ఆధ్యాత్మికతే ఔషధం

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

మనుషులకు వారి పరిమితులు ఏమిటో తెలియజేయడానికి ప్రకృతి ఎన్‌సిడిని సృష్టించింది...

ఆధ్యాత్మికతే ఔషధం

ఆధునిక జీవన విధానం నుంచి విడదీయలేని ఒక భాగం ఒత్తిడి. ఇది కొన్ని విచిత్రమైన వ్యాధులకు జన్మను ఇస్తూ ఉంటుంది. ఒత్తిడిని ‘నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌’ (ఎన్‌సిడి) అనొచ్చు. అంటే అంటకుండా వ్యాపించే రోగం. ఇది చాలా భయంకరమైనది. జీవితాంతం మనిషిని వదిలిపెట్టదు. క్షణక్షణం శిధిలమయ్యేలా చేస్తుంది. దీనివల్ల కలిగే బాధలు ఒక్కొక్కసారి ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఇది తీవ్రమైపోయిన మనిషి ఇచ్ఛా మరణం కావాలని యాచిస్తూ ఉంటాడు. ఈ వ్యాధి అకస్మాత్తుగా మనిషిని మానసిక వ్యధకు గురి చేస్తుంది. దృఢంగా ఉండి, తిరుగుతూ ఉండే మనిషి బలహీనుడైపోతాడు. రోగిష్టిగా మారి యమయాతనలు అనుభవిస్తాడు.


ఈ కలియుగంలో మనిషి ధన వ్యామోహంలో చిక్కుకున్నాడు. పరమేశ్వరుడికి భయపడకుండా, ఎలాంటి సంకోచం లేకుండా చెడ్డ కర్మలు చేస్తున్నాడు. భగవద్గీత కర్మ సిధ్ధాంతాన్ని కూడా ఎద్దేవా చేసేవారు ఉన్నారు. అలాంటి మనుషులకు వారి పరిమితులు ఏమిటో తెలియజేయడానికి ప్రకృతి ఎన్‌సిడిని సృష్టించింది.   యువతలో వ్యసనాలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. తమ ఆనందం, సంతోషమే తప్ప వారిలో బాధ్యత ఉండడం లేదు. ధనవంతులు ఉండే వీధుల్లో గొప్ప కోసం కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్‌ తీసుకొని, నెలనెలా అప్పు చేస్తూ చెల్లింపులు జరపడం, దాని కోసం మరణించే దాకా చస్తూ బతకడం సాధారణమైన విషయం అయిపోయింది. ఈ ఒత్తిడి వల్ల మధ్యలోనే మరణిస్తే, వారి శ్రమ ఫలితాన్ని వేరెవరో అనుభవిస్తారు. ఈ ఆలోచన మనిషికి రానే రాదు. బుద్ధిలో సారం లేకపోవడమే దీనికి కారణం.


భోగాలు నాలుగు రకాలు. అవి- తనువు, మనసు, జనం, ధనం ద్వారా కలిగేవి. వీటిలో ఒకటీ లేదా అంతకు మించిన భోగాలు మనిషి ఆత్మను చుట్టుకొని దాడి చేస్తాయి. మనిషి అభిమన్యుడిలా బాధల చక్రంలో చిక్కుకుంటాడు. అలాంటివారు పరమేశ్వరుడు అందించే చేతిని పట్టుకునేందుకు ఇష్టపడరు. అహంకారంతో, అనుమానాలతో జీవితాన్ని నడిపిస్తారు. అంతిమ సమయంలో బాధపడతారు. ధనం వల్ల వచ్చిన అహంకారం మాయమైపోతుంది. అందుకే ముందే మేలుకొని పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి.  అధిక ఒత్తిడి వల్ల కలిగిన వ్యాధులను రాజయోగంలోని నియమిత సాధన వల్ల నయం చేసుకోవచ్చు. అలా జరగాలంటే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. అదే మంచి ఔషధం. దానివల్ల వివేకం పెరుగుతుంది. ఒత్తిడి అనే మహమ్మారి దూరం అవుతుంది.

- బ్రహ్మకుమారీస్‌


Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST