పరమాత్మోపాసన...!

ABN , First Publish Date - 2020-05-18T08:49:00+05:30 IST

స్త్రీ, పురుష, జాతి, వర్ణ, దేశ, కాల వివక్ష లేకుండా ప్రతి వ్యక్తినిఒకే రకమైన అంగాలతో పరమాత్మ సృష్టించాడు. కానీ మనకు మనం ఎన్నో పరిమితులు విధించుకొని సృష్టికర్తనే విస్మరిస్తున్నాం.

పరమాత్మోపాసన...!

స్త్రీ, పురుష, జాతి, వర్ణ, దేశ, కాల వివక్ష లేకుండా ప్రతి వ్యక్తినిఒకే రకమైన అంగాలతో పరమాత్మ సృష్టించాడు. కానీ మనకు మనం ఎన్నో పరిమితులు విధించుకొని సృష్టికర్తనే విస్మరిస్తున్నాం. గాడ్‌ ఓరియెంటెడ్‌గా బ్రహ్మ విద్య ఉంటే దానిని వదిలిపెట్టి ‘ఫుడ్‌ ఓరియెంటెడ్‌’గా జీవిస్తున్నాం. ఓంకారతత్వం వదలిపెట్టి అహంకారంతో జీవిస్తున్నాం. ఆ విస్మరణ నుండి ఉద్ధరించి ‘స్మరణ’ వైపు తీసుకెళ్లడమే శాస్త్రాలు, మహాత్ముల పని. 


‘‘బాలస్తావత్‌ క్రీడాసక్తః తరుణస్తావత్‌ తరుణీసక్తః

వృద్ధస్తావత్‌ చింతాసక్తః పరమే బ్రహ్మణి కో పినసక్తః - మోహముద్గరం


‘‘మానవులు... బాల్యంలో ఆటపాటలపై ఆసక్తితో ఉంటారు. యౌవనంలో కామం పట్ల ఆసక్తి చూపుతారు. వృద్ధాప్యంలో అనేక చింతలతో సతమతమవుతుంటారు. కానీ  పరబ్రహ్మపై ఎవరూ ఆసక్తులు కావడం లేదు గదా!’’ అని శంకరులు వాపోయారు. పరాత్పరుడైన పరమాత్మను స్మరించేందుకు ‘మనస్సు-చిత్తం’ ఆధారంగా చేసే అనేక సాధనలు, ఉపాయాలు మనకు శాస్త్రాల్లో  ప్రబోధించారు. సంధ్యావందనం ఒక సాధన. సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా నిరాకార స్వరూపుడిని ధ్యానించవచ్చు. ఆ సమయంలో చేసే మనస్మరణలు, ప్రార్థనలు నేరుగా ఆయనను చేరేందుకు అనువుగా ఉంటాయని గాయత్రి విజ్ఞానం తెలియజేస్తుంది. సంధ్యాదేవత, గాయత్రి, సూర్య విద్యగా మనకు అందించారు. అయితే చిత్తంతో చేసే స్మరణను పాత్రల్లోకి మార్చేసి వస్తు ప్రాధాన్యత పెంచాం. ‘స్వాతస్మిక పరమప్రేమ రూపా’ అని నారదుడు చెప్పింది మన హృదయాన్ని అనంతమైన ప్రేమతత్వంతో నింపమని! 


ఏది అసలైన సత్యమో తెలుసుకొన్నాక సత్యాన్ని గురించిన విచారణ అక్కరలేదు. ఆ సత్యం మనమే అయి జీవించడం అసలైన ఆధ్యాత్మికత. సాక్షిగా జీవిస్తే ప్రజ్ఞ, దాని ద్వారా నిస్సంగం ఆ వెంటనే ముక్తి. ఈ మెట్లు అర్థం చేసుకొనేందుకు ఆధ్యాత్మిక సాధన నిరంతరం కొనసాగాలి. ఆశ్రమం, మఠం, ఆలయం, గురువు, శాస్త్రం ఇవన్నీ ఆ స్థితిని గుర్తింపజేసే ఆవరణలు. అంతరంగంలో ప్రకాశించే ‘జ్యోతి’ మనమే అని తెలుసుకోవడమే జ్ఞానం. అదే అసలైన ఎఱుక.


‘‘పరాంచి ఖాని వ్యతృణత్‌ స్వయంభూః

తస్మాత్పరాజ్‌ పశ్యతి నాన్తరాత్మన్‌

కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షత్‌

ఆవృత్త చక్షురమృతత్వ మిచ్ఛన్‌’’


‘‘ఇంద్రియాలను బాహ్యోద్దేశ చర్యల కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల అవి వెలుపలి విషయాలను చూస్తున్నాయి. అంతరంలో ఉన్న ఆత్మను చూడడం లేదు. అమరత్వం కోరే ప్రాజ్ఞులు అంతర్ముఖమైన ఆత్మను చూడగలుగుతున్నారు’’ అని అంటుంది కఠోపనిషత్తు. ఆ అంతర్ముఖతత్వం గ్రహించడమే పరమాత్మోపాసన.


 డా. పి.భాస్కరయోగి

Updated Date - 2020-05-18T08:49:00+05:30 IST