బాధ్యత తప్పు కాదు!

ABN , First Publish Date - 2020-10-09T07:42:25+05:30 IST

బౌద్ధంలో ‘మహామంగళ సుత్తం’ అనే గ్రంథం ఉంది. మనం పాటించాల్సిన మంచి విషయాల గురించి అందులో ఉంటుంది. గురువుల్ని సేవించడం, పెద్దల పట్ల మర్యాదా, మన్ననా చూపడం, తల్లితండ్రుల్ని పూజించడం, భార్యాబిడ్డలకు సంబంధించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం, సహనం కలిగి ఉండడం...

బాధ్యత  తప్పు కాదు!

బౌద్ధంలో ‘మహామంగళ సుత్తం’ అనే గ్రంథం ఉంది. మనం పాటించాల్సిన మంచి విషయాల గురించి అందులో ఉంటుంది. గురువుల్ని సేవించడం, పెద్దల పట్ల మర్యాదా, మన్ననా చూపడం, తల్లితండ్రుల్ని పూజించడం, భార్యాబిడ్డలకు సంబంధించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం, సహనం కలిగి ఉండడం... ఇలాంటి ముప్ఫై ఎనిమిది మంగళకరమైన అంశాలు అందులో చోటు చేసుకున్నాయి. ఇవి అనాథపిండుకునికి బుద్ధుడు చెప్పిన విషయాలు. ఒక విధంగా ఇవి గృహస్థు ధర్మాలు. 


అయితే, భిక్షువులు పాటించాల్సిన నియమాలూ, ధర్మాలూ వేరు. వారికి రెండువందలకు పైగా నియమాలు ఉన్నాయి. భిక్షువులు కేవలం భిక్ష ద్వారానే జీవించాలి. వ్యాపారం, వ్యవసాయం చేసి ధనాన్ని దాచుకోవడం, విలువైన కానుకలు స్వీకరించడం భిక్షువులకు కూడదు. అలాగే సంసారపోషణ కూడా చేయకూడదు. నిరంతరం అధ్యయనం, ధ్యానం, ధర్మ ప్రచారంలోనే జీవించాలి.

ఒక రోజు ఒక భిక్షువును వెంటబెట్టుకొని మిగిలిన భిక్షువులందరూ బుద్ధుని దగ్గరకు వచ్చారు. ‘‘భగవాన్‌! చూశారా? ఈ భిక్షువు ఏం చేశాడో! ఇతగాడు ప్రతిరోజూ తన ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. ఇంట్లో వారి పోషణ చూసుకుంటున్నాడు’’ అని ఆయనతో చెప్పారు.

‘‘ఎలా?’’ అని అడిగాడు బుద్దుడు.

‘‘తనకు లభించిన భిక్షను తీసుకుపోయి ఇంట్లో వారికి ఇస్తున్నాడు. ఈ నేరానికి తగిన శిక్ష విధించాలి’’ అన్నారు భిక్షువులు.

బౌద్ధంలో శిక్షలు అంటే దండనలు కాదు. ఇంకా తగినంత శిక్షణ ఇవ్వడమే! అతగాణ్ణి తిరిగి విద్యార్థిగా (శ్రామణేరునిగా) పంపడమే!

బుద్ధుడు ఆ భిక్షువు వైపు చూసి ‘‘భిక్షూ! ఇది నిజమేనా? నీ మీద వచ్చిన నింద నిజమేనా?’’ అని అడిగాడు.

‘‘భగవాన్‌! నిజమే’’ అన్నాడతను.

‘‘ఎందుకిలా చేశావు? అలా చేయకూడదని తెలియదా?’’

‘‘తెలుసు భగవాన్‌!’’

‘‘మరెందుకు చేశావు?’’

‘‘తప్పదు భగవాన్‌!’’

‘‘నీ కుటుంబ పోషణ చేసుకోవలసి వస్తే ఇలా భిక్షువు కాకుండా గృహస్థుగానే ఉండవచ్చు! ఇందులో నిర్బంధమేదీ లేదు కదా! గృహస్థుగానే ఉంటూ ధర్మాన్ని ఆశ్రయించి, ఆచరించవచ్చు కదా!’’ అన్నాడు బుద్ధుడు.

ఆ భిక్షువు మౌనంగా నిలబడిపోయాడు.

‘‘భిక్షూ! భిక్షతో నీవు ఎవరిని పోషిస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు. 

‘‘భగవాన్‌! నా తల్లితండ్రులకు మేము ముగ్గురం సంతానం. నా తల్లితండ్రులు ఇప్పుడు శక్తిహీనులయ్యారు. పనీ పాటూ చేసుకోలేరు. మంచాన పడ్డారు. నా అన్నలు వారిని పట్టించుకోరు. నేను భిక్షువునయ్యాను. నేను పెట్టకపోతే వారికి తిండి లేదు. నేను నా భిక్షతో నా వృద్ధ తల్లితండ్రుల్ని పోషించుకుంటున్నాను’’ అన్నాడు. 

బుద్ధుడు గంభీరంగా ఆ భిక్షువు వైవు చూశాడు. దయాపూరితమైన చూపులు ప్రసరించాడు. ‘‘భిక్షూ! నీవు చేసింది తప్పు కాదు. ఇక నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు’’ అని చెపాఁడు.

అతనిపై ఫిర్యాదు చేసిన వారిని ఉద్దేశిస్తూ ‘‘భిక్షువులారా! మనం అందరికన్నా ముందు గౌరవించాల్సిందీ, పూజించాల్సిందీ తల్లితండ్రుల్నే! వారిని పోషించడం, వారికి సేవ చేయడం నేరం కాదు. గౌరవం కూడా! నేను ఈ భిక్షువును అభినందిస్తున్నాను’’ అన్నాడు.

బౌద్ధం సామాజిక బాధ్యతలను బరువుగా భావించాలని చెప్పే ధర్మం కాదు. వాటికి దూరంగా ఉండాలని చెప్పే ప్రబోధం కాదు. సరైన బాధ్యతలనూ, సామాజిక కర్మలనూ విస్మరించవద్దని చెప్పే సామాజిక శాస్త్రం.

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-10-09T07:42:25+05:30 IST