మనిషి తల విలువ!
ABN , First Publish Date - 2020-03-13T06:03:46+05:30 IST
ఒక రోజు అశోకుడు మేడపై నిలబడి రాజవీధి వైపు చూస్తున్నాడు. ఒక యువ భిక్షువు అటుకేసి వస్తూ కనిపించాడు. అతని ముఖ వర్చస్సు...

ఒక రోజు అశోకుడు మేడపై నిలబడి రాజవీధి వైపు చూస్తున్నాడు. ఒక యువ భిక్షువు అటుకేసి వస్తూ కనిపించాడు. అతని ముఖ వర్చస్సు అశోకుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది.
‘‘ఆ భిక్షువును నా సభా మంటపానికి సాదరంగా తీసుకురండి’’ అని సేవకులకు చెప్పాడు. ద్వార పాలకుడు ఆ విషయాన్ని సేనాపతికీ, మహా మంత్రికీ చెప్పాడు. వారు గబగబా వీధిలోకి వెళ్ళి, హతాశులయ్యారు.
‘ఈ బిడ్డ విషయం ప్రభువులు పసిగట్టారు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తారేమో?’ అని భయపడ్డారు. చేసేది లేక అతణ్ణి ఆహ్వానించి తీసుకుపోతూ- ‘‘భంతే! మమ్మల్ని క్షమించండి! మేం అశక్తులం!’’ అన్నారు.
‘‘మీరు భయపడకండి. నాకు భయం లేదు’’ అంటూ ముందుకు నడిచాడు భిక్షువు.
భిక్షువును చూడగానే సింహాసనం నుంచి అశోకుడు లేచి వచ్చి, వినమ్రంగా నమస్కరించి- ‘‘తమరు ఎవరు? ఇంత తేజస్సుతో ఉన్నారు!’’ అని అడిగాడు.
‘‘ఒకప్పుడు నేను అశోక మహారాజు అన్న సుమనుని పుత్రుణ్ణి. ప్రస్తుతం మొగ్గలిపుత్త తిస్స ప్రియ శిష్యుణ్ణి. నిగ్రోధ నామధేయ భిక్షువుని!’’ అన్నాడతను నిర్భయంగా.
అశోకుని గుండె ఝల్లుమంది. కాళ్ళ కింద నేల కంపించింది. తాను చంపిన తన అన్న కుమారుడే! ఆ ముఖంలో ఎంత శాంతం! ఎంత క్షమ! ఎంత నిర్భీతి!
అశోకుడి కళ్ళు వర్షించాయి. ఆ భిక్షువును ఉచితాసనం మీద కూర్చోబెట్టి, అతని పాదాలు కడిగాడు. శిరస్సు వంచి, నిగ్రోధుడి పాదాలను తాకాడు. ఉచిత రీతిన సత్కరించి పంపాడు.
మంత్రులు ఆశ్చర్యపోయారు. ‘‘మహారాజా! శత్రుశేషంగా భావించి ఆ భిక్షువును చంపుతారేమోనని భయపడ్డాం. మీరు అలా చేయలేదు. సంతోషం. కానీ, మీరు చక్రవర్తులు. మీ శిరస్సుకు అభిషేకం జరిగింది. దాన్ని వంచి, చిన్న పిల్లవాడి పాదాలకు తాకించడం తప్పు కాదా?’’ అని అడిగారు.
వెంటనే అశోకుడు సేవకులను పిలిచి, ఒక పళ్ళెంలో మేక తల, ఒక పళ్ళెంలో గుర్రం తల, ఒక పళ్ళెంలో గొర్రె తల పెట్టి ‘‘ఇవి అమ్ముకు రండి’’ అన్నాడు. వారు వీధిలోకి వెళ్ళి, త్వరగా అమ్ముకొని వచ్చారు. ఆ తరువాత ఒక శవం తల నరికించి, దాన్ని పళ్ళెంలో పెట్టి ‘‘ పోయి దీన్ని అమ్ముకురండి’’ అన్నాడు అశోకుడు. వారు సాయంత్రం దాకా తిరిగి తిరిగి వచ్చి ‘‘మహారాజా! ఏ ఒక్కరూ కొనలేదు’’ అన్నారు.
‘‘చూశారా మంత్రీ! ఈ తల స్థానంలో చక్రవర్తి అయిన నా తలను ఉంచితే అమ్ముకురాగలరా?’’ అని ప్రశ్నించాడు. వారు మౌనం దాల్చారు.
‘‘పశువుల తలలకు విలువ ఉంది. మనిషి తలకు విలువ లేదు. అలాంటి తలను ఒక మహనీయ భిక్షువు పాదాలకు మోడ్చి, నమస్కరిస్తే తప్పేమిటి?’’ అన్నాడు అశోకుడు.
మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, సభికులందరూ లేచి హర్షధ్వానాలు చేశారు.
- బొర్రా గోవర్ధన్