అలా జరిగితేనే పెళ్లికి అర్థం ఉంటుంది: నిఖిల్

ABN , First Publish Date - 2020-04-12T05:38:21+05:30 IST

పెళ్లి హడావిడిలో పరుగులు తీయాల్సిన ఆ హీరో... కరోనాపై యుద్ధంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో తమ వంతు సేవ చేస్తున్నారు. నిఖిల్‌...

అలా జరిగితేనే పెళ్లికి అర్థం ఉంటుంది: నిఖిల్

పెళ్లి హడావిడిలో పరుగులు తీయాల్సిన ఆ హీరో... కరోనాపై యుద్ధంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో తన వంతు సేవ చేస్తున్నారు. నిఖిల్‌...ఈ వారంలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన హీరో. కానీ పెళ్లి వాయిదా వేసుకున్నారు. కరోనా ప్రభావం, పెళ్లి వాయిదా విషయాల గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎవరూ ఊహించి ఉండరు కదా? 

ఊహ తెలిశాక నివారణ ఉన్న భయంకర వ్యాధులు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న బాధితులను చూశా. కానీ ఇలాంటి పరిస్థితిని నేను గానీ, మా ఇంట్లో ముందు రెండు తరాల వారుగానీ చూడలేదు. కంటికి కనిపించని ఓ క్రిమి మానవాళిని ఇలా హతమారుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మందు లేని ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి మన దగ్గర ఉన్న ఆయుధం శుభ్రంగా ఉండడం, సామాజిక దూరం పాటించడం, ఇంటికి పరిమితం అవ్వడం ఒక్కటే మార్గం. ఈ సమయంలో మనుషుల్ని ఎడ్యుకేట్‌ చేయడం చాలా ముఖ్యం.


అందరిలా కాకుండా మీరు డిఫరెంట్‌గా ఆలోచించి డాక్టర్ల జాగ్రత్త గురించి పట్టించుకున్నారు. వారికి తోడ్పాటునిస్తున్నారు!  

కరోనా బాధితుల సంరక్షణ ఎంత ముఖ్యమో, వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ల ఆరోగ్యమూ అంతే ముఖ్యం. కరోనాతో మరణించిన వారిని పూడ్చి పెట్టడానికి కూడా ఎవరూ రాని పరిస్థితిని చూస్తున్నాం. కానీ డాక్టర్లు తమ భార్యా, బిడ్డల్ని వదిలి, ప్రాణ భయం లేకుండా రాత్రింబవళ్లు ఆసుపత్రిలో ఉండి వైద్యం అందిస్తున్నారంటే అంతకన్నా గొప్ప వ్యక్తులు ఎవరుంటారు. డాక్టర్లు లేకపోతే ఆసుపత్రులు ఉండి ఉపయోగం ఏంటి? అసలు పోలీసులు, డాక్టర్లు కరోనాకు భయపడి డ్యూటీలకు హాజరు కాకపోతే.. మరణాలు వేల సంఖ్యకు చేరుకునేవి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది మనిషి రూపంలో ఉన్న దేవుడిలా కనిపిస్తున్నారు. వారే నిజమైన హీరోలు. అందుకే వివిధ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి ప్రొటెక్షన్‌ కిట్స్‌, ఎన్‌95 రెస్పిరేటర్లు, గ్లౌజులు, కంటి అద్దాలు, శానిటైజర్లు, 10వేల మాస్కులు అందజేశాను. వైజాగ్‌, విజయవాడ, గుంటూరు, అనంతపురం ప్రాంతాల్లోని డాక్టర్లకు కూడా సరఫరా చేశాం. నేను ఈ చిన్న హెల్ప్‌ చేయడానికి కారణం ప్రజలే. హీరోగా నన్ను ఆదరించి, వారు డబ్బులు పెట్టి కొన్న టిక్కెట్‌తోనే నేనీ రోజు ఓ ముద్ద తింటున్నా. అలాంటి ప్రజలకు, వారిని రక్షిస్తున్న వైద్యులకు ఎంత సాయం చేసినా తక్కువే! 


లాక్‌డౌన్‌లో  ఏం చేస్తున్నారు? దీని నుంచి ఏం నేర్చుకున్నారు? 

