మార్గశీర్ష, ధనుర్మాసాల ఆధ్యాత్మిక వికాసం

ABN , First Publish Date - 2020-12-15T09:37:33+05:30 IST

ఈ శార్వరి నామ సంవత్సరంలో ఒక విశేషం.. ఒక రోజు తేడాలో ధనుర్మాసం, మార్గశీర్ష మాసం కలిసి రావడం. చాంద్రమానం ప్రకారం కార్తికమాసం అయిన మరునాటి నుంచి

మార్గశీర్ష, ధనుర్మాసాల ఆధ్యాత్మిక వికాసం

ఈ  శార్వరి నామ సంవత్సరంలో ఒక విశేషం.. ఒక రోజు తేడాలో ధనుర్మాసం, మార్గశీర్ష మాసం కలిసి రావడం. చాంద్రమానం ప్రకారం కార్తికమాసం అయిన మరునాటి నుంచి మార్గశిరం ప్రారంభమవుతుండగా.. ఆ మరునాడే సౌరమానం ప్రకారం ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. ‘మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీ మద్భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుని వచనం. కనుక మార్గశిరమాసం సాక్షాత్‌  విష్ణు స్వరూపమే. ఇక ధనుర్మాసమంతా విష్ణుపూజనమే చేయాలి అని ఎన్నో పురాణాలు, ఆగమ గ్రంథాలు కూడా చెబుతున్నాయి. మార్గశీర్ష మాసంలోని అతి ముఖ్యమైన సందర్భాలలో మొదటిది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి.


ఆ రోజు.. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. అగ్ని చేత భరించబడిన శివతేజస్సు నుంచి ప్రభవించడం వల్ల అగ్నిసంభవుడని, రెల్లుపొదల మధ్య పుట్టడం వల్ల శరవణభవుడని, గంగాదేవి చేత కొంత కాలము ధరింప బడుటచేత గాంగేయుడని, సప్తఋషులలో ఆరుగురు ఋషుల భార్యలను తన తల్లులుగా అంగీకరించి ఒకేసారి వారి స్తన్యమును తాగడానికి ఆరు ముఖాలను ధరించినందున షణ్ముఖుడని.. సాక్షాత్తూ పరబ్రహ్మ తత్త్వమే కుమారునిగా పుట్టడం వల్ల శ్రీ సుబ్రహ్మణ్యునిగా.. ఇలా అనేక నామములతో పిలువబడే దైవం శ్రీ కుమారస్వామి. అటువంటి ఈ షణ్మాతురునికి.. గంగా, గౌరీ దేవతల కుమారుడు కనుక ద్వైమాతురుడు అని కూడా పేరు ఉన్నది. శ్రీ కుమారస్వామిని ఈ రోజు శ్రద్ధాసక్తులతో పూజించుకునేవారికి ఐహిక, ఆముష్మికములకు చెందిన కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాదు అధ్యాత్మ వికాసానికి కూడా ఇది ఎంతో దోహదకారి. సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుంది. నాగ దోషాలున్నవారికి పరిహారము శ్రీ సుబ్రహ్మణ్యుని పూజ.


ఈ మాస ద్వయంలో వచ్చే ఏకాదశీ తిథికి ఒక విశిష్టత ఉన్నది. ఆ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో గీతాజయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలి. అది.. కర్మ మార్గములో పయనించే వారికి ధర్మవ్యాధునికి సిద్ధి కలిగిన విధంగా సిద్ధిని కలుగ జేస్తుంది. భక్తి మార్గాన్ని అనుసరించేవారికి నారద, పరాశర, పుండరీకాదులకు వలె సత్ఫల దాయకం. అలాగే జ్ఞాన మార్గాన్ని అనుసరించే వారికి మోక్షాన్నిస్తుంది. జగద్గురువు, గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మను, ధనుర్ధరుడగు అర్జునుని మనసులో నిలుపుకొని గీతా సమర్చన చేసుకుని పారాయణం చేసుకోదగిన రోజు ఇది. కార్తిక అమావాస్య నాడు కురుక్షేత్రంలో, యుద్ధభూమిలో, యుద్ధారంభ సమయంలో.. శ్రీకృష్ణ భగవానునిచే అర్జునునికి ఏకాంతంలో మంత్రంగా బోధింపబడిన భగవద్గీత.. మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ధృతరాష్ట్ర సంభాషణ ద్వారా లోకవిశ్రుతమై కర్మ, భక్తి, జ్ఞానములకు కూడలి అయిన లోకోద్ధారక తంత్రమైంది. ఇక ధనుర్మాస దృష్ట్యా చూస్తే ఈసారి మార్గశిర శుద్ధ ఏకాదశికి మరొక ప్రాశస్త్యం ఉంది.


అదేంటంటే.. ఈరోజును వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారు. మార్గశిర, పుష్య మాసాల్లో ఏ మాసంతో ధనుర్మాసం కలిస్తే ఆ మాసంలోని శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అవుతుంది. కార్తికంలో నిదుర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ముక్కోటి దేవతలూ వైకుంఠంలో దర్శనం చేసుకునే రోజు ఇది. అందుకే ఈ రోజు అనంత కోటి బ్రహ్మాండ వాసులకూ పర్వదినం. ఇది ముక్తి ప్రదాయకం కనుక దీనికి మోక్ష ఏకాదశి అని కూడా పేరు. అలాగే ఈ ధనుర్మాసం అంతా ఉషఃకాలం లోనే విష్ణు పూజనం చేసుకోదగిన మహత్తరమైన మాసం. కనుకనే  భక్తులకు,  జ్ఞానులకు, యోగులకూ, తత్త్వాన్వేషకులకు ఇది ఎంతో దివ్యమైన మాసం.


ఆచార్య రాణి సదాశివ మూర్తి

Updated Date - 2020-12-15T09:37:33+05:30 IST