పరనింద పనికిరాదు

ABN , First Publish Date - 2020-09-25T05:34:20+05:30 IST

భక్తుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవునిగా బాబా ప్రసిద్ధులు. అంతేకాదు, భక్తులను ఆయన సంస్కరించేవారు...

పరనింద పనికిరాదు

  • ఇతరులను నిందిస్తున్నప్పుడు నిందించే వ్యక్తికి ఆనందంగా ఉంటుంది. కానీ ఇతరులకు అసహ్యంగా ఉంటుంది. నిందించడం చాలా చెడ్డ అలవాటు. అసలు మనం ఇతరుల దోషాలను ఎందుకు ఎంచాలి?


భక్తుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవునిగా బాబా ప్రసిద్ధులు. అంతేకాదు, భక్తులను ఆయన సంస్కరించేవారు. వారిలో మంచి మార్పులకు దోహదపడేవారు. ఇతరులలో తప్పులు వెతకవద్దనీ, ఎవరినీ దూషించవద్దనీ, విమర్శించవద్దనీ బోధించేవారు. అలాంటి పనులతో సమయం వృధా చేయకుండా మంచి పనులకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది ఆయన బోధనల సారాంశం.


సొలిసిటర్‌గా, ముంబాయి లెజిస్లేట్‌ కౌన్సిల్‌ సభ్యునిగా పనిచేసిన కాకా సాహెబ్‌ దీక్షిత్‌, ఆయన స్నేహితులు ఇద్దరు షిరిడీలో ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నారు. వారి చర్చ వేరే మతం వైపు మళ్ళింది. ఆ మతంలోని దోషాలు ఎత్తి చూపడమే ప్రధానోద్దేశంగా ఆ చర్చ సాగింది. దీక్షిత్‌ కూడా ఆ మతాన్ని విమర్శిస్తూ మాట్లాడాడు. కొద్దిసేపటి తరువాత బాబా దర్శనానికి దీక్షిత్‌ వెళ్ళాడు. అతను బాబా పాదాలకు నమస్కరించబోతూ ఉండగా ఆయన తన పాదాలను వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు ఒకసారి దీక్షిత్‌తో బాబా మాట్లాడుతూ ‘‘నీవు ఎవరి గురించయినా చెడుగా మాట్లాడితే నాకు చాలా దుఃఖం వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఆయన  చేసిన బోధ, దాన్ని అనుసరించకుండా తాను చేసిన తప్పు దీక్షిత్‌కు గుర్తుకు వచ్చాయి. మనసులోనే బాబాకు క్షమాపణ చెప్పాడు. అప్పుడు ‘‘కాకా కూర్చో!’’ అన్నారు బాబా. తాను అంతటా, అందరిలో ఉన్నాననే సత్యాన్ని కాకాసాహెబ్‌ దీక్షిత్‌ లాంటి భక్తులకు బాబా అవగతం చేశారు. అందుకే వారు తమతమ జీవితాలను చక్కగా మలచుకున్నారు. 


ఇతరుల దోషాలు ఎంచకూడదు!

ఒకసారి కొందరు భక్తులు వసతి గృహంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక వ్యక్తి అక్కడ లేనివారి గురించి నిందారోపణ చేస్తూ మాట్లాడాడు. మాటలు అక్కడున్న చాలామందికి రుచించలేదు. కొద్దిసేపటికి బాబా బయటకు బయలుదేరారు. దారిలో ఆ వ్యక్తి గురించి అడిగారు. తన గురించి బాబా వాకబు చేశారని తెలుసుకొని అతను బాబా దగ్గరకు వచ్చాడు. అప్పుడు బాబా ఒక వరాహాన్ని చూపించారు. దాని నోరంతా అశుద్ధంతో నిండి ఉంది. అది దాన్ని సంతోషంగా తింటోంది. ‘‘చూశావా? అది ఎంత ఆనందంగా తింటోందో! కానీ అది తినేదాన్ని మనం అసహ్యించుకుంటాం. అలాగే ఇతరులను నిందిస్తున్నప్పుడు నిందించే వ్యక్తికి ఆనందంగా ఉంటుంది. కానీ ఇతరులకు అసహ్యంగా ఉంటుంది. నిందించడం చాలా చెడ్డ అలవాటు. అసలు మనం ఇతరుల దోషాలను ఎందుకు ఎంచాలి?’’ అని హితవు చెప్పారు. 


పరుషంగా మాట్లాడకూడదు!

దాసగణు మహారాజ్‌ గొప్ప సాయి భక్తుడు. మహాత్ముల చరిత్రను గ్రంథస్థం చేశాడు. ఎన్నో ప్రఖ్యాత ఆధ్యాత్మిక రచనలు చేశాడు. ఇప్పటికీ మనం వింటున్న ‘సాయి రహమ్‌ నాజర్‌ కర్‌నా’ పాట ఆయన రాసిందే! దాసగణు ఊరూరా హరికథలు చెప్పేవాడు. ఆయన ఒక సందర్భంలో రాధాకృష్ణ మాయిని విమర్శించాడు. రాధాకృష్ణమాయి నేటి సాయి సంస్థాన్‌ ఏర్పాటుకు ఆద్యురాలు. దీక్షిత్‌, నానా సాహెబ్‌ చందోర్కర్లతో చెప్పి బాబా కోసం వెండి సింహాసనం, వింజామరలు, పల్లకీ లాంటివి ఆమె సేకరించారు. అయితే వాటిని బాబా ఎన్నడూ ఉపయోగించలేదు. అలాంటి రాధాకృష్ణమాయిని విమర్శిస్తూ ‘‘నేను స్వచ్ఛమైన భక్తితో కీర్తనల ద్వారా చేసే బాబా సేవ ముందు కపట బుద్ధితో నీవు చేస్తున్న సేవ ఏ పాటిది?’’ అని దాసగణు అని పరుషంగా మాట్లాడాడు. బాబాకు ఇది తెలిసింది. ఆమెకు క్షమాపణ చెప్పవలసిందిగా దాసగణును ఆదేశించారు. తప్పును గ్రహించిన దాసగణు ఆమెకు క్షమాపణలు చెప్పాడు.


