బంతిలా పైకి లేవాలి!

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

సుజనుడికీ, కుజనుడికీ, చురుకైన వాడికీ, మందకొడి వాడికీ తేడాను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం...

బంతిలా పైకి లేవాలి!

జీవితంలో ఈ వేళ యువతరం ఏ చిన్న దెబ్బతగిలినా తట్టుకోలేకపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఇక జీవితంలో నేను కోలుకోలేనేమో అనుకుంటున్నారు. అందుకే సుజనుడికీ, కుజనుడికీ, చురుకైన వాడికీ, మందకొడి వాడికీ తేడాను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం.


  • కందుకమువోలె సుజనుడు
  • క్రిందం బడి మగుడ మీదికి న్నెగయున్‌ జుమీ
  • మందుడు మృత్పిండమువలె
  • క్రిందం బడి యడగి యుండు గృపణత్వమునన్‌

‘కందుకము’ అంటే బంతి. బంతిని వేగంగా నేలకేసి కొడితే, వెంటనే అంతే వేగంతో పైకి వస్తుంది. ఎంత బలంగా కొడితే అంత బలంగా వస్తుంది. అదేవిధంగా జీవితంలో ఒక దెబ్బ తగిలి కిందకు వెళితే, మళ్లీ పైకి వస్తావా? రావా? యువతరం అలా బంతిలా ఉండాలి. అదే మందకొడి మనిషైతే మట్టి ముద్దలా, కిందపడి అణిగిపోయి అలాగే ఉండిపోతాడు. యువతరం మందకొడి మనిషిలా ఉండకూడదు. ఈ వేళ రాజకీయ రంగంలో, చలనచిత్రరంగంలో, వైద్యరంగంలో, క్రీడారంగంలో... ఇలా రకరకాల రంగాల్లో ఉన్న ప్రముఖుల జీవితం గురించి తెలుసుకుంటే ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంటాయి. వాళ్ళు అంత స్ఫూర్తిమంతంగా ఎందుకు ఉండగలిగారు అంటే తమ జీవితాన్ని బంతి అనుకున్నారు. శక్తియుక్తులను మట్టి ముద్ద అనుకోలేదు. మీరు కూడా అలా ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినా, సంసారంలో ఇబ్బంది వచ్చినా మట్టి ముద్ద అనుకోవద్దు. అటువంటి స్ఫూర్తిని ఈ పద్యం నుంచి పొందుదాం!

- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST