సర్వదేవతా స్వరూపిణి

ABN , First Publish Date - 2020-10-19T05:39:57+05:30 IST

శరన్నవరాత్ర మహోత్సవాలలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు.

సర్వదేవతా స్వరూపిణి

నేటి అలంకరణ

శ్రీ గాయత్రీ దేవి

19-10-2020

సోమవారం, ఆశ్వయుజ శుద్ధ తదియ


ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్‌ ముఖైస్త్రీ క్షణైః

యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌

గాయత్రీం వరదాభయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర మఽధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!


శరన్నవరాత్ర మహోత్సవాలలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ముఽఖాలతో, ప్రతి ముఖంలో మూడు నేత్రాలు, శిరస్సున చంద్రరేఖ ధరించి దశ హస్తాలలో ఆయుధ- ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత.


ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయ భాగంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారట! అందుకే త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతోంది. వరద, అభయహస్తాలతో... సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు. కాబట్టి గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుందనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ పెద్దల మాట.


గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుందనీ, గాయత్రిని వేదమాతగా కొలుస్తూ, ఆమెను దర్శించడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారనీ, ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయనీ శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ దేవి అర్చనతో సద్బుద్ధులు కలుగుతాయనీ, పాపాలు నశిస్తాయనీ, అజ్ఞానం తొలగిపోతుందనీ భక్తుల విశ్వాసం.. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది.


వివిధ దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావిస్తారు. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. 

నైవేద్యం: అల్లం గారెలు, ఐదు రకాల పిండివంటలు

అలంకరించే చీర రంగు: కాషాయ వర్ణం

పారాయణ : గాయత్రీ మంత్రం


Updated Date - 2020-10-19T05:39:57+05:30 IST