మంచి సంకల్పాలతోనే మనశ్శాంతి

ABN , First Publish Date - 2020-12-11T07:30:36+05:30 IST

మన చుట్టూ ఉన్న సమాజంలో నిరాశ, నిస్పృహతో ఉన్న వ్యక్తులు ఎందరో కనిపిస్తూ ఉంటారు. వారు చేసే పనుల్లో కూడా అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.

మంచి సంకల్పాలతోనే మనశ్శాంతి

మన చుట్టూ ఉన్న సమాజంలో నిరాశ, నిస్పృహతో ఉన్న వ్యక్తులు ఎందరో కనిపిస్తూ ఉంటారు. వారు చేసే పనుల్లో కూడా అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ‘నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నా’నని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా చెబుతూ వారు నిజంగానే డిప్రెషన్‌లో మునిగిపోతారు. దీనికి అసలైన కారణాలేమిటో, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో వారు ఆలోచించరు. 


మనిషి సంతోషంగా ఉండాలన్నా, కోరుకున్న భాగ్యాలు చేకూరాలన్నా సంకల్పం మంచిదై ఉండాలి. మాట మంచిగా ఉండాలి. దైవికమైన ఆకర్షణలకు అతీతంగా, ఎలాంటి వ్యామోహాలూ లేకుండా ఉంటే పరమాత్ముడికి ఇష్టులవుతారు. సర్వశక్తి సంపన్నులవుతారు. ప్రేమ, దయ, క్షమ లాంటి దైవీ లక్షణాలతో నిండుగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా నిమిత్తమాత్రులమనే భావనతో ఉండవచ్చు. సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులో ఉంటే ఎంతో మార్పు వస్తుంది.


మానవులందరికీ నిరాకారుడైన పరమాత్మే తండ్రి. ఆయనతో మనం తండ్రితో ఉండే అనుబంధం కలిగి ఉండాలి. ఉదయం ‘బాబా’ అంటూ ఆయనకు శుభోదయాన్ని (గుడ్‌మార్నింగ్‌) చెబుతూ లేవడం ఎంత బాగుంటుంది! అలాగే ‘నేను శాంతిని కోరుకొనే ఆత్మను’ అని భావించుకోవాలి. ‘నేను ఎవరి నుంచీ ఏదీ ఆశించను, నేను ఇచ్చేవాడినే తప్ప పుచ్చుకొనేవాడిని కాను’ అని మనకు మనం చెప్పుకోవాలి. శరీరానికి కాస్త అస్వస్థత ఉండొచ్చు. కానీ ‘నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను’ అని చెప్పుకోవడం వల్ల సానుకూలమైన ప్రతిస్పందనలు మనలో ఏర్పడతాయి. ఉత్సాహంగా పని చెయ్యగలుగుతాం. ‘నా కుటుంబంలో అందరం కలిసి మెలిసి ఉన్నాం. అందరూ అభిమానంగా, మంచి సంబంధాలతో ఉంటున్నాం, ఉంటాం’ అని ప్రతిఒక్కరూ అనుకుంటే కుటుంబ బాంధవ్యాల్లో కలహాలున్నా అవి సమసిపోతాయి. ‘ఉద్యోగమైనా, వ్యాపారమైనా నేను సేవగా భావించి చేస్తాను, దానివల్ల ఇతరులకు శాంతినీ, సుఖాన్నీ అందిస్తున్నాను’ అని అనుకుంటే ఒత్తిడులూ, డిప్రెషన్లూ ఉండవు.


ఇలాంటి సంకల్పాలు చేసుకొని, ఆ రోజును సామరస్యంగా, ప్రశాంతంగా ఎలా గడపాలనుకుంటున్నారో ఊహించుకోండి. ఆరోగ్యవంతమైన శరీరం, చక్కని కుటుంబం, ఇతరులకు మంచి చేసే పని, ఆహ్లాదకరమైన వాతావరణం... ఇవన్నీ ఊహించుకొని రోజును మొదలుపెడితే అంతా సవ్యంగా సాగుతుంది. పొగడ్తలూ, పేరు, గౌరవం, ఆడంబరాలూ... ఇవేవీ ఇవ్వలేని మనశ్శాంతి కలుగుతుంది.ఆత్మలో మూడు విభాగాలు ఉంటాయి. అవి మనసు, బుద్ధి, సంస్కారం. మనసు ఆలోచనలు చేస్తుంది. సంకల్పాలు చేస్తుంది, బుద్ధి దాన్ని దృశ్యరూపంలోకి మారుస్తుంది. అప్పుడే అనుభవం మొదలవుతుంది. ఆ అనుభవం ఆత్మలో నమోదు అవుతుంది. అలా నమోదు అయినదే మన కర్మలలో ప్రతిఫలిస్తుంది. కర్మల ద్వారా... అంటే మనం చేసే పనుల ద్వారా మనకు రాబోయే భాగ్యం ఏమిటన్నది నిర్ధారణ అవుతుంది. కాబట్టి మంచి సంకల్పాలు చేసుకోవాలి. వాటిని ఆచరించాలి.

బ్రహ్మకుమారీస్‌

Updated Date - 2020-12-11T07:30:36+05:30 IST