భిన్నత్వంతో మమేకం కావాలి!

ABN , First Publish Date - 2020-03-13T06:26:31+05:30 IST

ఇంద్రియాలకు చేతనాశక్తిని... అంటే ఎరుకను కలిగించేది ప్రజ్ఞానం. ఇది సర్వప్రాణికోటిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే..

భిన్నత్వంతో మమేకం కావాలి!

ఇంద్రియాలకు చేతనాశక్తిని... అంటే ఎరుకను కలిగించేది ప్రజ్ఞానం. ఇది సర్వప్రాణికోటిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే ‘ఈ చేతన నేనే!’ అని మానవుడికి తెలుస్తుందో అప్పుడు ‘నేను వేరు, ఈ ప్రపంచం వేరు’ అనే భావన తొలగిపోతుంది. అప్పుడు బ్రహ్మకూ- ప్రపంచానికీ, ప్రపంచానికీ -వ్యక్తికీ ఉన్న తేడా సమసిపోతుంది.


నాగరికత తెలియని ఆదిమ మానవుడి కన్నా మనం చాలా తెలివైన వాళ్ళం అని సంబరపడిపోయేవారు మనలో కొందరు ఉంటారు. అది నిజమే. కానీ మన తరువాత, భవిష్యత్తులో వచ్చే నవ నాగరిక, వైజ్ఞానిక మానవుడు మనల్ని గుర్తు చేసుకొని ఏమనుకుంటాడో అని ఆలోచించం. ఆనాటి అడవి మనిషి అజ్ఞాని. కానీ ఈనాటి పట్టణాలలో, మహా నగరాలలో ఉన్న మనిషి జ్ఞాని, విజ్ఞాని. అయినప్పటికీ, అన్ని నాగరికతలకూ గీటురాయిగా ఉండాల్సిన ‘మానవత’ అనే ప్రమాణంలో మాత్రం అడవి మనిషికన్నా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. తోటి మానవుణ్ణి నానా విధాలా హింసిస్తున్నాడు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు.


ఆటవిక మానవుడు మనకన్నా అజ్ఞాని కావచ్చు, కానీ మనంతటి అపాయకారి కాదనేది చేదు నిజం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల చూసినా తోటి మనిషిని హింసించడం, భాషా వైషమ్యాలు, ప్రాంతీయ దురభిమానాలు, మత దురహంకారాలు, పెత్తనం కోసం వెంపర్లాటలు, అధికారం కోసం అర్రులు చాచడాలు... ఇవన్నీ మనలోని ఆటవికతకు అద్దం పడుతున్నాయి.


దీనికంతటికీ కారణం వేరు భావన. తాను వేరు, తోటివాడు వేరు, సమాజం వేరు అనుకోవడమే అనర్థమని మన ఋషులు ఏనాడో చెప్పారు. శ్రీ అరవిందుని మాటా అదే! ‘ప్రజ్ఞానాం బ్రహ్మ’ అన్నాడు ఐతరీయోపనిషత్‌  ద్రష్ట. అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ ప్రజ్ఞానాన్నే ‘ఎరుక’, ‘చేతన’ అని పిలుస్తున్నాం. నీవు వేరు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం వేరు కాదు. అది తెలుసుకోవాలి. అంతవరకూ  శాంతి లేదు. మన జ్ఞానం పరిపూర్ణం కాదు. పాక్షికం మాత్రమే. అర్ధ జ్ఞానం, అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ అపాయకరమే!


వ్యక్తి, విశ్వం, విశ్వాతీత బ్రహ్మం... ఇవన్నీ ఒకే చేతనలోని వివిధ అంతస్థులు, వివిధ రూపాలు, వివిధ ప్రకటనలు. ‘చేతన’ అంటే ప్రజ్ఞ. ఆటవిక మానవుడి నుంచి ఈ ప్రజ్ఞ బాహ్యంలో వికసించినంతగా అంతరంగంలో వికసించలేదు. ఈ వికాసంలో సమతుల్యత దెబ్బతినడం వల్ల, ప్రకృతి శక్తులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఈ వాతావరణ కాలుష్యాలు తలెత్తాయి.  వీటన్నిటినుంచీ బయటపడాలంటే తనలోని ప్రజ్ఞతో మానవుడు అనుసంధానం కావాలి. అప్పుడు అతని చేతన సకల సృష్టితోనూ అనుసంధానమై అల్లుకుపోతుంది. అతనికి భిన్నత్వంలోని ఏకత్వంతో తాదాత్మ్యత కలుగుతుంది.

- కె. సంపూర్ణ

Updated Date - 2020-03-13T06:26:31+05:30 IST