అంత మంది భార్యలున్నా...
ABN , First Publish Date - 2020-02-14T05:56:07+05:30 IST
శ్రీకృష్ణుడి కథ ఆద్యంతం ప్రేమతత్త్వానికి ప్రతీక. ఎనిమిది మంది భార్యలు, పదహారు వేల మంది గోపికలు, అన్నిటికీ మించి రాధా ప్రణయం... మధుర భక్తికీ, మధుర ప్రేమకూ మారుపేరు కృష్ణ గాథలు.
శ్రీకృష్ణుడి కథ ఆద్యంతం ప్రేమతత్త్వానికి ప్రతీక. ఎనిమిది మంది భార్యలు, పదహారు వేల మంది గోపికలు, అన్నిటికీ మించి రాధా ప్రణయం... మధుర భక్తికీ, మధుర ప్రేమకూ మారుపేరు కృష్ణ గాథలు. ఇందరివాడైన కృష్ణుడు ఎలాంటి ప్రేమికుడు... ఆయన ప్రేమ ఎలాంటిది? వటపత్ర శాయి నిజంగానే తామరాకు మీద నీటి బొట్టు లాంటి ఒక అసక్త ప్రేమికుడా?
భగవద్గీతలో ‘అసక్తః’ అనే ఒక మాట ఉంది. కర్మేంద్రియాలతో పనిచేస్తున్నా, మనస్సు అందులో లీనం కాకుండా ఉండడాన్ని అసక్తంగా ఉండడం అంటారు. శ్రీకృష్ణపరమాత్మ జీవితం ఇందుకు మంచి ఉదాహరణ. భగవద్గీత మూడో అధ్యాయం ఏడో శ్లోకంలో అసక్తంగా ఉండడం గురించి శ్రీకృష్ణపరమాత్మ వివరించాడు.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైుః కర్మయోగ మసక్తః స విశిష్యతే
భగవద్గీత అర్థం కావాలంటే ప్రామాణికమైన వ్యాఖ్యానం ఒక్కటే. అది - శంకరాచార్య రచించిన ‘శంకరభాష్యం’. ‘‘అర్జునా! నిజమైన కర్మయోగం ఏమిటంటే ‘యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే’... ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అది మనస్సుతోనే సాధ్యం. ఎందుకంటే మనస్సును లాగేస్తుంటాయి ఇంద్రియాలు. మనస్సుకు, ఇంద్రియాలకు మధ్య జరిగే సంగ్రామమే జీవితం. ఇంద్రియాలు గుర్రాల లాంటివి. మనస్సు సారఽథి లాంటిది. గుర్రాల పగ్గాలు సారథి చేతుల్లో ఉండాలి. మనస్సులో వైరాగ్యం ఉండాలి. ‘ఈ భోగాలేవీ శాశ్వతం కావు’ అనే ఆలోచన ఉండాలి. ఫలితం మీద దృష్టి లేకుండా పని మీదే దృష్టి పెట్టడం- అది కూడా కర్మేంద్రియాలతో పనిచేయడం, మనస్సు అందులో లీనం కాకుండా అసక్తంగా ఉండడం ముఖ్యం. ఇందుకు శ్రీకృష్ణుడే ఉదాహరణ.
భారతయుద్ధం ముగిశాక శ్రీకృష్ణపరమాత్మ అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో భర్త అభిమన్యుణ్ణి కోల్పోయిన ఉత్తర మృతశిశువును తీసుకుని పరుగు పరుగున వచ్చింది. మృతశిశువును పట్టుకుని ఏడుస్తూ ఉంటే వ్యాసుడు - ‘‘శిశువును తీసుకెళ్లి అస్ఖలిత బ్రహ్మచారి చేతుల్లో పెట్టు. నీ బిడ్డ బతుకుతాడు’’ అని చెప్పాడట. భీష్ముడు కఠిన బ్రహ్మచర్యం పాటించాడు. దాంతో ఉత్తర మృతశిశువును తీసుకుని భీష్మాచార్యుల దగ్గరకు వచ్చింది. ‘‘ఎలాగైనా నా బిడ్డను బతికించు’’ అని భీష్ముణ్ణి వేడుకుంది. అప్పుడు భీష్ముడు ‘‘నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాదు. అదిగో వేణువు ఊదుతూ నిలుచుని ఉన్నాడే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. ఆయన చేతుల్లో పెట్టు, నీ బిడ్డ బతుకుతాడు. నా మాట విని ఆలస్యం చేయకుండా వెళ్లు’’ అని చెప్పాడు.
