కర్మ ఫలితమే అదృష్టం

ABN , First Publish Date - 2020-12-17T08:15:19+05:30 IST

‘‘మనం జీవితంలో ఆచరించే కర్మను బట్టే మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఇదే జీవిత రహస్యం. అందుకే ఎవరి అదృష్టం వారి చేతల

కర్మ ఫలితమే అదృష్టం

కర్మ్‌ కరే కిస్మత్‌ బనే జీవన్‌ కా యహ్‌ మర్మ్‌

ప్రాణీ తేరే హాత్‌ మేఁ తేరా అపనా కర్మ్‌


‘‘మనం జీవితంలో ఆచరించే కర్మను బట్టే మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఇదే జీవిత రహస్యం. అందుకే ఎవరి అదృష్టం వారి చేతల ద్వారానే నిర్ణయించబడుతుంది కానీ మరేది కాదు’’ అంటారు మహాత్మా కబీరు. శక్తి వంచన లేకుండా చేసే కృషి వల్లే అదృష్టం కలుగుతుందనేది కబీరు అభిప్రాయం. కష్టేఫలే, కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు చెప్పిందీ ఇదే.


మనిషి జీవితం ఎన్నెన్నో మలుపులు తిరుగుతుంటుంది. ప్రతి మలుపూ ఏదో ఒక ప్రభావాన్ని చూపుతుంది. మనం చేసే మంచి పనులు మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని కొందరంటే మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ స్థితి అని మరికొందరంటారు. విష్ణుమూర్తి ఈ భూమ్మీద రామునిగా అవతరించి.. తనకు ఎదురైన కష్టాలను సహనంతో ఎదుర్కొని, నిరంతరం సత్కర్మలను ఆచరించి పురుషోత్తముడయ్యాడు.


శ్రీకృష్ణుడు కూడా.. అదృష్టం కోసం ముక్కుమూసుకుని తపస్సు చేయాలని చెప్పలేదు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేయాలని బోధించలేదు. సంసారం దుఃఖసాగరమని నిరాశపడకుండా మనిషి సహజ స్వభావమైన కర్మ చేయాలని, ఆ చేసేదేదో మంచి కర్మ చేయాలని అర్జునికి బోధిస్తాడు. అంటే మంచి పనులే మనిషికి అదృష్టాన్ని తెచ్చిపెడుతూ మనిషి సుఖసంతోషాలతో జీవించే అవకాశం కల్పిస్తుందని పరమాత్ముని బోధనసారం.


‘‘మనిషి నిస్వార్థంతో చేసే మంచి పనుల వల్లే మంచి ఫలితం సిద్ధిస్తుంది. సిద్ధాంతాలు, మతాచారాలకు అతీతంగా.. అనుక్షణం స్వార్థ రహితమైన కర్మను ఆచరించడమే ప్రతి మనిషి పరమావధి. అలా చేయడంవల్ల ఒనగూరే ఫలితాలెన్నో!’’ అన్నారు స్వామి వివేకానంద. ఒక్కొక్కప్పుడు మంచి పనులతో మనిషి కష్టాలెదుర్కొనే పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భాల్లో ధైర్యంగా వాటిని ఎదుర్కొంటే అంతిమంగా మంచి ఫలితమే లభిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు తాను ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసంఅష్టకష్టాలను భరించడమే గాక, భార్యాబిడ్డలను సైతం అమ్ముకున్నాడు. తాను కాటికాపరిగా మారాడు. ఎన్ని కష్టాలెదురైనా.. సత్యాన్ని విడువకుండా ప్రయత్నించి భగవత్‌ సాక్షాత్కారాన్ని పొందాడు. అదీ సత్కర్మల శక్తి.
‘‘కష్టాలను తలకెక్కించుకోలేని మనిషి సుఖాలను అనుభవించ సాధ్యపడదు’’ అని సత్యసాయిబాబా చెప్పేవారు. కష్టపడి పొందిన ఫలితమే మనిషికి సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. ఎలాంటి కష్టం లేకుండా వచ్చేవి మానసిక ఆనందాన్ని కలిగించకపోగా అవమానాలకు గురిచేయవచ్చు.

వ్యక్తిగత జీవితానికి పెను ముప్పుగా పరిణమించి ప్రాణాలచే పణంగాపెట్టే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అందుకే నిరుపేదైనా సంపన్నుడైనా శ్రమ శీలాన్ని అలవరుచుకోవడం ముఖ్యం.


- పరికిపండ్ల సారంగపాణి, 9849630290


Updated Date - 2020-12-17T08:15:19+05:30 IST