వు ఏం చేశావో తెలుసా?’’ అన్నారు. వెంటనే తన ఆఫీసుకు రమ్మన్నారు. నేను కంగారు పడి, భయంతో సరిగా డ్రెస్ కూడా వేసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్లాను. అప్పటికే ఆనంద్ నా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నన్ను కౌగిలించుకుని ‘మెట్ల మీద నుంచి స్లిప్ అయ్యే షాట్ అంత సహజంగా ఎలా చేశావని, అద్భుతంగా వచ్చింద’ని మెచ్చుకున్నారు. దాన్ని అప్పట్లో టైటిల్ సాంగ్‌లో నా పరిచయ సన్నివేశంగా పెట్టారు. ఆ సీరియల్ కోసం లండన్‌లో తీసిన కొన్ని సీన్లు కూడా నాకు ఇంకా బాగా గుర్తున్నాయి.
- శేఖర్ సుమన్, నటుడు, ‘దేఖ్ భాయ్ దేఖ్’ సీరియల్

ఆ పాత్ర కోసం...
నేను అప్పటికే రమేశ్ సిప్పీ తీస్తున్న ఒక షోలో నటిస్తున్నా. అక్కడే మొదటిసారిగా ‘బునియాద్’ సీరియల్ గురించి విన్నా. 1916-1978 నేపథ్యంలో సాగే ఆ మెగా సీరియల్లో అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్‌లు నటిస్తారనే వార్తలు మీడియాలో వచ్చేవి. సీరియల్లో మాస్టర్ హవేలీరామ్ చిన్నకొడుకు రోషన్‌లాల్ పాత్రను నాకు ఇవ్వాలని రమేశ్‌గారు అనుకున్నారు (ఆ పాత్రను తర్వాత మజర్‌ఖాన్ చేశారు). అయితే నాకు మాత్రం లాలా వృషభణ్, వీరావలీల అక్రమ సంతానమైన సత్బీర్ పాత్ర చేయాలనుండేది. అయితే ఆ పాత్రకు నేను సరిపోననే భావన రమేశ్జీకి ఉండేది. కానీ ఆ పాత్ర మీద ఉన్న ఇష్టంతో నేను 20 రోజుల్లో బాగా సన్నగా, కుర్రాడిలా మారి దర్శకుడి ముందు నిల్చున్నా. దాంతో ఆయన ఒప్పుకున్నారు. నేను ఊహించినట్టు ‘బునియాద్’ సీరియల్ ప్రసారమైనప్పుడు సత్బీర్ పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి. తను అక్రమ సంతానమని సత్బీర్ తెలుసుకున్న సీన్లో భావోద్వేగాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
- కన్వల్జీత్ సింగ్, నటుడు, ‘బునియాద్’ సీరియల్