ఇలాంటిదే మరో సంఘటన.. 

షిరిడీలో సాఠేవాడాను కట్టించిన వినాయక సాఠే మామగారు దాదా కేల్కర్‌. సాఠేవాడా బాగోగులు ఆయనే చూసేవాడు. అక్కడ దిగిన ఒక మహిళ వంటకోసం ఉల్లిపాయలు తరుగుతూండడం ఆయన కంట పడింది. వాడాలో ఉల్లిపాయలు తరగరాదనీ, అలా చేస్తే వాడాను ఖాళీ చేసి వెళ్ళిపోవాలనీ ఆమెతో పరుషంగా మాట్లాడాడు కేల్కర్‌. ఇది జరిగిన కొద్ది సేపటికి కేల్కర్‌ మనుమరాలి కళ్ళు విపరీతంగా వాచిపోయాయి. కళ్ళ నుంచి నీళ్ళు ధారగా కారసాగాయి. బాబా వద్దకు కేల్కర్‌ పరుగున వెళ్ళి, తన మనుమరాలి విషయం చెప్పాడు. ‘‘ఆమె కంట్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టు. ఇంతకుముందు నువ్వు దూషించిన మహిళ దగ్గర నుంచి ఉల్లిపాయలు తీసుకో!’’ అన్నారు బాబా. దాదా కేల్కర్‌కు తన తప్పు తెలిసింది. తనను క్షమించాలని బాబాను వేడుకున్నాడు. ఆ మహిళను కూడా క్షమాపణ అడిగాడు. 


చాటుగా నిందిస్తే...

1909లో తాత్యా సాహెబ్‌ నుల్కర్‌ పండరీపురం సబ్‌ జడ్జిగా ఉండేవాడు. క్రమంగా అతను బాబా భక్తుడయ్యాడు. అతనికి అనారోగ్యం కలిగినప్పుడు షిరిడీ వచ్చి, కొంతకాలం అక్కడే ఉన్నాడు. అప్పుడు పండరీపురంలోని బార్‌ రూమ్‌లో (న్యాయవాదుల గదిలో) ఈ విషయం చర్చకు వచ్చింది. ‘రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఔషధం సేవించాలి కాని షిరిడీ వెళ్తే బాగవుతుందా?’ అంటూ నుల్కర్‌ను ఒక న్యాయవాది విమర్శిస్తూ మాట్లాడాడు. కొన్ని రోజుల తరువాత ఆ న్యాయవాది షిరిడీ వచ్చి, బాబాను దర్శించుకొని, దక్షిణ ఇచ్చాడు. వెంటనే బాబా ‘‘మనుషులు ఎంత టక్కరివాళ్ళు. పాదాల మీద పడి దక్షిణ ఇస్తారు. చాటుగా నిందిస్తారు. ఇది చిత్రం కదా!’’ అన్నారు. ఆ మాటలు మిగిలిన వారికి అర్థం కాకపోయినా ఆ న్యాయవాదికి సూటిగా తాకాయి. పశ్చాత్తాపంతో బాబాను క్షమాపణ వేడుకున్నాడు. 


పెత్తనం చెలాయించకూడదు!

హరిద్వార్‌ చెందిన ఒక భక్తుడు ప్రతిరోజు బాబా దగ్గరగా స్తంభం వద్ద కూర్చునే వాడు. ఒకసారి అతను మసీదుకు రావడం ఆలస్యం అయింది. అతను రోజూ కూర్చొనే చోట ఒక అమ్మాయి కూర్చుంది. అతను వచ్చినా ఆ అమ్మాయి లేవలేదు. అప్పుడు అతను ఆమెను లేవమని చెప్పి, అక్కడి నుంచి పంపి తను కూర్చున్నాడు. కొద్ది సేపటికి బాబా అతన్ని కిందకు వెళ్ళి, మండపంలో కూర్చోమని ఆజ్ఞాపించారు. కాసేపటి తరువాత అతను మళ్ళీ వచ్చి కూర్చోబోతూ ఉంటే మళ్ళీ కిందకు వెళ్ళమన్నారు. ఆ అమ్మాయి పట్ల తన ప్రవర్తనకు బాబా ఈ విధంగా గుణపాఠం చెబుతున్నారని అతను గ్రహించాడు. తనను మన్నించమని బాబాను కోరాడు. 


ఎవరినీ విమర్శించవద్దనీ, ఎవరి మనసూ నొప్పించవద్దనీ అలా అనేక సంఘటనల ద్వారా తన భక్తులకు బాబా ఉద్బోధించారు. ఇవన్నీ ‘సాయిసచ్ఛరిత్ర’, విజయకిషోర్‌ రాసిన ‘దీక్షిత్‌ డైరీ’ తదితర గ్రంథాల్లో చోటుచేసుకున్నాయి 

- జస్టిస్‌ బి.చంద్రకుమార్‌

8978385151

Updated Date - 2020-09-25T05:34:20+05:30 IST