అడగకుండా ఇవ్వడమే కరుణ..అదే అమ్మ

ABN , First Publish Date - 2020-04-05T07:30:08+05:30 IST

అవతరణ అంటే దిగిరావడం, అభివ్యక్తం కావడం! ధర్మగ్లాని జరిగినప్పుడల్లా తనను తాను సృష్టించుకుని, ఆ తరాన్ని ఉద్ధరించి, తదనంతర తరాలను నడిపించడం అవతారమూర్తుల లక్ష్యం. కాల, కార్య, కారణ, కర్తవ్యాలకు లోబడే...

అడగకుండా ఇవ్వడమే కరుణ..అదే అమ్మ

అవతరణ అంటే దిగిరావడం, అభివ్యక్తం కావడం! ధర్మగ్లాని జరిగినప్పుడల్లా తనను తాను సృష్టించుకుని, ఆ తరాన్ని ఉద్ధరించి, తదనంతర తరాలను నడిపించడం అవతారమూర్తుల లక్ష్యం. కాల, కార్య, కారణ, కర్తవ్యాలకు లోబడే.. వారి సంచారం సాగుతుంటుంది. అవతారాలన్నీ ప్రభవాలే! అంశావతారాలుగా, కళావతారాలుగా, అర్చావతరాలుగా, ప్రవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, మరెన్నో రీతులుగా అవతారాలు రావటం కొత్తకాదు. ఇన్నిటికీ, ఏదో ఒక కారణం తప్పనిసరి. వీటన్నిటికీ భిన్నంగా అమ్మ రాక, ఒక ఆశ్చర్యం. ఆలోచనామృతం. సర్వ సృష్టికి, నానా దేవీదేవతా స్వరూపాలకు మూలమైన పరమేశ్వరి మానవిగా రావాలని సంకల్పించుకుంటే, అదే అమ్మ! అమ్మ సంచారాన్ని గమనించుకుని, అనుభవ రససిద్ధం చేసుకోగలిగితే, ఆమె ఆగమనం వెనుక దొరికే కారణం, సనాతన ధర్మమూలమే.


కర్మలను అనుభవించడం కోసం కాక, కష్టాలను విని, వాటిని అధిగమించే దారి చూపడమే జగజ్జనని తత్వంగా అర్థం చేసుకోవాలి. ఇది తల్లి లక్షణం. బిడ్డ రక్షణే ఆమెకుండే ఆతృత. కనబరచే తాపత్రయమంతా, తన కోసం కాక బిడ్డ సుఖశాంతుల గురించే! 


ఎందరో మహాయోగుల కామన అంతా ప్రపంచ సుఖంగా ఉండాలనే. అలా సుఖంగా ఉంచగలిగిన శక్తి జగజ్జననికే ఉంటుంది కనుక, వారందరి ప్రార్థనల ఫలంగా ఈశ్వరి ఈ జగత్తులో ప్రవేశించి, సుఖదాయిగా, ఆనందదాయిగా, సర్వదాయిగా ఉంటుంది. జీవుణ్ని తడిమి, ఒడి చేర్చుకుని, లాలన, పాలన సాగించి జీవుడి దుఃఖాన్ని, భయాన్ని, బాధను తొలగించి, ఆత్మోన్ముఖుణ్ణి చేయడం తల్లి కర్తవ్యం. జీవుడి యందున్న దానవత్వ, దీనత్వ, మానవత్వ, మాధవత్వ స్థితులను.. జీవుడికి తన దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగ్రహ, వాత్సల్య, ప్రేమల ద్వారా స్ఫురణకు తెచ్చి, రాక్షస భావాలను నశింపచేసి, మానవ మాధవీయంగా తీర్చిదిద్దటం మాతృలక్ష్యం. పరమ చరమంగా తనయందు లయం చేసుకోవటం, అసలు పరమార్థం. 


జీవుడు తనయందున్న పశులక్షణం చేత బాధను అనుభవిస్తాడు. పశువుకు బాధే ఉంటుంది. దుఖం తెలియదు. మానవుడే రెండిటినీ అనుభవిస్తాడు. మాతృభావన ఈ రెండింటినీ శమింపజేయగలదు. కనుక అమ్మ తన దగ్గరకు వచ్చిన వారికి బాధను, దుఖాన్ని తగ్గించి ధైర్యాన్నిచ్చింది. మార్గం చూపించడం, లక్ష్యం బోధించడం, గమ్యం చేర్చడం అవతార ప్రణాళికలో భాగం. తన నడకే మార్గమైనప్పుడు, ఆ మార్గం జీవకోటిని సముద్ధరించే బాధ్యతైనప్పుడు, అమ్మ నడిచిన బాటలో అడుగువేయడమే సాధన! మంత్రబలంతో తంత్రయంత్రాత్మక విధానంతో ఫలితాన్ని పొందడం అనుభవంలో ఉన్నదే. అయితే అమ్మ వీటన్నిటికీ అతీతంగా, ఉపాసనా ఫలాన్ని సూటిగా అందించి తల్లి తత్వాన్ని ప్రకటించింది. ఉపవాసం, ఉపాసన వంటివి ఏ ఫలితాన్ని కలిగిస్తాయో ఆ ఫలితాన్ని నిర్వ్యాజంగా జీవకోటికి వరదానం చేసింది. అడిగి పొందేవన్నీ వరాలే. అడగకుండా పొందేదే కరుణ. వరాలన్నీ కోరికల చుట్టూ తిరిగేవి. కరుణ, ఒక అంతర్వాహిని. ‘‘అమ్మా! ఇంకొంత కాలం మీరుంటే బాగుంటుంది’’ అని సద్గురు శివానందమూర్తిగారు కోరినపుడు, ‘‘రావటం, ఉండటం, పోవటం, ఈ దేహానికేగాని, నాకేముంది? ఇవేమీ లేని ‘నేను’ ఎప్పుడూ ఉంటుంది’’ అన్నది అమ్మ సమాధానం. మాతృపార్శ్వాన్ని ప్రపంచానికి రుచి చూపిన మమతామూర్తి అమ్మ!

- వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-04-05T07:30:08+05:30 IST