ఈ ఏకాంతం ఒక వరం!

ABN , First Publish Date - 2020-04-24T05:42:26+05:30 IST

‘పరుగులు తీసే మనసు మురికి గుంట లాంటిది. ఏకాంతంగా నిలిచే మనసు స్వచ్ఛమైన సరోవరం లాంటిది’ అంటుంది బౌద్ధం.

ఈ ఏకాంతం ఒక వరం!

‘పరుగులు తీసే మనసు మురికి గుంట లాంటిది. ఏకాంతంగా  నిలిచే మనసు స్వచ్ఛమైన సరోవరం లాంటిది’ అంటుంది బౌద్ధం. చంచలమైన చిత్తం చెత్తతో నిండిపోతుందని చెప్పే కథ ఇది.


 ఒకసారి ఇద్దరు భిక్షువులు ఒకే అడవికి వర్షావాసం కోసం వెళ్ళారు. ఆ అడవి అంతటా మైమరపించే సౌందర్యం కనిపిస్తోంది. మొదటి వ్యక్తి ఆ ప్రకృతి అందాలపైనే మనసు పెట్టాడు. ధ్యానం అరకొరగా చేశాడు. రెండోవాడు ప్రకృతి అందాలను తిలకిస్తూనే, మైమరపు చెందకుండా, ఎరుకతో ఉండి ధ్యాన సాధన చేశాడు. ఇద్దరూ వర్షావాసం అనంతరం తిరిగి వచ్చారు. 


‘‘ఈ వర్షావాసంలో మీరు ఏమి సాధించారో చెప్పండి’’ అని అడిగాడు బుద్ధుడు. 


మొదటివాడు సరిగ్గా చెప్పలేకపోయాడు. రెండోవాడు ధ్యానంలో తాను సాధించిన పై మెట్టు గురించి చెప్పాడు. చూపించాడు.


అప్పుడు బుద్ధుడు వారిద్దరినీ ఒక కొలను దగ్గరకు తీసుకుపోయి ‘‘చూడండి! ఈ నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి. దానివల్ల తేరుకున్నాయి. స్వచ్ఛంగానూ ఉన్నాయి. కాబట్టి ఆ నీటిలో ఏం ఉన్నాయో మనకు కనిపిస్తాయి. ప్రమాదాలు ఉంటే తెలుస్తాయి’’ అని చెప్పాడు. 


తరువాత మొదటి భిక్షువును పిలిచి ‘‘ఈ నీటిని అటూ ఇటూ కలియబెట్టు’’ అన్నాడు.

 

అతడు అలా చేశాక- ‘‘చూశారా! నీరు అటూ ఇటూ విచ్చలవిడిగా కదలడం వల్ల బురదలా మారింది. దానిలోపల ఏ ప్రమాదం ఉందో తెలుస్తోందా? ఎక్కడ ఎంత లోతు ఉందో గుర్తించగలమా?’’ అని అడిగాడు. ఆ భిక్షువు తెలియదన్నాడు.


అప్పుడు బుద్ధుడు ‘‘భిక్షువులారా! మన మనస్సూ ఇంతే! ఏకాంతంలో ఉన్నప్పుడే అది తేరుకుంటుంది. ఏకాంతంలో కూడా ఎటో పరుగులు పెడితే ఈ మురికినీటి మాదిరిగానే మిగిలిపోతుంది. ఏకాంతం ఒక వరం. అది మీకు ఏడాదిలో మూడు నెలలు వస్తుంది. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మన పురోగతి తిరోగమిస్తుంది’’ అని చెప్పాడు. 


కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడు మనందరికీ తప్పనిసరి అయిన ఈ ఏకాంతాన్ని మన మనసులను మలినరహితం చేసుకోవడానికి వినియోగిద్దాం! మనల్ని మనం శుభ్రపరచుకుందాం!

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-04-24T05:42:26+05:30 IST