అభయప్రదాత.. శ్రీరామచంద్రుడు
ABN , First Publish Date - 2020-04-01T08:51:40+05:30 IST
సాధుసజ్జనులను పరిరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్వీకరించిన అవతారాల్లో ముఖ్యమైనది రామావతారం. ఒక మనిషిలో ఎన్నెన్ని మంచి గుణాలు ఉండడానికి అవకాశం ఉందో రామావతారం ద్వారా...

సాధుసజ్జనులను పరిరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్వీకరించిన అవతారాల్లో ముఖ్యమైనది రామావతారం. ఒక మనిషిలో ఎన్నెన్ని మంచి గుణాలు ఉండడానికి అవకాశం ఉందో రామావతారం ద్వారా శ్రీరామచంద్రుడు మనకు తెలియపరిచాడు. మనిషి తన ప్రవర్తన ద్వారా తోటి మానవుల, సకల జీవరాశుల, సమస్త దేవతల ఆదరాభిమానాలను ఎలా పొందవచ్చో ఆచరించి చూపించాడు. తనను ఆశ్రయించినవారికి, శరణువేడినవారికి అభయప్రదానం చేసి వారిని ఆపదల నుంచి గట్టెక్కించడంలో శ్రీరామునికి సాటియైున వేరొక దైవం లేదు. రామాయణంలోని యుద్ధకాండలో విభీషణుడికి అభయప్రదానం చేసే సందర్భంలో తన స్వభావాన్ని, ఆశ్రితులను రక్షించే తన అసాధారణ లక్షణాన్ని శ్రీరామచంద్రుడు ఇలా చెప్పాడు.
సకృదేవప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ
‘‘ఎవరైనా నా వద్దకు వచ్చి ‘నన్ను రక్షించు, నేను నీవాడను’ అని ఒక్కసారి పేర్కొన్నంత మాత్రముననే నేను వారికుండే భయాలను, తాపత్రయాన్ని (ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికములనే మూడు విధాలైన తాపాలను), ఆపదలను, పాపాలను పోగొట్టి వారికి అవసరమైన సంపదలను, యోగక్షేమాలను శ్రేయస్సును అందిస్తూ రక్షిస్తాను. ఇది నా దీక్ష’’ అని రామచంద్రుడు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు. ‘శ్రీరామచంద్రా.. నీ భార్యను అపహరించిన రావణుని తమ్ముడికి అభయం ఇవ్వవద్దు’ అని సుగ్రీవుడు మొదలైనవారు చెప్పినా, ‘నేను నా ధర్మాచరణను, స్వజనుల రక్షణను ఎప్పటికీ వదలను’ అని రాముడు స్థిరంగా చెప్పాడు.
ఆశ్రమవాసులైన మహర్షులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి.. రాక్షసుల వల్ల తమకు కలుగుతున్న బాధలను వివరించి, రక్షించాలని వేడుకున్నారు. అప్పుడు సీతాదేవి రాముడితో.. ‘రాక్షసులు మనకు ప్రత్యక్షంగా ఎటువంటి హానీ తలపెట్టలేదు కదా. అట్టి రాక్షసులతో యుద్ధం చేయడం తగదు’ అని సూచించింది. అందుకు రాముడు అంగీకరించలేదు.
అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే!
సలక్ష్మణామ్ న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య
..‘ధర్మ పరిరక్షకుడనైన నేను రుషులకు అభయప్రదానం చేశాను. ప్రాణాలనైనా వదులుకుంటాను. నా ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన నిన్ను.. నా బహిఃప్రాణమైన, నాకు కుడిభుజమైన లక్ష్మణుని అయినా వదులుకుంటానుగానీ.. ఇచ్చినమాట తప్పను’ అని వివరించాడు. ఇలా ఎందరికో అభయమిచ్చి ఆర్తత్రాణ పరాయణుడు, ఆపదోద్ధారకుడు, ఆపద్బాంధవుడు, అభయప్రదాత, సత్యవాక్య పరిపాలకుడు, ప్రతిజ్ఞాపాలకుడిగా ఎన్నో బిరుదాలను సొంతం చేసుకున్నాడు. పురుషోత్తముడైన ఆ శ్రీరాముని సద్గుణాలు మనందరికీ అవశ్యం ఆదర్శనీయం. పాటించినవారి జన్మ చరితార్థం.
- సముద్రాల శఠగోపాచార్యులు, 98483 73067