అదృష్టమా? పురుషప్రయత్నమా?
ABN , First Publish Date - 2020-04-12T06:49:06+05:30 IST
అదృష్టమా? పురుష (మానవ) ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది గొప్పది? మత్స్యావతారం దాల్చిన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు! దైవం/అదృష్టం కన్నా పురుషప్రయత్నమే గొప్పదని...

అదృష్టమా? పురుష (మానవ) ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది గొప్పది? మత్స్యావతారం దాల్చిన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు! దైవం/అదృష్టం కన్నా పురుషప్రయత్నమే గొప్పదని తేల్చిచెప్పాడు!! మత్స్యపురాణంలో విష్ణుమూర్తి చెప్పినదాని ప్రకారం.. తొలి జన్మలలో మనిషి చేసుకున్న కర్మలకే దైవమని పేరు. మంచివారు, సాత్వికులు, ఇతరులకు కష్టం కలగకూడదనే బుద్ధితో పనులు చేసేవారు, ఇతరులకు ఉపకారం చేసేవారు చేసే కర్మ సాత్వికమై ఫలిస్తుంది. ఆ కర్మఫలితాలు సాత్విక దైవాలు. చెడ్డ పనులు చేసేవారి కర్మలు ప్రతికూల దైవాలవుతాయి. అలాంటివారు కూడా మంచి పనులు చేయడం మొదలుపెడితే (పురుషప్రయత్నంతో) ప్రతికూల దైవాలను కొట్టివేయవచ్చని సాక్షాత్తూ ఆ పరమాత్మే చెప్పాడు. పౌరుషం లేనివారే కేవలం దేవుడి మీద భారం వేసి, దేవుడే దిక్కు అనుకుంటూ ఉంటారని.. కానీ, సర్వకాల సర్వావస్థల్లోనూ తమ శక్తియుక్తులన్నీ పెట్టి ప్రయత్నం చేసేవారికే దైవం అనుకూలిస్తాడని మత్స్యమూర్తి ఉవాచ. దైవం, పురుష ప్రయత్నం, కాలం.. ఈ మూడూ కలిసి మనిషికి కర్మఫలానుభవం ఇస్తాయని పరమాత్మ తెలిపాడు. ఉదాహరణకు.. కృషికి (వ్యవసాయం చేయడం- అంటే పురుష ప్రయత్నం) వర్షం (దైవం) తోడైతే పంట పండుతుంది. కర్మ అనుకూల దైవమైతే వర్షం సకాలంలో కురుస్తుంది. చేసిన కర్మ ప్రతికూల దైవమైతే అకాలంలో కురిసి ప్రతికూల ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఈ భూమ్మీద సకల వృత్తులు, ప్రవృత్తులూ దైవ, మానుషాధీనాలై ఉన్నాయి. పురుష ప్రయత్నం పైకి కనిపిస్తుంది. దైవానుగ్రహం అంతర్గతమై ఉంటుంది.
- దైవం సంప్రేరయతి మామితి దగ్ధధియాం ముఖమ్
- అదృష్ట శ్రేష్ఠ దృష్టీనాం దృష్ట్వా లక్ష్మీర్నివర్తతే
అదృష్టం వల్లనే నేనీ పనులన్నీ చేయగలుగుతున్నానని భావించేవారి ముఖం చూడ్డానికి కూడా లక్ష్మీ దేవి ఇష్టపడదని వశిష్ఠ గీత చెబుతోంది.
- శుభేన పురుషార్థేన శుభమాసాద్యతే ఫలం
- అశుభేనాశుభం రామ యథేచ్ఛసి తథాకురు
‘‘ఓ రామా.. మంచి (శుభ) పురుషప్రయత్నం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అశుభప్రయత్నం వల్ల అమంగళమే లభిస్తుంది. నీవు దేన్ని కోరుకుంటావో అదే చెయ్యి’’ అని వశిష్ఠుడు రాముడికి ఉపదేశించాడు. అంతేకాదు..
- జగతి పురషకార కారణే స్మి్
- కురు రఘునాథ చిరం తథా ప్రయత్నమ్
‘‘రఘునాథా.. ఈ ప్రపంచంలో అభీష్ఠసిద్ధికి పురుషప్రయత్నమే కారణం’’ అని తేల్చిచెప్పాడు. అసలు పురుష ప్రయత్నం ఎంత గొప్పదో చెప్పేందుకే ఆ పరమాత్మ రామావతారం దాల్చాడు. సాక్షాత్తూ భగవంతుని అవతారమే అయినా సామాన్య మానువునిలా జీవించాడు. ఎన్నికష్టాలెదురైనా వాటిని పురుషప్రయత్నంతో అధిగమించవచ్చని నిరూపించాడు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు సైతం తన పురుష ప్రయత్నం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు తప్ప అదృష్టంతో కాదు. ఆ మహాపురుషులే మనందరికీ ఆదర్శం.
- కొత్తపల్లి యజ్ఞ దత్త ఆదినారాయణ అవధాని, 9030222444