మూర్ఖత్వాన్ని జయించాలంటే..

ABN , First Publish Date - 2020-02-08T10:36:26+05:30 IST

తన క్షేమాన్ని కోరి గడ్డి వేయడానికి వచ్చినవారిపైనే పోట్లగొడ్డు కొమ్ము విసిరినట్టు.. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని తొలగించడానికి మంచిని బోధించేవారిని ముఖం మీదే తిడతాడని దీని అర్థం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే రీతిలో..

మూర్ఖత్వాన్ని జయించాలంటే..

తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పినా

తిట్టుచుంద్రు మొరకు లెట్టయెదుట

గడ్డివేయ పోట్లగొడ్డు కొమ్మాడించు

విశ్వదాభిరామ వినురవేమ

తన క్షేమాన్ని కోరి గడ్డి వేయడానికి వచ్చినవారిపైనే పోట్లగొడ్డు కొమ్ము విసిరినట్టు.. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని తొలగించడానికి మంచిని బోధించేవారిని ముఖం మీదే తిడతాడని దీని అర్థం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే రీతిలో అవివేకపు పట్టుదలతో ఉండేవారిని గురించి వేమన చెప్పిన పద్యమిది. మూర్ఖులను మంచి మాటలతో మార్చాలనుకోవడం ఎంత నిష్ప్రయోజనమో భర్తృహరి ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా చెప్పాడు..

వ్యాళం బాలమృణాళ తంతుభి రసౌ రోద్ధుం సముజ్జృంభతే

భేత్తుం వజ్రమణిం శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతి

మాధుర్యం మధుబిన్దునా రచయితుం క్షారాంబుధే రీహతే

మూర్ఖన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్మన్దిభిః

తామరతూడు దారంతో మదపుటేనుగును బంధించడానికి ప్రయత్నించడం, దిరిశెనపువ్వు కొనచేత వజ్రాన్ని కోయడానికి పూనుకోవడం, లవణ సముద్రపు నీటిని మఽధురంగా చేయడానికి అందులో తేనెచుక్క వేయడం ఎలా నిష్ప్రయోజనాలో మంచి మాటలతో మూర్ఖుణ్ని సమాధానపరచాలనుకోవడం అంతే నిష్పలమవుతుందని పై శ్లోకభావం. సువాసనగల వస్తువులను గాడిద మోస్తుంటుంది. కానీ వాటి విలువను అది తెలుసుకోలేదు. అలాగే.. మంచివారితో ఉన్నా మూర్ఖుడు వారిలోని మంచిని గ్రహించలేడు. వేపచెట్టుకు తేనెపోసి పెంచినా చేదు పోదు. నీటితో నిప్పును నివారించవచ్చు. గొడుగుతో ఎండను ఆపవచ్చు. అంకుశంతో మదపుటేనుగును వశం చేసుకోవచ్చు. ఔషధంతో భయంకర రోగాన్ని బాపుకోవచ్చు. కానీ ముర్ఖుని మొండితనాన్ని నివారించే మందు ఎక్కడా లేదు. ఇసుక నుంచి తైలాన్ని తీయవచ్చు. ఎండమావులలోని నీటిని తాగవచ్చు. తిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు. కానీ మూర్ఖుని మనస్సు రంజింపలేము అనే లోకోక్తి అందరికీ తెలిసిందే. మరి దీనికి ఏమిటి మార్గం? మూర్ఖులు మంచి త్రోవ పట్టేదెలా? అంటే... అది వారి చేతుల్లోనే ఉంది. మనిషి మంచికి, చెడ్డకు మనసే కారణం. ఎంత మూర్ఖుడికైనా మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది. తెలిసినా మంచిని కాదని చెడువైపు మొగ్గడమే మూర్ఖత్వం. తెలియక చేస్తే అజ్ఞానం. కాబట్టి అలాంటి మొండితనం గలవారు తమ మనసునే ఆయుధంగా చేసుకుని తమ అవివేకాన్ని తామే అదుపులో పెట్టుకోవాలి. తమలో ఉండే మొండితనమనే రోగాన్ని భగవంతుడి వైపు మళ్లించి భక్తి అనే ఆయుధంగా మలచుకోవాలి. సర్వేశ్వర ధ్యానంతో సర్వవిధాలైన రోగాలూ అంతమైపోతాయి. ఇందుకు పెట్టుబడి అవసరం లేదు. భక్తితో మనసారా పరమాత్మను ధ్యానిస్తే చాలు. ఆ సర్వేశ్వరుడు ఎలాంటివారినైనా ఆదుకుంటాడు. భగవంతుని కరుణతో ఎంతటి మొండివాడైనా జన్మను సార్థకం చేసుకోవచ్చు.

- వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-02-08T10:36:26+05:30 IST