పిలిస్తే పలుకుతాడు!
ABN , First Publish Date - 2020-03-13T06:11:22+05:30 IST
ఆపన్నులను కాపాడేది ఆ దైవమే! ఎవరికి ఏ ఆపద వచ్చినా, సమస్యలు ఏర్పడినా ఆయనకు మొర పెట్టుకుంటే...

ఆపన్నులను కాపాడేది ఆ దైవమే! ఎవరికి ఏ ఆపద వచ్చినా, సమస్యలు ఏర్పడినా ఆయనకు మొర పెట్టుకుంటే తప్పక ఆలకిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఈ విషయాన్ని అల్లాహ్ స్వయంగా తెలిపాడు.
‘‘ఓ ప్రవక్తా! నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని చెప్పు. నా దాసుడు నన్ను ఎప్పుడు పిలిచినా అతని పిలుపును నేను ఆలకిస్తాననీ, ఆమోదిస్తాననీ వారికి చెప్పు. కాబట్టి వారు నా ఆదేశాన్ని శిరసావహించాలి. నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఈ విషయం వారికి నీవు తెలియజెయ్యి.’’ (దివ్య ఖుర్‌ఆన్- అల్ బఖర 2:186)
అలాగే ‘‘నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వం, అహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించడం తధ్యం’’ అని కూడా అల్లాహ్ ప్రకటించాడు. (దివ్య ఖుర్‌ఆన్- అల్ మూమిన్ 40:60)
‘‘కలత చెందిన వ్యక్తి మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేది ఎవరు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేది ఎవరు?’’ అని ప్రశ్నిస్తూ అది అల్లాహ్ మాత్రమేనని దివ్య ఖుర్‌ఆన్ స్పష్టం చేస్తోంది. ఆయనను సంపూర్ణంగా విశ్వసించని వారి ఆరాధన తిరస్కారానికి గురి అవుతుందని హెచ్చరిస్తోంది.
‘‘అల్లాహ్ సిగ్గరి. గొప్ప దాత. ఏ దైసుడైనా అల్లాహ్ సన్నిధిలో చేతులు జోడించి, ఏదైనా కావాలని అర్థిస్తే, అతణ్ణి ఉత్త చేతులతో పంపడానికి అల్లాహ్ సిగ్గు పడతాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు. కావలసిందల్లా ఆయన పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలే!
- మహమ్మద్ వహీదుద్దీన్