పలు కారణాలతో షూటింగ్‌లు నిలిచిపోవడం, రెండు, మూడు రోజులు థియేటర్లు బంద్‌ చేయడం చూశాం. కానీ.. ఇలా అన్ని రకాల ఇండస్ట్రీలకు మూత వేసుకుని ఇంట్లో కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. దైనందిన జీవితంలో మనం కుటుంబానికి ఎంత దగ్గరగా ఉంటున్నాం? ఎంత ప్రేమ, ఆప్యాయతలతో మెలుగుతున్నాం అనేది అందరికీ తెలుసు. కరోనా భయంతో ఇంట్లో ఉండడం వల్ల మనిషికీ, మనిషికీ మధ్య బంధం బలపడింది. కుటుంబ సభ్యులతో గడిపే ఛాన్స్‌ దొరికింది. పేద, ధనిక తేడా లేకుండా అంతా సమానంగా ఉన్నారు. వంట దగ్గర నుంచి ఇంటి పనులు చక్కబెట్టడం ఎంత కష్టమో అమ్మ పక్కన ఉండి చూస్తే తెలిసింది. జంక్‌ ఫుడ్‌ తినే నేను ఇంట్లో అమ్మ చేతి రుచికరమైన భోజనం చేస్తున్నా. ‘మాయాబజార్‌’, ‘గుండమ్మ కథ’ లాంటి సినిమాలను మళ్లీమళ్లీ చూస్తున్నా. నటనను ఇంప్రూవ్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా. ఓ పక్క తమిళం నేర్చుకుంటున్నా. నా బాడీ సిక్స్‌ప్యాక్‌ లెవల్లో ఫుల్‌ ఫిట్‌గా ఉండాలని ‘కార్తికేయ’ డైరెక్టర్‌ చందు మొండేటి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నా. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉండి అన్ని పనులు నేర్చుకున్నా. ఇప్పుడు ప్రపంచంలో నన్ను ఎక్కడ వదిలేసిన ధైర్యంగా బతకగలను. 


లాక్‌డౌన్‌ కొనసాగింపు మంచిదేనంటారా? 

డెఫినెట్‌గా మంచిదేనండీ! ప్రభుత్వాలు, పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే అలా ఉండాల్సిందే! ఎందుకంటే కొద్దిరోజులు జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో ఆనందంగా ఉండగలం. కొందరు లాక్‌డౌన్‌ను అతిక్రమించి బయట గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వాళ్లకు ఈ జబ్బు గురించి సరైన అవగాహన లేదనుకుంటున్నా. కరోనా భయంతో ఇప్పుడు ఏమైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో.. భవిష్యత్తులోనూ వాటిని ఆచరించాలి. 

 

మీ కాబోయే శ్రీమతి పల్లవీ వర్మ ఎలా పరిచయం? 

పల్లవీ వర్మ వ్యత్తిరీత్యా డాక్టర్‌. ఓ ఫంక్షన్‌లో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయింది. మాటలు, చూపులు కలిశాయి. ఆరు నెలల్లో ప్రపోజ్‌ చేసుకున్నాం. ఇరువైపు పెద్దలు అంగీకరించడం పెళ్లికి సిద్ధమయ్యాం. మా ఇద్దరిదీ పర్ఫెక్ట్‌ వేవ్‌లెంగ్త్‌. అర్థం చేసుకునే విషయంలోనూ అంతే! పల్లవి నన్ను మించిన ఎనర్జీతో ఉంటుంది. 


గుళ్లో అయినా పెళ్లి చేసుకుంటానన్నారు? 

హంగులతో కాకపోయినా అనుకున్న ముహూర్తానికి గుళ్లో అయినా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ కుదరలేదు. పెళ్లనేది జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. మన అనుకున్న అందరి మధ్య వివాహం జరిగితేనే దానికి అందం, అర్థం. ఇలాంటి సమయంలో పెళ్లి పెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా అందరినీ ఒక చోటుకి తీసుకురావడం  ఇబ్బందితో కూడిన పని. గేదరింగ్‌ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా జీవితాంతం అది బాధగానే ఉంటుంది. అందుకే పెళ్లి వాయిదా వేశాం. పరిస్థితులన్నీ సర్దుకున్నాక ఓ పెద్ద వేడుకలా నా పెళ్లి జరుగుతుంది.


ఇతర భాషల్లో నటించే అవకాశం ఉందా?

అలాంటి ఆలోచన లేదు. కానీ ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా వస్తున్న సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. యూనివర్సెల్‌ కాన్సెప్ట్‌ కాబట్టి ఆ సినిమాకు డబ్బింగ్‌ క్రేజ్‌ బావుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌లో అన్ని భాషలకు ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పినట్లుగానే నేను నా సినిమాకు డబ్బింగ్‌ చెప్పాలనుకుంటున్నా.


ఆలపాటి మధు

Updated Date - 2020-04-12T05:38:21+05:30 IST