తస్య వాచకః ప్రణవః

ABN , First Publish Date - 2020-12-28T09:59:44+05:30 IST

సనాతన సంప్రదాయంలో ఓంకారానికి చాలా ప్రాధాన్యం ఉంది. పరమాత్మను ప్రణవంతో సూచిస్తారు. వేదం మొదలుకొని మంత్ర శాస్త్రం వరకూ అన్నింటిలో ఓంకారం విశిష్ఠ స్థానాన్ని కలిగి ఉంది.

తస్య వాచకః ప్రణవః

సనాతన సంప్రదాయంలో ఓంకారానికి చాలా ప్రాధాన్యం ఉంది. పరమాత్మను ప్రణవంతో సూచిస్తారు. వేదం మొదలుకొని మంత్ర శాస్త్రం వరకూ అన్నింటిలో ఓంకారం విశిష్ఠ స్థానాన్ని కలిగి ఉంది. అందుకే మంత్రాలన్నీ ప్రణవంతోనే మొదలవుతాయి.


ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః


‘యోగులు నిత్యం ధ్యానించే బిందుపూర్వకమైన ఓంకారం కోర్కెలు తీర్చేది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ఓంకారానికి నమస్సులు’ అని శాస్త్ర ప్రమాణం. చతుర్వేదాలు మంత్రరూపంగా ప్రణవం నుండే పుట్టినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రణవం సర్వాధిష్ఠాన మంత్రం అయ్యింది. ఏ మంత్రమైనా ప్రణవ సహితంగా ఉచ్చరిస్తేనే ఫలిస్తుందని సంప్రదాయం చెప్పింది.


సర్వేషామేవ మంత్రాణాం కారణం ప్రణవస్స్మృతః

తస్మాద్వ్యా హృతయో జాతాస్తోభ్యో వేదత్రయస్తథా


ఓంకారంలోని మూడు వ్యాహృతుల నుండి మూడు వేదాలు ఉద్భవించాయి. అందువల్ల సర్వమంత్ర మూలమైంది ఓంకారం. ఓంకార వాచ్యంతో పరమాత్మ అంతటా శబ్ద బ్రహ్మగా ఉన్నాడంటారు. ప్రణవాంతర్గతమైన ‘అ’కారం బ్రహ్మతత్వంలో అవిద్యాపాదం. ‘ఉ’కారం విద్యాపాదం. ‘మ’కారం ఆనందపాదం. ‘ప్రణవమందు సమస్తం నిండి ఉంది’ అంటారు ఆచార్యులు. ఓంకారంలోని ‘అ’కారం పృథ్విగా, ‘ఉ’కారం (ఆకాశం) అంతరిక్షంగా, ‘మ’కారం అగ్నిగా; అలాగే స్థూల, సూక్ష్మ, కారణ తత్వాలకు, త్రికాలాలకు, త్రిమూర్తులకు ప్రతీకలుగా చెప్తారు. ఈ త్రివిధ అవస్థలను సూచించే సమష్టి రూపం ఓంకారం. అందుకే పరమాత్మ ఓంకార స్వరూపుడు. ఓంకారం అన్ని శబ్దాలనూ తనలో ఇముడ్చుకొని భగవంతుని సాకార నిరాకార తత్వాలను ప్రకటిస్తున్నది. వర్ణాత్మకమైన ఓంకారం శక్తిస్వరూపం. అది మాతృక. మాత్ర అంటే హ్రస్వదీర్ఘాల కలయిక. అన్ని అక్షరాలనూ పలికించే మంత్రశక్తి ప్రణవంలో ఉంది. సత్య, జ్ఞాన, అనంతమైన బ్రహ్మ తత్వాన్ని ప్రణవం వ్యక్తపరుస్తుంది. ఇది శబ్దానికి ప్రతీక. ఆ ‘శబ్ద బ్రహ్మ’ లేకుండా ఈ సృష్టిలో ఏ విషయం లేదు. నామ రూపాత్మకమైన జగత్తుకంతా ఈ శబ్దబ్రహ్మే ఆధారం. ఓంకారానికి భాషా సంబంధమైన అర్థాన్ని ప్రత్యేకంగా చెప్పలేం. కానీ మన సాధకులు దానిని బాగా ఉపయోగించారు.


పదానికన్నా ఇక్కడ శబ్దానికే ప్రాధాన్యం ఉంది. పదం పైస్థాయిలో స్థూలంగా ఆనందాన్ని కలిగిస్తుంది. శబ్దం అంతరికమైన ఆనందాన్నిస్తుంది. అందుకే వేదాలను శ్రుతులు అని, వేదాలు రాశారు అనకుండా దర్శించారని అన్నారు. ఇది అనుభూతి ప్రధానం. ప్రణవాన్ని ‘శబ్ద బ్రహ్మ’గా సాఽధన చేశాక ‘‘ఆనందో బ్రహ్మేతి వ్యజానీయత్‌’’ అన్న స్థితి కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

- డా.పి.భాస్కరయోగి

Updated Date - 2020-12-28T09:59:44+05:30 IST