మనిషి.. మనసు

ABN , First Publish Date - 2020-07-15T09:00:51+05:30 IST

స్థూల శరీరం యొక్క సూక్ష్మాంశమే మనసు. మనసులో వచ్చే ఆలోచనలే మనల్ని నడిపిస్తున్నాయి. కనిపించని సూక్ష్మమే కనిపించే ఈ స్థూలాన్ని

మనిషి.. మనసు

స్థూల శరీరం యొక్క సూక్ష్మాంశమే మనసు. మనసులో వచ్చే ఆలోచనలే మనల్ని నడిపిస్తున్నాయి. కనిపించని సూక్ష్మమే కనిపించే ఈ స్థూలాన్ని నడిపిస్తోంది. స్థూల మెప్పుడూ కార్యమే. సూక్ష్మం కారణం. సూక్ష్మ శరీరంలో ఇంద్రియాలకంటే సూక్షమైనవి.. పంచతన్మాత్రలు. వాటికంటే సూక్ష్మమైనది మనసు. దానికంటే బుద్ధి ఇంకా సూక్ష్మం. పంచతన్మాత్రలు.. అనగా విషయాలైన శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు (వినికిడి, స్పర్శజ్ఞానం, రుచి, వాసన, చూపు) జ్ఞానేంద్రియాల ద్వారా మనసును చేరుతాయి. విషయాలు జ్ఞానేంద్రియానికి చేరినప్పుడు మనసు ఆ ఇంద్రియంపై లగ్నమై ఉంటేనే మనసుకు ఇంద్రియానుభవం కలుగుతుంది. చక్షురీంద్రియం పైన లేక మనసు ఎక్కడో ఉంటే కంటికి ఎదురుగా ఉన్న దృశ్యం కూడా కనిపించదు. మనసు చిత్రమైనది. ఒక చోట నిలవదు. పరుగులు పెడుతుంది. దూర తీరాలకు, తీరంలేని దూరానికి.. పరుగులన్నీ ఆలోచనలే. ఆలోచనలే మనసును పరుగులు పెట్టిస్తున్నాయా? మనసే ఆలోచనలై పరుగులు తీస్తుందా? అంటే..


సంకల్పనం మనోవిద్ధి సంకల్పస్తన్న విద్యతే

యత్ర సంకల్పనం తత్ర మనోస్తీత్యవగమ్యతామ్‌


‘ఆలోచనలే మనసు అని చెబుతారు. ఆలోచనల కంటే మనసు వేరుగా ఉండేది కాదు. ఆలోచనలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో అక్కడే మనసు కూడా ఉన్నదని తెలుసుకోవాలని దీని అర్థం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కానీ మనసులో వచ్చిన ఆలోచనలన్నీ మళ్లీ మనసుకు గుర్తుండవు. ముఖ్యమైనవి అనుకున్న ఆలోచనలు మాత్రమే జ్ఞాపకముంటాయి. ఆలోచనలు రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. వాటిని వెంబడించినా ఎక్కువవుతాయి. మనసుమీద ఏదైనా ప్రభావం పడితే అది శరీరం పైన కూడా పడుతుంది. శరీరం మీది ప్రభావం మనసు మీద పడుతుంది. ఉదాహరణకు ఏదైనా భయానకమైన దృశ్యాన్ని చూచినా, లేక ఊహించుకున్నా మనసు భయాందోళనలకు లోనై శరీరంలో వణుకు పుడుతుంది. ఎక్కడికీపరుగెత్తకపోయినా చెమటలు వస్తాయి. అదే విధంగా కాలుకు ముల్లు గుచ్చుకుంటే మనసు ఆందోళన చెందుతుంది. శరీరం అనారోగ్యానికి గురైతే మనసు కూడా అస్వస్థతకు లోనవుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసుకు బలం, ఆరోగ్యం ఏర్పడుతాయి. శరీరానికి వృద్ధి, క్షయాలున్నట్లుగానే మనసుకు కూడా వృద్ధి, క్షయాలుంటాయి. వృద్ధాప్యంలో శరీరంతో పాటు మనసు పటుత్వాన్ని కోల్పోతుంది.

ఆలోచనలకు, ఆచరణకు మూలం మనసు. చింతలకు, ఉద్వేగానికి మూలం మనసు. మనసు లేకుండా విచారణకు అవకాశం లేదు. మనసు లేకుండా మనిషి లేడు. స్థూల శరీరం యొక్క గుణాలు, శక్తులు అన్నీ మనసు నుంచేకలుగుతాయి. చింతల నుండి, ఉద్వేగాల నుండి మన మనసు కొంత ఉపశమనం పొందాలంటే అందుకు అవసరమైనది యోగాభ్యాసం.

- జక్కని వేంకటరాజం, 9440021734Updated Date - 2020-07-15T09:00:51+05:30 IST