త్యాగశీలికే దేవుడి దీవెన

ABN , First Publish Date - 2020-06-12T05:30:00+05:30 IST

ఒక వస్తువు తనకు అవసరం ఉన్నప్పటికీ, అదే వస్తువును ఇతరులు అడిగితే, తన అవసరాన్ని మానుకొని మరీ ఇవ్వడాన్ని ‘ఈసార్‌’ (త్యాగం) అంటారు. ఉపకార గుణాలన్నిటిలో ఇది గొప్పది...

త్యాగశీలికే దేవుడి దీవెన

ఒక వస్తువు తనకు అవసరం ఉన్నప్పటికీ, అదే వస్తువును ఇతరులు అడిగితే, తన అవసరాన్ని మానుకొని మరీ ఇవ్వడాన్ని ‘ఈసార్‌’ (త్యాగం) అంటారు. ఉపకార గుణాలన్నిటిలో ఇది గొప్పది. నైతిక గుణాల్లో కూడా దీనికి అత్యున్నతమైన స్థానం ఉంది. దైవ ప్రవక్త మహమ్మద్‌ దీన్ని ఆచరించేవారు. త్యాగం చేయాలని ఇతరులను ప్రోత్సహించేవారు. 



త్యాగం గొప్పతనం గురించి దైవప్రవక్త మహమ్మద్‌ అనుయాయుడు  హజ్రత్‌ అబూ హురైరా వివరించారు:

‘‘ఒక వ్యక్తి దైవప్రవక్త సన్నిధికి వచ్చి, ‘‘నేను చాలా బాధలో ఉన్న పేదవాణ్ణి. నన్ను ఆకలి దహించేస్తోంది’’ అని చెప్పాడు. అప్పుడు దైవ ప్రవక్త అతనికి తినడానికి ఏదైనా పంపించాలని తన భార్యలలో ఒకరికి కబురుపెట్టారు. ‘‘మిమ్మల్ని సత్యధర్మంతో పంపిన పవిత్రశక్తి సాక్షిగా ప్రస్తుతం మా దగ్గర మంచి నీరు తప్ప తినడానికీ, తాగడానికీ ఏ వస్తువూ లేదు’’ అని సమాధానం వచ్చింది. మరో భార్యకు కబురు చేస్తే అక్కడి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. ఇలా ప్రతి భార్య ఇంటి నుంచీ అదే సమాధానం వచ్చింది. ఆయన తన అనుచరులను ఉద్దేశించి, ‘‘ఈ దాసుణ్ణి ఎవరు తమ అతిథిగా స్వీకరిస్తారో అతనిపై దైవకారుణ్యం ప్రత్యేకంగా కురుస్తుంది’’ అని అన్నారు. అప్పుడు అబూ తల్హా అనే వ్యక్తి లేచి నిలబడి, ‘‘దైవప్రవక్తా! ఇతన్ని నేను అతిథిగా స్వీకరిస్తున్నాను’’ అని చెప్పాడు. అతణ్ణి ఇంటికి తీసుకువెళ్ళాడు. ‘‘ఒక అతిథికి తినడానికి ఏమైనా ఉందా?’’ అని భార్యను అడిగాడు. ‘‘పిల్లల కోసం కొంచెం ఆహారం తప్పితే మీకూ, నాకూ కూడా తినడానికి ఏదీ లేదు’’ అని చెప్పిందామె. ‘‘అయితే పిల్లలకు భోజనం పెట్టకుండా, ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. అతిథి ఇంట్లోకి వచ్చి, భోజనం కోసం కూర్చోగానే మనమూ కూర్చుందాం. అతను భోజనం చేస్తున్న సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్టు నటిస్తూ, దాన్ని ఆర్పెయ్యి. చీకటిలో మనం తింటున్నట్టు నటిద్దాం’’ అని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. కానీ అతిథి మాత్రమే భోజనం చేశాడు. ఆ భార్యాభర్తలూ, వారి పిల్లలూ ఆ రాత్రి పస్తు ఉన్నారు. మర్నాడు ఉదయం దైవప్రవక్త సన్నిధికి అబూ తల్హా వెళ్ళగానే, అతని పేరునూ, అతని భార్య పేరునూ ప్రవక్త ప్రస్తావిస్తూ, వారి ఔదార్యానికి అల్లాహ్‌ అమితంగా సంతోషించాడని ప్రకటించారు. (హదీస్‌ గ్రంథం: బుఖారీ)

దైవ ప్రవక్త బోధనలూ, శిక్షణ, ఆదర్శ ఆచరణలూ ఆయన సహచరుల్లో ఎంతటి త్యాగగుణాన్ని పెంపొందించాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక సాక్ష్యం. 

-మహమ్మద్‌ వహీదుద్దీన్


Updated Date - 2020-06-12T05:30:00+05:30 IST