భిన్నత్వంలో ఏకత్వం

ABN , First Publish Date - 2020-10-31T08:13:17+05:30 IST

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం. బౌద్ధ, జైన, సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సందర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవించాయి.

భిన్నత్వంలో ఏకత్వం

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం. బౌద్ధ, జైన, సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సందర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవించాయి. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజంలను కూడా భారతదేశం స్వాగతించి అక్కున చేర్చుకున్నది. ఆ పరమేశ్వరుడు ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా ఇష్టపడతాడు. లేకుంటే సృష్టిలో తాను ఒకే కులాన్ని, ఒకే మతాన్ని ఏర్పరచి ఉండేవాడు. కానీ అలా చేయలేదే! కనుక భగవంతుని సంకల్పం మేరకే ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాదులు, జీవన విధానాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే మతానికి చెందిన వారైతే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ఎవరైనా భావిస్తే పొరపాటు అవుతుంది. సత్యదూరమే అవుతుంది. ఊహాజనితమైనదై, వాస్తవికతకు దూరంగా జరిగినట్లవుతుంది.


ఇపుడు మానవాళి ముందున్న ప్రధాన సమస్య భిన్నమతాలు కాదు. నిజమైన సమస్యలు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, కరువు కాటకాలు మొదలైనవి. ఇవి మతాలు పరిష్కరించే సమస్యలు కావు. భిన్నత్వమనేది కేవలం మత సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కాదు. భగవంతుడు సృష్టి చేసినపుడు పిల్లి, కుక్క, నక్క ఉంటే చాలనుకోలేదు. 84 లక్షల జీవరాసులను సృష్టించాడు. ఒక చోట రాత్రి, ఒక చోట పగలు, ఒక ప్రాంతంలో వేడి, మరో చోట ఎండ ఉన్నాయి. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేరకంగా లేవు. అంటే వైవిధ్యం సృష్టి ధర్మం. ఈ వైవిధ్యంలో, భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. వైవిధ్యభరితమైన సృష్టికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవంతుడే. భగవంతుని ఒక రూపానికి, నామానికి పరిమితం చేయకుండా సృష్టి, స్థితి లయలకు కారణభూతమైన విశ్వ చైతన్య శక్తిగా మనం గ్రహించగల్గితే సమస్యలుండవు. మానవ దేహానికి చైతన్యం ఉన్నంత సేపు ఆ శరీరం శివం. అంటే మంగళకరం. దేహం నుండి చైతన్యం వెలుపలకు వెళ్లిపోతే శ్వాస ఆగిపోతుంది. చలనరహితమవుతుంది. అప్పుడు ఆ శరీరాన్ని ఫలానా వారి పార్థివ శరీరమంటాం.
ఒక శరీరానికి ఈ చైతన్యం ఎటువంటిదో సకల జగత్తుకూ అలా ఆధారభూతమైనది విశ్వ చైతన్య శక్తే. ఇదే విశ్వమంతటా నిండి నిబిడీకృతమైన ఏకత్వం. మనకు కంటికి కన్పించే, చెవికి విన్పించే అంశాలలో మాత్రమే భిన్నత్వం. కానీ నిత్య సత్యమైనది, భిన్నత్వంలోనున్న ఏకత్వమే (విశ్వ చైతన్య శక్తి). ఏకత్వం నుండే భిన్నత్వం ఆవిర్భవించింది. తుదకు భిన్నత్వమంతా ఏకత్వంలో సంలీనమవుతుంది. ఈనాడున్న అన్ని మతాలనూ మనం ఈ రీతిగానే చూడాలి. ఆరాధనా పద్ధతులను, ఆచారవ్యవహారాలను ఈ రకంగానే అవగాహన చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఏకత్వం ఏమిటంటే.. అవన్నీ కూడా ఉత్తమమైన జీవన విధానాన్నే ప్రబోధిస్తాయి. మానవతా విలువలకే ప్రాధాన్యమిస్తాయి. శాంతి సామరస్యాలనే వాంఛిస్తాయి. పరోపకారం, క్షమ, త్యాగనిరతినే అభిలషిస్తాయి. భేదమంతా సృష్టిని, సృష్టియందున్న భిన్నత్వాన్ని, భిన్నత్వంలో గల ఏకత్వాన్ని అర్థం చేసుకోలేని సగటు మనిషి మదిలోనే ఉంది.

- మాదిరాజు రామచంద్రరావు

Read more