ఆనందోపాయం

ABN , First Publish Date - 2020-07-08T08:07:21+05:30 IST

మానవుడు ఆనందుడు. ఆనందాన్ని అందుకోవాలన్న తీవ్రకాంక్ష కలవాడు. నిజానికి మానవుడి సహజ స్వభావం ఆనందమే. కానీ దాన్ని మరచి బాహ్య భావనల ప్రభావానికి లోనై, ప్రతిబింబాన్ని బింబంగా..

ఆనందోపాయం

మానవుడు ఆనందుడు. ఆనందాన్ని అందుకోవాలన్న తీవ్రకాంక్ష కలవాడు. నిజానికి మానవుడి సహజ స్వభావం ఆనందమే. కానీ దాన్ని మరచి బాహ్య భావనల ప్రభావానికి లోనై, ప్రతిబింబాన్ని బింబంగా.. ప్రతిధ్వనిని ధ్వనిగా.. నీడను నిజంగా భావిస్తూ, నిత్యశోకితుడై జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నాడు. ప్రపంచంలో బతకడానికి కావలసిన విద్యలన్నీ బతుకు తెరువు కోసం, సుఖం కోసం, ధనం, కీర్తి, సంతోషం, సుఖం కోసమైతే... ఆనందాన్ని, ఆధారాన్ని, మూలస్థితులను ఎరుకపరచే అసలు విద్యే ఆత్మవిద్య. అది చావులేని చదువు. అచ్చతెలివి. ఆ అనుభవం పొందవలసిన మార్గమే అధ్యాత్మమార్గం! అదీ అసలు దారి! అదే నిజమానవుడి లక్ష్యం! గమ్యంఈ సత్యాన్వేషణ యాత్రలో ముందుగా ‘అంతరంగం’ శుద్ధి కావాలి. అంతరంగమంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల కలయిక. మనసు మాలిన్యం పోగొట్టాలంటే మనసుకు మూలమైన ఆలోచన, సంకల్పం సక్రమంగా ఉండాలి. స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండాలి. మానవ సంబంధాలన్నీ మనోమయాలే! మన సంబంధాల పవిత్రత, పటిష్ఠత..  మన ఆలోచనలను బట్టే ఉంటాయి. పవిత్రమైన ఆలోచన పవిత్రమైన మనసును, వాత్సల్యాన్ని, దయను, కరుణను, అభిమానాన్ని కలిగిస్తుంది. అపవిత్రమైన ఆలోచన పగను, కక్షను, ద్వేషాన్ని, మోహాన్ని, బంధనను కలిగిస్తుంది.


మన విముక్తికి, బంధనలకు కారణమైన మనసును.. అంటే మన ఆలోచనలను మనం పొందవలసిన ఆనందం వైపు మళ్ళించాలి. ఈ ఆనందమే ప్రకృతిలో ఉన్న సత్త్వరజస్తమో గుణాలతో కలిసినపుడు ఆ గుణాల ప్రభావానికి లోనై ప్రవర్ధమవుతుంది. ఆనందం, గుణం కలిసిన దానిని ‘తద్రతి’ అన్నారు. అజ్ఞాన, అహంకారాలు తమోగుణం! సంకుచితత్వం, స్వార్థం లేని లక్షణం, సమత్వం, సర్వశ్రేయం, సమాశ్రయం.. రజోగుణం. తనతోపాటు లోకమూ బాగుండాలన్నది దీని లక్షణం! నిస్వార్థం, విశాలత్వం, క్షమ, ఆనందం.. ఇదంతా సత్త్వం! నిష్కామ కర్మ, నిస్వార్థబుద్ధి, నిరహంకారం దీని లక్షణాలు! సాత్వికమైన మనసు వలన మంచి బుద్ధి ఏర్పడుతుంది. సాత్త్విక స్థితి అంతా ఆనందం, ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత్వమే. పవిత్రమైన ఆలోచన వలన, పవిత్రమైన మనసు, దాని నుండి ప్రకాశవంతమైన బుద్ధి ఏర్పడతాయి. ఆలోచన, మనసు, బుద్ధి ఏకమై శరీరాన్ని నడిపించాలి. అంటే కర్మ కోసం ఏర్పడిన కాయాన్ని సత్కర్మలలో పెట్టాలి. ‘కర్మ’గా సంచరించే శరీరంలో ‘అకర్మ’ అనే ఆత్మ సర్వదా ఉంటుంది. అంటే కర్మలన్నిటినీ ఆత్మభావంతో చేయాలి. అన్నింటినీ సమన్వయం చేసుకొని, అనంతత్వంలో ఏకత్వాన్ని, ఏకత్వంలో అనంతత్వాన్ని సాధించాలి.


సమస్త జీవకోటి నిర్మాణమంతా పంచభూతాలతో కూడి వున్నది. ఆరవభూతం చైతన్యం. ఈ చైతన్యం సమస్త ప్రాణికోటి యందూ ఉన్నది.  అందునా మానవుని యందు ఈ చైతన్యం, విజ్ఞాన, సుజ్జాన, ప్రజ్ఞానాలుగా, వివేకంగా, విచక్షణగా విరాజిల్లుతోంది. ఈ కారణంవల్ల మానవ జన్మకు ‘అధికార జన్మ’ అని అసలు పేరు. స్వభావంతో సంచరించినంత వరకు అధికారం! ప్రభావంతో పతనమైనపుడు అహంకారం! 


ప్రభావం నుంచిస్వభావంలోకి, ప్రవృత్తి నుంచినివృత్తిలోకి, చీకటి నుంచి వెలుగులోకి, మానవత్వం ద్వారా దివ్యత్వంలోకి, దేహభావం నుంచి ఆత్మభావంలోకి చేసే ప్రయాణమే అధ్యాత్మ! జగత్తు, జీవుడు, జగదీశ్వరుడు ఒక్కటే అనే భావమే అధ్యాత్మ!


వి.ఎస్‌.ఆర్‌.మూర్తి

Updated Date - 2020-07-08T08:07:21+05:30 IST