భీష్మునిపై గౌరవంతో ఉత్తర ఆ శిశువును తీసుకెళ్లి శ్రీకృష్ణుని పాదాల దగ్గర పెట్టింది. వెంటనే శ్రీకృష్ణుడు వేణువు పక్కన పెట్టి శిశువును చేతుల్లోకి తీసుకోగానే శిశువు బతికాడు. అది చూసి ఆశ్చర్యపోయింది ఉత్తర. ‘శ్రీకృష్ణుడి గురించి రకరకాలుగా అంటారు - చాలా మంది భార్యలు అని! మరి ఇదెలా సాధ్యం?’ అనుకుంది. ఉండబట్టలేక ‘తాతగారూ! ఇదెలా సాధ్యం?’ అని కృష్ణుణ్ణి అడిగింది. ‘అది కూడా భీష్ముడినే అడుగు’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భీష్ముడిని ఉత్తర అడిగింది. ‘ఆయన ఎంతమందితో కాపురం చేసినా మనస్సును నిగ్రహించుకున్నాడు. ఆయన మనస్సు ఎప్పుడూ కాపురాలు చేయలేదు. వాళ్లనుకున్నారు ఆయన భార్యలమని! కానీ ఆయన ఎప్పుడూ అనుకోలేదు వారు తన భార్యలని’’ అని అన్నాడు. ఇది ‘అస్ఖలిత బ్రహ్మచర్యం’ అంటే. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పిన ‘అసక్తః’ అనే మాటను పాటించాడు.
స్నేహితుడు ఎలా ఉండాలి?
స్నేహితుడి లక్షణాలు ఏమిటి? ఆ స్నేహితుడిని ఎలా కాపాడుకోవాలి? స్నేహం అంటే ఏమిటి? స్నేహితుడితో ఎలా ఉండొచ్చు? ఎలా ఉండకూడదు? అతను ఏ పనిచేస్తే సమర్థించవచ్చు? ఏ పనిచేస్తే సమర్థించకూడదు? భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం. ఈనాటి యువతరం తల్లితండ్రుల కన్నా ఎక్కువగా స్నేహితులను ప్రేమిస్తున్నారు. స్నేహం బాగుండాలంటే ఆరు లక్షణాలు చూసుకోవాలి.
అఘము వలన మరల్చు హితార్థ కలితు
జేయు గోప్యంబు దాచు, బోషించు గుణము
విడువ డాపన్ను లేవడి వేళనిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు
స్నేహితుడు తప్పుపనిచేయకుండా ఆపాలి. తప్పుపని చేయబోతుంటే వారించాలి. గట్టిగా చెప్పాలి. స్నేహితుడికి మేలు చేకూర్చాలి. స్నేహితుడిలో కొన్ని లోపాలుంటే వాటిని ప్రచారం చేయకూడదు. స్నేహితుడిగా వాటిని దాచాలి. వాడిలో ఉన్న మంచి గుణాలు చెప్పాలి. ఆపదలో ఉన్న మిత్రుడిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఈ లక్షణాలు స్నేహంలో ఉండాలి. అప్పుడే స్నేహం నిలబడుతుంది. మరి ఈరోజు స్నేహాలలో ఈ లక్షణాలన్నీ ఉంటున్నాయా? ఒక్కసారి ఆలోచించండి.
ఫలితం మీద దృష్టి లేకుండా ఉండడం, పని మీదే దృష్టి పెట్టడం... అది కూడా కర్మేంద్రియాలతో పనిచేయడం, మనస్సు అందులో లీనం కాకుండా అసక్తంగా ఉండడం ముఖ్యం. ఇందుకు శ్రీకృష్ణుడే ఉదాహరణ.
డా. గరికిపాటి నరసింహారావు