శ్రీరామ సేవా భాగ్యవంతుడు

ABN , First Publish Date - 2020-11-07T09:44:14+05:30 IST

లక్ష్మణుడు బాల్యం నుంచీ శ్రీరాముని పట్ల అధిక ప్రేమను, సేవాభావాన్ని కలిగి ఉండేవాడు. పువ్వు గొప్పదనాన్ని దాని పరిమళం, సూర్యుని గొప్పదనాన్ని

శ్రీరామ సేవా భాగ్యవంతుడు

బాల్యాత్‌ ప్రభృతి సుస్నిగ్ధః లక్ష్మణః లక్ష్మీ వర్ధనః


లక్ష్మణుడు బాల్యం నుంచీ శ్రీరాముని పట్ల అధిక ప్రేమను, సేవాభావాన్ని కలిగి ఉండేవాడు. పువ్వు గొప్పదనాన్ని దాని పరిమళం, సూర్యుని గొప్పదనాన్ని కాంతి తెలుపునట్లు.. లక్ష్మణుడు పువ్వు వంటి, సూర్యుని వంటి రాముని మహిమను దినదినాభివృద్ధి కావించాడు. రాముడికి ప్రియం కలిగేలా, హితం కలిగేలా ఉండడానికి తన శరీరానికి ఎంత శ్రమ కలిగినా లెక్క చేసేవాడు కాదు. అనుక్షణం ఆ పురుషోత్తముడికి కుడిభుజంగా, బహిఃప్రాణంగా ఉండేవాడు. అందుకే మారీచుడు రావణుడితో.. రామస్య దక్షిణో బాహుః నిత్యం ప్రాణో బహిశ్చరః అని చెప్పాడు. 


నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమఃశ్రీ

మృష్టమన్నముపానీతం అశ్నాతి నచ తం వినా


కుడిచేయి లేనిదే తినడం సాధ్యం కాదు కదా. అందుకే ఎంత రుచికరమైన, ఇష్టమైన పదార్థాన్ని వడ్డించినా, తన కుడి భుజమైన లక్ష్మణుడు లేనిదే శ్రీరాముడు భుజించేవాడు కాదట. ప్రాణం ఉంటేనే నిద్రించడం సాధ్యమైనట్లు.. తన ప్రాణం వంటి లక్ష్మణుడు దగ్గరగా ఉన్నప్పుడే శ్రీరాముడు నిద్రించేవాడని వాల్మీకి మహర్షి చెప్పారు. రాజ్యపరిపాలనపై ఉన్నత పదవులపై ఏ మాత్రం ఆశలేని లక్ష్మణుని గురించి వాల్మీకి మహర్షి ‘‘లక్ష్మణో లక్ష్మి సంపన్నః’.. అనగా శ్రీరామ సేవా భాగ్యవంతుడైన లక్ష్మణుడు అని పేర్కొన్నారు.


పితృవాక్య పరిపాలన కొరకు శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు.. ‘‘నీటిని వదిలి చేపలు జీవించలేనట్లు నిన్నువదిలి నేను క్షణకాలం కూడా బ్రతకలేను. నన్ను కూడా అడవికి తీసుకొని వెళ్లు సోదరా! వనవాస సమయంలో నీవు మెలకువగా ఉన్నప్పుడు అవసరమైన సేవలను అన్నింటినీ చేస్తాను. నీవు నిద్రించేప్పుడు ఎటువంటి ఆపదా రాకుండా నేను మెలకువగా ఉండి నీ రక్షణ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను. నీ సేవ చేయకుండా నేను ఉండలేను అని లక్ష్మణుడు శ్రీరాముని పాదాలను పట్టుకుని మరీ ప్రార్థించాడు. 


అరణ్యవాస సమయంలో సీతారాముల నివాసానికి అనుకూలంగా ఎన్నో జాగ్రత్తలతో, తగిన సదుపాయాలతో చూడముచ్చట గొలుపునట్లు ఆశ్రమ నిర్మాణం చేసిన లక్ష్మణుని శ్రీరాముడు తన రెండు చేతులతో గాఢాలింగనం చేసుకొని.. ‘‘నాకు నీవు తగిన సేవలనందిస్తూ తండ్రి లేని లోటును తీర్చావు. తండ్రితో సమానుడవయ్యావు’’ అని లక్షణుని అభినందించడం వల్ల లక్ష్మణుని శ్రీరామ సేవాతతృరత ఎంతటిదో స్పష్టమవుతోంది. అందుకే నాటి నుంచి నేటి వరకూ లోకంలో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండే సోదరులను.. రామలక్ష్మణుల్లాగా కలిసిమెలిసి ఉన్నారని పేర్కొనడం, కవలపిల్లలకు రామ లక్ష్మణులని పేర్లు పెట్టడం సాధారణంగా మారింది.


సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-11-07T09:44:14+05:30 IST