అదే పరమాత్మ సాక్షాత్కారం

ABN , First Publish Date - 2020-09-29T08:35:05+05:30 IST

జీవుడు తన ఉపాధులను గనుక వదిలినట్లైతే తన స్వరూపంలో తానుంటాడు. తన స్వరూపంగా, ఆత్మ స్వరూపంగా తానుండిపోవడమే పరమాత్మ

అదే పరమాత్మ సాక్షాత్కారం

వేషహానతః స్వాత్మదర్శనం

ఈశదర్శనం స్వాత్మరూపతః


జీవుడు తన ఉపాధులను గనుక వదిలినట్లైతే తన స్వరూపంలో తానుంటాడు. తన స్వరూపంగా, ఆత్మ స్వరూపంగా తానుండిపోవడమే పరమాత్మ సాక్షాత్కారం అని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి మానవాళికి అందించిన ఆత్మజ్ఞాన ప్రబోద గ్రంథం ‘ఉపదేశ సారం’లోని 25వ శ్లోకమిది. జీవుడికి, భగవంతుడికీ తేడా కేవలం ఉపాధుల్లోనేనని.. యథార్థంగా జీవేశ్వరులిద్దరూ ఒకే ఒక సద్‌ రూప చిద్రూప్‌ ఆనందరూప చైతన్యమేనని గత శ్లోకాల ద్వారా రమణులు చెప్పారు. కాబట్టి, జీవుడు తన ఉపాధులు తొలగించుకుంటే చాలు. ఈశ్వరుని ఉపాధి తనంతట తానే తొలగిపోతుంది. జీవుడు ఉపాధితో తాదాత్మ్యం పొందినంత కాలం మాత్రమే ఈశ్వరుడు మాయ అనే ఉపాధిని కలిగి ఉంటాడు.


మరి జీవుడు తన ఉపాధులను ఎలా తొలగించుకోవాలి? శరీరాన్ని కొయ్యాలా? హింసించాలా? అంటే.. అవేవీ అక్కర్లేదు. ‘ఈ దేహమే నేను’ అనే భ్రమను వదిలిపెట్టాలి. దేహ, మనో, బుద్ధులతో గల తాదాత్మ్యాన్ని వదిలి తన యథార్థ స్వరూపమైన ఆత్మచైతన్యంగా ఉండిపోవాలి. అలాగని,  ఉపాధులను వదిలినంత మాత్రాన అసలు వస్తువు నశించదు. ఉదాహరణకు.. 10 క్యాం డిల్‌ బల్బు, 40 క్యాండిల్‌ బల్బుల వెలుతురులో చాలా తేడా ఉంటుంది. కానీ, ఆ రెండింటినీ పగలగొడితే.. వాటి మధ్య ఆ భేదం(ఉపాధి-వెలుగు) పోతుంది.


కానీ, బల్బులు పగిలినా ఆ రెండు బల్బులు ఉన్న హోల్డర్లలోకి ప్రవహించే కరెంటు ఒక్కటే. దాంట్లో ఏ భేదమూ ఉండదు. అలాగే.. ఉపాధులు వదిలినా ఆత్మచైతన్యం ఎక్కడికీ పోదు. మరి ఉపాధులు పోతే ఏమవుతుంది? అంటే.. ఆ ఉపాధుల వల్ల వచ్చిన తేడాలు మాత్రమే పోతాయంతే. అవి పో యాక అంతా ఒక్కటే. అదే చైతన్యం. అలా చైతన్యంగా ఉండిపోవడమే స్వాత్మదర్శనం. అదే ఈశ్వర దర్శనం. పరమాత్మ సాక్షాత్కారం.అయితే, అది ఒక్కసారి కలిగి ఆ తర్వాత పోతే లాభం లేదు. శాశ్వతంగా ఉండిపోవాలి. ధ్యానం చేసేటప్పుడు గాఢమైన భక్తి, అమితమైన శ్రద్ధ, పరమేశ్వర కృప కలిగినవారికి వారి ఇష్టదైవ స్వరూపం లీలామాత్రంగా కనిపిస్తుంది. అంతమాత్రాన అదే పరమాత్మ సాక్షాత్కారంగా భావించి సాధన ఆపకూడదు. అది కేవలం కల్పిత భావనయే. అలాగే, భగవంతుడంటే సమిష్టి రూపుడు. అంటే అన్ని శరీరాల, మనస్సుల యొక్క భావాలను తెలుసుకోగలిగే దశ అది. అదే ఈశ్వర స్థితి. ఈ స్థితిని సాధనలో జీవుడు క్రమంగా పొందుతాడు.


ఎవరు వ్యష్టిని వదిలి కేవలం సమిష్టి భావనతో ఉంటారో వారే ఈశ్వరుడు. అయినా, అట్టివారు కూడా సాధన చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. కానీ, దానివల్ల కూడా ముక్తి కలుగుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే.. విశ్వరూప సందర్శనం ఆత్మసాక్షాత్కారం కాదు. పరమాత్మ విశ్వరూపాన్ని సందర్శించిన అర్జునుడు మరుజన్మలో తిన్నడుగా (భక్త కన్నప్ప) జన్మించినట్లు పురాణ గాధ ఉంది. అలాగే.. విశ్వరూప సందర్శన చేసిన యశోద, ఉదంకుడు, ధృతరాష్ట్రుడు వంటివారు ముక్తిని పొందినట్లు ఎక్కడా లేదు. కనుక కేవలం దర్శనాదుల వల్ల ముక్తి లేదు.

ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ‘నేను ఆత్మను’ అని గ్రహించి, సమస్త ఉపాధుల తాదాత్మ్యాన్ని వదిలి, తన స్వరూపంలో తానుండడమే (స్వాత్మదర్శనం) ఈశదర్శనం లేదా పరమాత్మ సాక్షాత్కారం. ఇదే నిజమైన భగవద్దర్శనం. మోక్షం.

-దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-09-29T08:35:05+05:30 IST