నిజమైన స్నేహం!

ABN , First Publish Date - 2020-02-28T06:19:24+05:30 IST

స్నేహితులు పాలు, నీళ్లలా ఉండాలి. పాలలో, నీళ్లు కలిసిపోతే పాలేవో, నీళ్లేవో తెలియదు. స్నేహం కూడా అంతలా కలిసిపోయాలి. ఇదే విషయాన్ని...

నిజమైన స్నేహం!

స్నేహితులు పాలు, నీళ్లలా ఉండాలి. పాలలో, నీళ్లు కలిసిపోతే పాలేవో, నీళ్లేవో తెలియదు. స్నేహం కూడా అంతలా కలిసిపోయాలి. ఇదే విషయాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం.


  • క్షీరము మున్ను నీటి కొసగెన్‌ స్వగుణంబులు తన్ను చేరుటన్‌
  • క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్‌ వెతచే జలంబుదు
  • ర్వార సుహృద్విపత్తిగని వహ్ని జొరంజనె దుగ్ధ మంతలో 
  • నీరము గూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్‌

పాలలో నీళ్లు పోయండి. ఆ తరువాత ఏం చేసినా సరే పాలు, నీళ్లు వేరు చేయలేరు. ‘క్షీరము మున్ను నీటి కొసగెన్‌ స్వగుణంబులు తన్ను చేరుటన్‌’ అంటే.. పాలు, నీళ్లను పిలిచి మనం ఇద్దరం ఒకటే అని కలిపేసుకుని నీళ్లను కూడా పాలలా మార్చేసింది. ఎన్ని నీళ్లు కలిసినా అవి పాలే అవుతాయి కానీ నీళ్లు కావు కదా! పాలు తన గుణాలన్నీ ఇచ్చేసి, నీళ్లను కూడా పాలగా మార్చేసింది. అప్పుడు నీరు ఏం చేసింది? ‘క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్‌ వెతచే జలంబు’ అంటే.. పాలు వేడి చేస్తాం కదా!  వేడి చేసినప్పుడు పాలు వేడెక్కిపోతూ ఉంటే నీళ్లకు బాధ కలిగిందట.


ఆ బాధతో నీరు ఆవిరిరూపంలో బయటకు పోవడం మొదలుపెట్టిందట! అందుకే పాలు ఎక్కువ సేపు వేడి చేస్తే నీళ్లన్నీ పోయి చిక్కటి పాలే మిగులుతాయి. ‘దుర్వార సుహృత్విపత్తిగని వహ్ని జొరంజనె దుగ్ధ’.... నీళ్లు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవడం చూసి పాలు తట్టుకోలేక పొంగి పొయ్యి మీద పడిపోతున్నాయట! ‘నీరము గూడి శాంతమగు’... పొంగిపోతున్న పాలను ఆపడానికి బయట నుంచి మళ్లీ నీళ్లు చల్లుతారు. అప్పుడు పాలు, ‘‘హమ్మయ్యా! నా నీళ్లు నా దగ్గరకు వచ్చేశాయి’’ అనుకుని పొంగడం ఆగిందట! నిజంగా మహాత్ములు ఇలాగే ఉంటారు. ‘‘నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్‌’’... వాళ్ల స్నేహం అలాగే ఉంటుంది. 20 ఏళ్ల వయసులో చేసిన స్నేహం, 70 ఏళ్ల వయసులోనూ కొనసాగాలి. అదీ నిజమైన స్నేహం. 

 డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-02-28T06:19:24+05:30 IST