అధర్మమే కలి స్థానం

ABN , First Publish Date - 2020-06-22T09:40:39+05:30 IST

తనను వేడుకున్న కలిపురుషుని కరుణించి.. అతను ఉండదగ్గ స్థానాలను నిర్దేశిస్తూ పరీక్షిన్మహారాజు చెప్పిన మాటలు ఇవి. వ్యాసభగవానుడు లోకానికి అనుగ్రహించిన శ్రీ మద్భాగవతం

అధర్మమే కలి స్థానం

అభ్యర్థి స్తదా తస్మై స్థానాని కలయే దదౌః

ద్యూతం పానం స్త్రియఃసూనా యత్రా ధర్మశ్చతుర్విధః


తనను వేడుకున్న కలిపురుషుని కరుణించి.. అతను ఉండదగ్గ స్థానాలను నిర్దేశిస్తూ పరీక్షిన్మహారాజు చెప్పిన మాటలు ఇవి.  వ్యాసభగవానుడు లోకానికి అనుగ్రహించిన శ్రీ మద్భాగవతం ప్రథమస్కంధంలోనే కలియుగ లక్షణాలను స్పష్టంగా చెప్పాడు. అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు ఒకరోజు తన ఆయుధాలు ధరించి దిగ్విజయ యాత్రకు బయల్దేరాడు. దారిలో ఆయనకు ఒక హృదయ విదారకమైన దృశ్యం కనపడింది. రాజోచిత వేషధారణలో ఉన్న ఒక బలమైన వ్యక్తి ఆవును, ఎద్దును తీవ్రంగా హింసిస్తున్న దృశ్యమది. ఆవు భూమాతకు ప్రతిరూపమైతే.. ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ఆ కొడుతున్న వ్యక్తి కలిపురుషునిగా గుర్తించిన పరీక్షిన్మహారాజు.. అతణ్ని శిక్షించేందుకు ముందుకు దూకాడు. 


శ్రీకృష్ణ పరమాత్ముని నిర్యాణానంతరం ద్వాపరం ముగిసి కలియుగం మొదలైంది. దీంతో కలి విజృంభణ ప్రారంభమైంది. కలియుగంలో దౌర్జన్యం, అధర్మం, అన్యాయం పెచ్చరిల్లిపోతాయన్నదానికి సంకేతమే కలి పురుషుడు ఆ రెండు ప్రాణులనూ హింసిస్తున్న దృశ్యానికి అర్థం. మనం నివసిస్తున్న భూమి, ప్రజలు పాటించాల్సిన ధర్మం రెండూ కలియుగంలో కష్టాలపాలు అవుతాయనే సూచన అది. పాండవ వంశ వారసుడైన పరీక్షిత్తుకు ఆ సంగతి ముందే తెలుసు. అందుకే కలిపురుషుని సంహరించడానికి ఆయుధం ఎత్తుతాడు. దీంతో బెదిరిపోయిన కలి పురుషుడు.. తానెక్కడుండాలో చెప్పాల్సిందిగా ఆయన్నే వేడుకుంటాడు. అప్పుడు పరీక్షిత్తు.. జూదం, (మద్య)పానం, ప్రాణుల వధ జరిగే స్థలం, వేశ్యాగృహం అనే నాలుగు చోట్లలో ఉండాలని కలి పురుషుడికి సూచిస్తాడు. అయినా తృప్తిచెందని కలిపురుషుడు.. మరో స్థానం కావాలని కోరుతాడు. అతని వేడుకోలును మన్నించిన రాజు.. బంగారాన్ని కూడా కలిస్థానంగా నిర్ధారించాడు. 


జూదం సర్వనాశనానికి కారణం. తాగుడుకు బానిస కావడం వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా ప్రమాదమే. ప్రాణులను హింసించి వధించడమనే పని దయాహీనతకు సంకేతం. స్త్రీ వ్యామోహం అధర్మ కామ ప్రవృత్తి. అవసరానికి మంచి బంగారంపై, ధనంపై వ్యామోహం వినాశహేతువు. అందుకే ఆ స్థానాలు కలి స్థానాలుగా నిర్దేశించబడ్డాయి. మానవ జీవితాన్ని దారి తప్పించి, ప్రలోభాలకు లోను చేసే ఈ దుర్గుణాలే కలి లక్షణాలు. భగవంతుని ఉనికి ఉన్న స్థలాల్లో ఈ లక్షణాలు కనిపించవు. తపస్సు, శుచి వంటి సలక్షణాలు ఈ అవలక్షణాల నుంచి, అధర్మజీవనం నుంచి రక్షించే శక్తి కలిగినవి. నిత్య భగవద్విషయ వివేచనమే తపస్సు. అదే మనకు భాగవతం బోధించింది. కలియుగమందు మానవులు మందబుద్ధి కలవారు, రోగగ్రస్థులు కనుక.. మానవజాతిని రక్షించే శక్తి భగవన్నామానికి మాత్రమే ఉందన్న లక్ష్యంతో భాగవతావిర్భావం జరిగింది. గన్నమరాజు గిరిజా మనోహర బాబు

Read more