మనసును నిలువరిస్తేనే
ABN , First Publish Date - 2020-03-08T10:34:03+05:30 IST
మనసును నిలువరిస్తేనే

ఆధ్యాత్మిక సాధన అనేది జీవిత పర్యంతం కొనసాగాల్సిన నిరంతర ప్రక్రియ. దీనికి దీర్ఘకాలిక కృషి, పట్టుదల అవసరం. భగవంతుడి పట్ల మనకు ఉండే భక్తి విన్యాసాలు ఇందుకు ప్రాతిపదిక. సాధనలో త్వరగా ఫలితాలు లభించాలనుకోవడం పొరపాటు. ఒక యువకుడికి బీఏ/బీఎస్సీ/బీకాం డిగ్రీకి ఎంతకాలం పడుతుందో గమనించండి. ఎల్కేజీ నుంచి ప్రారంభమైతే డిగ్రీ చేతికి రావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. ఆపై పీజీ, టెక్నికల్ డిగ్రీ పొందటానికి, ఉద్యోగం సంపాదించడానికి మరో 5, 6 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది? ఎంతో టెన్షన్ ఉంటుంది. ఎంతో ఎదురుచూపు ఉంటుంది? పైగా ఫలితం దైవాధీనమే. కేవలం భుక్తి కోసం, ధనార్జన కోసం, ప్రాపంచిక విద్య కోసం ఇంత కాలాన్ని, శక్తిని వినియోగించాల్సి వస్తే.. నిత్య సత్యమైన, ఈ సకల జగత్తుకు అధిపతియైున, చరాచర సృష్టికి మూల కారణమైన ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఎంత సాధన కావాలో అర్థం చేసుకోవచ్చు. ఈ సాధన ఎంత కాలం కొనసాగాలంటే..? మనలో స్థిరత్వం, భగవంతుడి పట్ల అచంచలమైన పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, తుదకు శరణాగతి తత్వం అలవరచుకునేంత వరకు..! మనం రోడ్డు పక్కన పెద్ద వృక్షాలను చూస్తుంటాం. అల్లంత దూరంలో వరిపైరు ఉంటుంది. పెద్ద వృక్షాలకు నిత్యమూ నీరు అందించాల్సిన అవసరం లేదు. వాటి వ్రేళ్లు విస్తారంగా వ్యాపించి ఉంటాయి. నీటిమట్టం వరకు భూమిలో లోతుగా దిగి ఉంటాయి. కానీ వరిపైరుకు నీరు అందుతోందా? లేదా? అని నిత్యం చూడాల్సిందే. తరచూ నీళ్లు పట్టాల్సిందే. లేకుంటే పైరు వాడిపోతుంది. ఎందుకంటే వాటి వేర్లు పైపైనే.. 3, 4 అంగుళాల లోతు వరకే దిగి ఉంటాయి. ఈ ఉదాహరణ మాదిరిగానే.. విశ్వాసం అనే వేర్లు, మీ హృదయాంతరాళమును చేరి, మీ మనస్సును కదలక, మెదలక, అదరక, బెదరక ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా భరించగల శక్తి, ఓపిక వచ్చేంత వరకు ఆధ్యాత్మిక సాధన కొనసాగాల్సిందేనని భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చెప్పేవారు. సామాన్యులమైన మన భక్తి విశ్వాసాలు వరి పైరు వేర్ల మాదిరిగానే ఉంటాయి. నిత్యం నీళ్లుపట్టినట్లే.. నిత్య సాధన లేకుంటే.. మన భక్తి విశ్వాసాలు క్షీణించిపోతాయి. భగవదనుగ్రహానికి చేరువకాలేం. ఎంతచేసినా దేవుడు కరుణ చూపలేదని పరితపిస్తాం. లోపం మనలోనే ఉంది. భగవత్తత్వంలో కాదు. ఇందుకు కారణం.. చాలా మంది సాధనలో మనస్సును నిలువరించలేకపోతున్నారు. మనం దేవాలయంలో ఉన్నా.. మనస్సు మాత్రం మార్కెట్లో తిరుగుతుంది. మనస్సు తత్వం అటువంటిదే. ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నంలో భాగమే ఆధ్యాత్మిక సాధన. కోరికలను ఒక్కొక్కటిగా తొలగించుకోగల్గితే మనస్సే మాయమవుతుంది. మనస్సు నిలవకపోవడమనే సమస్యే ఉత్పన్నం గాదు. సైకిల్ తొక్కుతున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు, పుస్తకం చదువుతూ విషయాలు గ్రహిస్తున్నప్పుడు, ఆఫీసు పని శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఏకాగ్రతతోనే ఉంటాం. మరో ఆలోచన రాదు. ఎందుకంటే ఆ స్థితిలో వేరే ఆలోచనలు చేస్తే ప్రమాదంలో పడతామని మన అంతరాత్మ ప్రబోధిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలోనూ అదేవిధంగా ఆలోచించాలి
.- మాదిరాజు రామచంద్రరావు, 9393324940