శ్రమ జీవన సౌందర్యం

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

సోమరితనాన్ని బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ధ్యానం, జ్ఞానం విషయంలో భిక్షువులు నిరంతరం శ్రమించాలని చెప్పాడు. అలాగే సమాజంలోని శ్రమజీవుల శ్రమను గౌరవించాడు. బుద్ధుని కాలంలో ఈజిప్టు, గ్రీకు దేశాల్లో బానిస వ్యవస్థ...

శ్రమ జీవన సౌందర్యం

  • (నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం)


సోమరితనాన్ని బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ధ్యానం, జ్ఞానం విషయంలో  భిక్షువులు నిరంతరం శ్రమించాలని చెప్పాడు. అలాగే సమాజంలోని శ్రమజీవుల శ్రమను గౌరవించాడు. బుద్ధుని కాలంలో ఈజిప్టు, గ్రీకు దేశాల్లో బానిస వ్యవస్థ ఉంది. మనుషులను పశువుల్లా కొని, వారితో గొడ్డుచాకిరీ చేయించుకొనేవారు. భారతదేశంలోని ‘దాస’ వ్యవస్థ కూడా అలాంటిదే. ఈ దాసులతో పాటు కూలీలు ఉండేవారు. వారిని పశువుల కన్నా హీనంగా చూసేవారు యజమానులు. దీన్ని బౌద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమకు తగిన ఫలితాన్ని వారు పోరాడి సాధించుకోవాలన్నాడు. ఈ విషయం గురించి బుద్ధుడు చెప్పిన సందేశాత్మకమైన కథ ఇది.


‘‘ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉంది. ఆమెకు ఒక నదీ తీరంలో దిక్కుమొక్కు లేని బక్క చిక్కిన నల్లటి కోడె దూడ కనిపించింది. ఆమె దాన్ని తెచ్చుకొని, అల్లారుముద్దుగా పెచుకుంది. అది కొద్దికాలానికే బలిష్ఠంగా తయారైంది. దానికి ఆ ముసలమ్మ ‘కన్నయ్య’ అనే పేరు పెట్టుకుంది. అది పెరిగి పెద్దదయింది

ఒక రోజున ఆ ఎద్దు నదీతీరంలో మేస్తోంది. ఆ సమయానికి ఒక వ్యాపారి నదిలో రేవు దాటే మార్గంలోకి ధాన్యంతో నిండిన వంద బళ్ళతో వచ్చాడు. ఆ బళ్ళ చక్రాలు ఇసుకలో దిగబడిపోయాయి. బండ్లకు కట్టిన ఎద్దులు వాటిని లాగలేక చతికిలపడ్డాయి. ఆ వ్యాపారి అక్కడ సమీపంలో ఉన్న వారితో ‘‘మీ ఊళ్ళో మంచి బలమైన ఎద్దులు ఉన్నాయా?’’ అని అడిగాడు.

‘‘లేవు. అదిగో! అక్కడ మేస్తున్న కన్నయ్య మాత్రమే మీ పని చెయ్యగలదు’’ అన్నారు.

‘‘దాని యజమాని ఎవరు?’’ అని అడిగాడు.

‘‘అది ముసలవ్వది. ఆమె ఇక్కడ లేదు’’ అని వారు చెప్పారు.

అప్పుడు ఆ వ్యాపారి తన మనుషుల ద్వారా కన్నయ్యను బంధించి తెచ్చి, బలవంతాన బళ్ళు లాగించుకోవాలని చూశాడు. కన్నయ్య బుసకొట్టి వారి వెంట పడింది. వారు భయంతో వెనక్కు వచ్చారు.


‘‘అలా కుదరదు. ఈ పనికి తగిన ధనం ఇస్తానని ఒప్పుకోండి’’ అన్నారు అక్కడున్న వారు.

కన్నయ్య దగ్గరకు ఆ వ్యాపారి వెళ్ళి, ‘‘నా బళ్ళు లాగి పెట్టు. నీకు వెయ్యి నాణేలు ఇస్తాను’’ అని చెప్పాడు.


కన్నయ్య శాంతించి పనిలోకి దిగింది. అవలీలగా వంద బళ్ళనూ ఆవలి తీరానికి చేర్చింది. కానీ ఆ వ్యాపారి అయిదు వందల నాణేలను సంచిలో పెట్టి, కన్నయ్య మెడకు కట్టాడు. వ్యాపారి చేసిన మోసం కన్నయ్య గ్రహించింది. కోపంతో బుసలు కొట్టింది. బళ్ళకు ఎదురుగా వెళ్ళి నిలబడింది. రంకె వేసింది. కాలు దువ్వింది. వ్యాపారి తన పరివారాన్ని పిలిచి, కర్రలతో దాన్ని కొట్టించాలని ప్రయత్నించాడు. కన్నయ్య వారిని కొమ్ములతో కుమ్మినంత పని చేసి, బెదిరించింది. 

అది చూస్తున్న ప్రజలు ‘‘నువ్వు మొత్తం సొమ్ము ఇచ్చావా?’’ అని అడిగారు.

వ్యాపారి ‘‘లేదు’’ అన్నాడు.

‘‘మొత్తం సొమ్ము ఇవ్వకపోతే మీరంతా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు’’ అన్నారు వారు.

అప్పుడు కన్నయ్య ముందు వ్యాపారి చేతులు జోడించి, తప్పును మన్నించమంటూ మిగిలిన అయిదు వందల నాణేల్నీ ఆ సంచీలో వేశాడు. కన్నయ్య శాంతించి, దారి ఇచ్చింది. వ్యాపారి వెళ్లిపోయాడు. ఆ ధనాన్ని తెచ్చి తన అమ్మ ముసలమ్మకు ఇచ్చింది ఆ నల్ల ఎద్దు’’ అని చెప్పాడు బుద్ధుడు.

శ్రమ దోపిడీని ఎదిరించాలనీ, శ్రమకు తగిన ఫలితాన్ని సాధించుకోవాలనీ సందేశాన్ని ఇచ్చిన బుద్ధుడు ఈ ప్రపంచంలో తొలి సామ్యవాది! శ్రమ సౌందర్యాన్ని గౌరవించిన ధర్మ ప్రబోధి!

-బొర్రా గోవర్ధన్‌




Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST