అనాత్మను తొలగిస్తే మిగిలేదే అసలైన ‘నేను’

ABN , First Publish Date - 2020-08-18T09:24:36+05:30 IST

ఈ శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి, అజ్ఞానం.. ఇవన్నీ జడమైనవి, అసత్‌. ‘నేను’ జడం కాదు. ‘నేను’ అంటే ఏకమైన సద్రూప చైతన్యమని దీని అర్థం. భగవాన్‌ రమణులు రచించిన 31 శ్లోకాల

అనాత్మను తొలగిస్తే మిగిలేదే అసలైన ‘నేను’

విగ్రహేంద్రియ ప్రాణధీతమ

నాహమేక సత్‌ తజ్జడం హ్యసత్‌


ఈ శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి, అజ్ఞానం.. ఇవన్నీ జడమైనవి, అసత్‌. ‘నేను’ జడం కాదు. ‘నేను’ అంటే ఏకమైన సద్రూప చైతన్యమని దీని అర్థం. భగవాన్‌ రమణులు రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన  గ్రంథం ‘ఉపదేశ సారం’లోని 22వ శ్లోకమిది. మనం మన నిజస్వరూపం తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటాం కనుక.. దేహమే ‘నేను’ అనుకుంటాం. అందుకే దేహానికి జబ్బు చేస్తే ‘నాకు జబ్బు చేసింది’ అంటాం. ఇంద్రియాలే మనం అనుకుంటాం కాబట్టి.. వినికిడి తగ్గితే ‘నాకు చెముడు వచ్చింది’ అంటాం. ప్రాణాలే ‘నేను’ అని భావిస్తాం కాబట్టి.. ప్రాణధర్మాలైన ఆకలి, దప్పిక వంటి భావనలు కలిగినప్పుడు ‘నాకు ఆకలిగా ఉంది’, ‘నాకు దాహం వేస్తోంది’ అని చెప్తాం. మనసు అశాంతిగా ఉంటే ‘నేను అశాంతిగా ఉన్నాను’ అని.. సంతోషంగా ఉంటే ‘నేను సంతోషంగా ఉన్నాను’ అని అంటుంటాం. ఇలా వివిధ ఉపాధులతో తాదాత్మ్యం చెంది అవే మనం అనుకుంటున్నాం. ఇవన్నీ అసత్‌ రూపాలు. జడ రూపాలు. ఇవేవీ అసలైన ‘నేను’ కావు. నిజమైన ‘నేను’.. ఏకమైన సత్‌రూప చైతన్యం. పుస్తకాన్ని తెలుసుకుంటున్నామంటే పుస్తకం మనకన్నా వేరుగా ఉన్నట్టే కదా. అలాగే ఈ దేహాన్ని, ఇంద్రియాలను, ప్రాణాలను, మనసును, బుద్ధిని, చివరకు అజ్ఞానాన్ని కూడా ‘నేను’ తెలుసుకుంటోంది. కాబట్టి వాటన్నింటికన్నా ‘నేను’ వేరుగా ఉన్నట్టే.

 

యత్‌ దృశ్యతం తత్‌ జడం.. ఏది దృశ్యమో, తెలియబడేదో అది జడమైనది. కనుక నాచే తెలియబడే శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనోబుద్ధులు అన్నీ జడములే. చైతన్యవంతంగా కనిపిస్తాయేగానీ అవి నిజంగా చైతన్యం కాదు. అవి ‘నేను’ అనే చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయి. శరీరం నిజంగా చైతన్యమే అయితే ఎప్పుడూ చైతన్యంగానే ఉండాలి. కానీ, ప్రతి శరీరం ఎప్పుడో ఒకప్పుడు చైతన్యరహితమైపోతోంది. కనుక అది జడమే. మరి ‘నేను’? అది చిత్‌ రూప చైతన్యం. జ్ఞానస్వరూపం. శాశ్వతం. ఈ నేను అన్నీ లయమైన గాఢనిద్రలో కూడా లయం కాకుండా ఉండిపోతోంది. అలా ఉండడం వల్లనే గాఢనిద్రలో వచ్చే కల గురించి మనం మేలుకున్న తర్వాత చెప్పగలుగుతున్నాం. అంటే అన్నీ లయమైనా అక్కడి అనుభవాన్ని చూసే సాక్షి ఒకరున్నారు. ఆ సాక్షే.. ‘నేను’.


ఒక వ్యక్తి ఒక శిల్పిని పిలిచి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చెక్కమన్నాడు. అతడి ఇంట్లోనే ఉన్న చెక్కల్లోంచి ఒక గంధపు చెక్కను ఏరి అందమైన విగ్రహంగా మార్చాడు శిల్పి. ‘ఎంత అందంగా చెక్కావయ్యా? ఇది దేనితో చేశావు?’ అన్నాడతడు. దానికా శిల్పి.. ‘నీ ఇంట్లోని చెక్కతోనే’ అన్నాడు. ‘ఆ చెక్కమొద్దులో ఇంత అందాన్ని ఎట్లా నింపావయ్యా’ అన్నాడు. దానికి శిల్పి.. ‘నేను అందాన్ని నింపలేదు. అది అందులోనే ఉంది. కాకపోతే వికారాన్ని తీసేశాను’ అన్నాడట. అలాగే మనలో ఉన్న అనాత్మను తొలగిస్తే చాలు.. అందమైన, ఆనందస్వరూపమైన ‘నేను’ మిగులుతుంది.


దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-08-18T09:24:36+05:30 IST