అదే నిజమైన సంతోషం!

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

‘సంతోషం సగం బలం’ అనే మాట మనందరం వింటూనే ఉంటాం. సంతోషంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. సంతోషాన్ని జనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు. పార్కులకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, పిక్నిక్‌లకు వెళ్తారు...

అదే నిజమైన సంతోషం!

‘సంతోషం సగం బలం’ అనే మాట మనందరం వింటూనే ఉంటాం. సంతోషంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. సంతోషాన్ని జనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు. పార్కులకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, పిక్నిక్‌లకు వెళ్తారు. ఇదంతా సంతోషంగా ఉండాలనే కదా! అలాగే ఆరు రోజులు కష్టపడ్డాక ఆదివారం రాగానే సంతోషంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పని చేశాక, కొన్ని రోజులు సెలవు తీసుకొని ఇష్టమైన ప్రదేశాలకు విహార యాత్రల కోసం వెళ్తారు. ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. అంటే, సంతోషించే గుణం మన మనసుల్లోనే ఉంది. 


నిజమైన సంతోషం... ఏది జ్ఞానమో దాన్ని తెలుసుకోవడం వల్లా, దాన్ని గురించి ఆలోచించి, ఆచరించడం వల్లా లభిస్తుంది. అలాగే సంతృప్తితో సంతోషం లభిస్తుంది. మనకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు. వాటిని గుర్తు చేసుకుంటే సంతోషంగా ఉంటాం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే! సూర్యుడి కిరణాలు తెల్లగా కనిపిస్తాయి. కానీ వాటిలో సప్త వర్ణాలూ ఇమిడి ఉంటాయి. ఒక్కోసారి వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఏడు రంగుల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. దాన్ని చూసి ఆనందం కలుగుతుంది. మనసు పులకిస్తుంది. అలాగే మనిషి ఆత్మలో కూడా సప్త గుణాలు కనిపించకుండా ఉన్నాయి. అవి: జ్ఞానం, ఆనందం, పవిత్రత, ప్రేమ, సుఖం, శాంతి, శక్తి. వాటిలో ఒకటి ఆనందం... అంటే సంతోషం. 


ప్రస్తుత కాలంలో అనేక సమస్యలు, వివిధ పరిస్థితులు, కష్టాలు, బాధ్యతలు, వ్యాధుల కారణంగా ఆత్మలో దాగి ఉన్న ఈ సహజమైన గుణాలను మానవులు మరచిపోయారు. ఆధ్యాత్మికమైన వాతావరణంలోకీ, మంచి సాంగత్యంలోకీ వెళ్ళినప్పుడు... ఆ కొద్ది సమయం పాటు ఈ దుఃఖాలన్నీ మరచిపోతారు. అప్పుడు ఆత్మలోని సహజ గుణాలైన శాంతి, శక్తి, ఆనందం తదితరాలను అనుభూతి చెందుతారు. పంచ వికారాలనే మాయ మనిషిని ఈ విధంగా అనేక సంకెళ్ళతో బంధించింది. ఇదంతా ‘స్వాభావికం’ అని మనిషి అనుకుంటున్నాడు. ఆ బంధనాలన్నిటి నుంచీ భగవంతుడి శక్తి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. దానికోసం భగవంతుడి ప్రేమలో మనం బందీలు కావాలి.

భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న మానవుడు చంద్రమండలంలో కాలుమోపాడు. అంతరిక్షంలో ఎన్నో గ్రహాలను కనుక్కుంటున్నాడు. కానీ ఆత్మ రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు. ఆత్మ, పరమాత్మ స్వరూపాలను సైన్స్‌ తెలుసుకోలేకపోతోంది. ఆ నిశ్శబ్ద శక్తిని... అంటే భగవంతుడి శక్తిని సైన్స్‌ ఒప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరుగుతుంది. అప్పుడు మన భూమి స్వర్గంగా మారుతుంది. మనిషిలో ఈ వికారాలు ఉండవు. వారు దైవ సమానులవుతారు. కష్టాలూ, వ్యాధులూ, బాధలూ ఉండవు. అప్పుడు... ఇంద్రధనస్సు ఎలాగైతే మెరుస్తుందో మనిషి ఆత్మ సప్త గుణాలతో ప్రకాశిస్తాడు. అదే నిజమైన ‘సంతోషం’.

- బ్రహ్మకుమారీస్‌


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST