సమష్టి చైతన్యమే మహాసరస్వతి
ABN , First Publish Date - 2020-10-21T08:48:08+05:30 IST
ఇది మహా సరస్వతి వర్ణన. సజ్జనత్వాన్ని పోషించడం దౌర్జన్యాన్ని శిక్షించడం లక్ష్యాలుగా అవతరించింది మహా సరస్వతి. చేతులు తామర తూడులవలె ఉన్నా..

ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్య ప్రభామ్
గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా
పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్ధినీమ్!
ఇది మహా సరస్వతి వర్ణన. సజ్జనత్వాన్ని పోషించడం దౌర్జన్యాన్ని శిక్షించడం లక్ష్యాలుగా అవతరించింది మహా సరస్వతి. చేతులు తామర తూడులవలె ఉన్నా.. ఘంట, శూలము, నాగలి, శంఖము, ముసలము, చక్రము, విల్లు, బాణములు వంటి కర్కశమైన ఆయుధాలు ధరించింది. శరత్కాల పౌర్ణమినాటి వెన్నెల వంటి శరీరకాంతితో, అపరాజితయైన గౌరీదేవి(ఆదిశక్తి) దేహము నుంచి ఉద్భవించినదియు, ముల్లోకములకు ఆధారభూతమయినదియు, శుంభ నిశుంభులను సంహరించినదియునైన మహా సరస్వతికి నమస్కారములు అని పై శ్లోకానికి అర్థం. ప్రకృతిలోని వివిధ వైరుధ్యాలు సమన్వయం చేసే శక్తిని మహాసరస్వతి అంటారు.
దేవీ నవరాత్రులలో మూలానక్షత్రం రోజున మహాసరస్వతీని అర్చించడం శాక్తేయ సంప్రదాయం. బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరాలను పొందిన శుంభనిశుంభులు ఇంద్రుడిని, దిక్పాలకులను పరాజితులను చేయడం, దేవతలు అమ్మవారిని శరణు వేడడం, ఆదిశక్తి మహాసరస్వతిగా అవతరించి ఆ రాక్షసులను వధించడం దేవీ సప్తశతి ఉత్తర చరిత్రలో కనిపిస్తుంది. శుంభనిశుంభులు రజస్తమోగుణాలకు, అహంకార మమకారాలకు ప్రతీకలు. అసురీభావాన్ని అణిచివేసే ప్రయోజనానికై సత్వగుణ ప్రధానంగా మహాసరస్వతి అవతరించింది.
అంతటా ఉన్నది ఒక్కటే. అదే అనేకంగా మారింది. ఏ ప్రయోజనాన్ని ఆశించి సాధకులు ధ్యానిస్తారో తదనుగుణమైన రూపంలో ఆదిశక్తి అవతరిస్తుంది. ఇక్కడ శుంభనిశుంభుల దౌర్జన్యాలను నిలువరించాల్సిందిగా దేవతలు ధ్యానించడం వల్ల అమ్మవారు మహాసరస్వతి రూపంలో దర్శనమిచ్చింది. ఇది దేవతల అందరి సమష్టి ఆశయం. అందుకే ఆమె సమష్టి దైవతత్వంగా చెప్పబడింది. ఈ సమష్టి తత్వాన్నే అపరాజితగా చెబుతారు. చంచలత, అభద్రతాభావన మనస్సు స్వభావం. వాటిని అహంకార మమకారాలు ఆక్రమించాయి. బుద్ధి ప్రబోధనతో చాంచల్యాన్ని, రాక్షసత్వాన్ని అధిగమించడం సాధనాలక్ష్యం. ఆ లక్ష్యం వైపు నడిపించేది మహాసరస్వతీ ఉపాసన. ఆత్మావలోకనం, చింతనాపరత, ధ్యానం వీటివల్ల అమ్మ సమగ్రతత్వాన్ని దర్శించడం సాధ్యపడుతుంది.
భద్రలోకం నుండి భవ్యలోకం వరకు సాగే సాధకుని ప్రస్థానంలో మహాసరస్వతి ఆరాధన మంగళప్రదమైన ఆలోచనలను జాగృతం చేసి, బుద్ధిని ప్రచోదన చేస్తుంది. మహాసరస్వతి కృపాకటాక్షాలు పొందిన వారు ఋషులు, బ్రహ్మజ్ఞానులు అవుతారు అంటుంది మేధాసూక్తం. సకల చైతన్య విద్యలను ప్రసాదించే మహాసరస్వతి అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ...
పాలకుర్తి రామమూర్తి
