21 ఏళ్ల ఈ యువతి.. డ్రైవర్‌గా మారడం వెనుక..

ABN , First Publish Date - 2020-03-13T06:45:55+05:30 IST

కల్పనా మోండల్‌... రద్దీగా ఉండే కోల్‌కతా వీధుల్లో బస్సు చక్రాన్ని రయ్‌న తిప్పుతుంది. సన్నగా రివటలా ఉండే 21 ఏళ్ల ఈ అమ్మాయి బస్‌ డ్రైవర్‌గా అంత భారీ వాహనాన్ని నడపడం చూసి ప్రయాణికులతో...

21 ఏళ్ల ఈ యువతి.. డ్రైవర్‌గా మారడం వెనుక..

కల్పనా మోండల్‌... రద్దీగా ఉండే కోల్‌కతా వీధుల్లో బస్సు చక్రాన్ని రయ్‌న తిప్పుతుంది. సన్నగా రివటలా ఉండే 21 ఏళ్ల ఈ అమ్మాయి బస్‌ డ్రైవర్‌గా అంత భారీ వాహనాన్ని నడపడం చూసి ప్రయాణికులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులూ ఆశ్చర్యపోతారు. మగవాళ్లకే పరిమితమైన ఈ ‘ఫీట్‌’ను ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం... కోల్‌కతాలో పిన్నవయస్కురాలైన బస్సు డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం... ఈ తరానికి స్ఫూర్తిదాయకం. 


అందరు టీనేజర్ల మాదిరే కల్పన కూడా సోషల్‌ మీడియాను ఫాలో అవుతుంది. తన భవిష్యత్తు గురించి చాలా పెద్ద కలలు కంటుంది. ఇంటి వద్ద తన ప్రియనేస్తం ‘ఘోంటు’ (పెంపుడు కుందేలు)తో సరదాగా ఆడుకుంటుంది. కానీ మిగతా వారిలా ఆడుతూపాడుతూ సాగే జీవితం కాదు ఆమెది. కష్టమైన పరిస్థితుల్ని నవ్వుతూ దాటి వచ్చిన విజేత ఆమె. కోల్‌కతాలోని నోపరా ప్రాంతంలో చిన్న ఇంటిలో కల్పన కుటుంబం నివాసం ఉంటుంది. నలుగురు సంతానంలో తనే చిన్నది.


వాళ్ల నాన్న డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఒకరోజు యాక్సిడెంట్‌ కావడంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎముకలు విరగడంతో రాడ్లు వేశారు. దాంతో ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు పని చేయాల్సిన పరిస్థితి. ఆ క్షణం కల్పన తండ్రి బాధ్యతను తీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు చదువు మధ్యలోనే ఆపేసింది. తండ్రి వదిలేసిన స్టీరింగ్‌ అందుకుంది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి ఏడు గంటలకు అమ్మకు వంట, ఇంటి పనిలో సాయం చేసి తర్వాత బస్సు నడిపేందుకు వెళుతుంది.


తండ్రిని గమనిస్తూ...

కల్పనకు డ్రైవింగ్‌ మీద ఆసక్తి పెరగడానికి కారణం వాళ్ల నాన్నే. ఆమె చిన్నతనంలో వాళ్ల నాన్న సుభాష్‌తో కలిసి ట్రిప్పులకు వెళ్లేది. ఆయన డ్రైవింగ్‌ చేస్తుంటే క్యాబిన్‌లో కూర్చుని ఆసక్తిగా గమనించేది. ‘‘ఎనిమిదేళ్ల వయసులోనే పెద్ద వాహనాలు నడపడం నేర్చుకుంది. అయితే మెయిన్‌ రోడ్ల మీద కాకుండా వీధుల్లోనే నడిపేది. ఒక్కోసారి సరుకు లోడుతో ఉన్న లారీలను గోడౌన్‌కు తరలించేది. చాలారకాలుగా తను నాకు కొడుకులా మారింది. నా ఆశ, నమ్మకం రెండూ తనే’’ అని గర్వంగా చెబుతారు సుభాష్‌. ‘‘మేము రోజూ రాత్రి పది గంటలకు సరకు తీసుకొని హౌరా వెళతాం. తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి అవుతుంది. హౌరా వెళ్లేటప్పుడు నాన్న డ్రైవ్‌ చేస్తారు. తిరిగి వచ్చేటప్పుడు నేను డ్రైవింగ్‌ చేస్తా. అయితే అనుకోకుండా ఒకరోజు టైర్‌ పంక్చర్‌ అయింది. మా నాన్నేమో కాళ్లు వంచలేరు. అప్పుడు నేను లారీ కిందకు వెళ్లి టైర్‌ మార్చేశా’’ అని గుర్తుచేసుకుంటుంది కల్పన. అయితే పూర్తి స్థాయిలో డ్రైవర్‌ అవ్వాలనే లక్ష్యంతో రోజూ రాత్రిపూట తమ ప్రాంతంలోని వీధుల్లో లారీ నడిపేది. కల్పన నాన్న ఆమె పక్కన కూర్చొని డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పేవారు. 


బస్సు స్టీరింగ్‌ అందుకుందిలా...

కల్పనకు పూర్తిస్థాయి బస్సు డ్రైవర్‌గా అవకాశం ఇచ్చేందుకు కొత్తలో బస్సు యజమానులు సందేహించేవారు. కొన్ని రోజులకు ఎప్లనాడే-బారానగర్‌ మార్గంలో బస్సు నడిపేందుకు ఒక యాజమాని అవకాశం ఇచ్చాడు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని ఒడుపుగా బస్సు నడిపి శభాష్‌ అనిపించుకుంది. కోల్‌కతాలో బస్సు నడపడం అంత సులువు కాదు. ఇరుకుగా ఉండే అక్కడి రోడ్లు, ట్రాఫిక్‌, జనంతో నిండిపోయే మార్కెట్‌ వీధుల గుండా డ్రైవ్‌ చేయడం ఎవరికైనా సవాలే. అయితే కల్పన మాత్రం ఏంతో చాకచక్యంగా బస్సును పరుగెత్తిస్తుంది. ‘‘ఒకరోజు పోలీసులు వచ్చి బస్సు ఆపారు. ‘ఒక అమ్మాయి బస్సు నడుపుతోంది. చెక్‌ చేయండి’ అని పై అధికారులు వారిని ఆదేశించారట. ఇప్పుడు వారే నేను బస్సు నడుపుతూ, సిగ్నల్స్‌ దాటి వెళుతుంటే అభినందిస్తున్నారు. అందరు పోలీసులు ఒకేలా ఉండరు. కొందరు నన్ను డ్రైవింగ్‌ చేసేందుకు ప్రోత్సహిస్తారు. నా ఫొటోలు తీస్తారు. కొందరేమో నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తారు’’అని తనకు ఎదురైన అనుభవాలు చెబుతోందీ యంగ్‌ డ్రైవర్‌. 


తన భవిష్యత్తు గురించి ఎవరైనా అడిగితే ‘రోజంతా బస్సు నడపడం వల్ల అలసిపోతాను. కెరీర్‌, అవకాశాలు అంటూ నాకేమీ లేవు. అయితే మధ్యలో వదిలేసిన పదో తరగతి పూర్తిచేయాలనుకుంటున్నా. తరువాత పోలీస్‌శాఖలో డ్రైవర్‌గా ఉద్యోగం తెచ్చుకొని నా తండ్రి కలను నిజం చేయాలనుకుంటున్నా’’ అంటున్న కల్పన నేటితరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Updated Date - 2020-03-13T06:45:55+05:30 IST