క్షమాగుణమే సర్వశ్రేష్ఠము

ABN , First Publish Date - 2020-12-06T08:45:25+05:30 IST

మానవ ధర్మాచరణాలో క్షమాగుణానికి అత్యంత ప్రాధాన్యముంది. క్షమాగుణంతో అనేక విధాలైన అకృత్యాలకు, హింసకు అడ్డుకట్ట వేయొచ్చు. క్షమాగుణాన్ని పొందగలడానికి కృషి అవసరం.

క్షమాగుణమే సర్వశ్రేష్ఠము

క్షమయా రోచతేలక్ష్మీః బ్రహ్మీసౌరీ ప్రభాయథాశ్రీ

క్షమిణామాశు భగవాన్‌ స్తుష్యతే హరిరీశ్వరఃశ్రీశ్రీ


మానవ ధర్మాచరణాలో క్షమాగుణానికి అత్యంత ప్రాధాన్యముంది. క్షమాగుణంతో అనేక విధాలైన అకృత్యాలకు, హింసకు అడ్డుకట్ట వేయొచ్చు. క్షమాగుణాన్ని పొందగలడానికి కృషి అవసరం. ధర్మ శాస్త్రాలు కూడా క్షమాగుణ ప్రాశస్త్యాన్ని ప్రముఖంగా చెప్పాయి. సనాతన ధర్మం చెప్పిన పంచభూతాల క్షమ అసాధారణం. అది ప్రకృతిని సమతౌల్యంగా ఉంచి.. యావత్ప్రపంచాన్ని భద్రంగా ఉండటానికి తోడ్పడుతుంది. అందులో మరీ ముఖ్యంగా భూమికున్న క్షమాగుణం అసాధారణం. అందుకే ‘‘క్షమయా ధరిత్రీ’’ అనే మాట స్థిరపడింది. అటువంటి విశిష్టమైన క్షమాగుణాన్ని గురించి వేదవ్యాస మహర్షి జమదగ్ని మహర్షి ముఖంగా భాగవత పురాణంలో ప్రత్యేకంగా చెప్పించాడు.


అత్యంతమైన రోషంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడి గర్వాన్ని తన పరాక్రమంతో అంతమొందించి.. ఆయన సైన్యాన్ని వధించి.. అతడు తీసుకుపోయిన తండ్రి హోమధేనువును తీసుకువచ్చి.. తండ్రియైున జమదగ్నికి అప్పగించాడు. విషయం తెలుసుకున్న జమదగ్ని మహర్షి.. క్షమాగుణము కలిగి ఉండాలని వివరంగా బోధిస్తూ ‘‘సరస్వతీయుక్తమైన లక్ష్మీ దేవి క్షమాగుణం వల్లనే సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది. క్షమ కలిగిన వ్యక్తుల విషయంలో సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు త్వరగా సంతసిస్తాడు’’ అని స్పష్టంగా చెప్పాడు. కోపంలో మనిషిలోని విచక్షణ జ్ఞానం నశించి.. చేయరాని పనులను చేసి అశాంతికి గురవుతాడు. అందుకే ఎప్పుడైనా స్థిమితపడి ఆలోచించాలి. పాలకుణ్ని సంహరించడం ఆ పాలనలోని ప్రజలకు, ఆ రాజ్యంలోని ఇతర కార్యక్రమాలకు అవరోధం కలుగుతుంది. అవతలి వ్యక్తి తప్పుచేసి ఉండవచ్చు, కానీ, దాన్ని మరో పద్ధతిలో పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప కోపం పెంచుకొని మారణకాండకు పూనుకోవడం సర్వనాశనానికి దారితీస్తుంది.


ఆ విషయాన్నే భార్గవ రామునికి అతని తండ్రి జమదగ్ని మిక్కిలి సంయమనంతో బోధించాడు. అంతేకాదు తాపసులకు, బ్రాహ్మణులకు క్షమాగుణమే శోభాయమానమైన అలంకారమని, బోధించాడు. రాజు వధ.. బ్రహ్మహత్యాదోషం కంటే తీవ్రమైనది. తమ గౌరవమంతా క్షమాగుణం వల్లనే చేసిన ఈ పని పాపకార్యంగా భావించి, అతడిని తీర్థయాత్రలుచేసి యమ నియమాలను పాటిస్తూ పాపవిముక్తి పొందమని కూడా బోధించాడు. ఏ విధమైన క్రూర సంఘటనలకు దారితీయని గొప్ప దనం. క్షమాగుణానికున్నవనీ భాగవత సందేశాన్ని తెలుగు భాగవత కర్త బమ్మెర పోతనామాత్యుడు కూడా.. 


‘‘క్షమగలిగిన సిరిగలుగును

క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యము తల్లన్‌

క్షమగలుగఁదోనగలుగును


క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రీ!’’ అని వివరించిన రీతిని బట్టి సర్వ శ్రేష్ఠమైన గుణాలలో అత్యంత ప్రసిద్ధమైనది క్షమాగుణమేనన్నది నిర్వివాదమైన విషయం.


 గన్నమరాజు గిరిజామనోహరబాబు

Read more