నెవర్‌ బిఫోర్‌... ఎవర్‌ ఆఫ్టర్‌

ABN , First Publish Date - 2020-04-25T06:27:59+05:30 IST

తారుమబ్బుల్లా పొగలసెగలు... ఉరుకుల పరుగుల జీవితాలు... అన్నింటికీ ‘విరామం’ ప్రకటించిన వేళ గాలి.. నీరు.. నేల స్వచ్ఛమై.. సృష్టిలోని ప్రతి చిత్రం ప్రమోదమై.. ప్రకృతి

నెవర్‌ బిఫోర్‌... ఎవర్‌ ఆఫ్టర్‌

తారుమబ్బుల్లా పొగలసెగలు... ఉరుకుల పరుగుల జీవితాలు... అన్నింటికీ ‘విరామం’  ప్రకటించిన వేళ గాలి.. నీరు.. నేల స్వచ్ఛమై.. సృష్టిలోని ప్రతి చిత్రం ప్రమోదమై.. ప్రకృతి పరవశిస్తోంది. అందుకే ఈ సౌందర్యాన్ని తమ ‘లెన్స్‌’తో బంధించి... మధుర జ్ఞాపకంగా భద్రపరుస్తున్నారు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు. వీరితోపాటు వివిధ రాష్ట్రాల అధికారులూ పర్యాటక ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాలతో డాక్యుమెంటరీలుగా రూపొందిస్తున్నారు.


కిటకిటలాడే ప్రాంతాలన్నీ లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారాయి. అదే ఇప్పుడు ఫొటోగ్రాఫర్లకు పండగలా మారింది. డ్రోన్‌ కెమెరాలతో వారు తీస్తున్న చిత్రాలు చూస్తుంటే... మన కళ్లను మనమే నమ్మలేనంత అద్భుతంగా ఉన్నాయి. అన్నీ ఒకప్పుడు మనం చుట్టివచ్చిన ప్రాంతాలే... కానీ జన సంచారం, కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీలు లేకపోవడంతో సుమనోహరంగా, సరికొత్తగా కనువిందు చేస్తున్నాయి. అలా తీసిన చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 


ఇప్పటికే మన హైదరాబాద్‌, విజయవాడ నగర అందాలను డ్రోన్లతో తీసిన చిత్రాలు, దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిజానికి బెంగళూరు, ఢిల్లీ సహా దేశమంతటా అదే పరిస్థితి. ఒడిశా రాష్ట్రం విషయానికొస్తే... అలలపై తేలుతూ వందల పడవలు... అంతకు మించి పోటెత్తే భక్తులు... ఎప్పుడూ సందడిగా ఉండే ఒడిశాలోని కాళీజై ద్వీపం ఇప్పుడు వినూత్నంగా కనిపిస్తోంది. చిల్కా సరస్సులోని ఈ ద్వీపం ఒడ్డున బారులు తీరిన పడవలు... స్వచ్ఛమైన నీరు... అందులో ఆ పడవల క్రీనీడల ఛాయాచిత్రాలు నెటిజనులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.  


అదే రాష్ట్రంలోని గంజాం జిల్లా కలెక్టర్‌  అక్కడి పర్యాటక ప్రాంతాల ఫొటోలు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కొత్తగా గంజామ్‌కు పోస్టింగ్‌అయిన ఐఏఎస్‌ అధికారిణి కీర్తీ వాసన్‌... ప్రత్యేకించి లాక్‌డౌన్‌ సమయంలో ప్రకృతి అందాలను భావితరాలకూ చూపించేందుకు డాక్యుమెంటరీ తీయిస్తున్నారు. 


‘‘లాక్‌డౌన్‌తో ప్రకృతి మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఇలాంటి సమయం భవిష్యత్తులో రాకపోవచ్చు. అందుకే ప్రకృతి, ప్రజలు, వారి ఇబ్బందులు, నగరాలు... ఇలా ప్రతి దృశ్యాన్నీ ‘లెన్స్‌’లో బంధించే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటారు డాక్యుమెంటరీ ఏజెన్సీ ‘లైట్‌ హౌస్‌’ నిర్మాత అమియా పాణి. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా నగరమంతా డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించింది. మరికొన్ని నగరపాలక, పర్యాటక సంస్థలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి. అప్పుడప్పుడూ ఏదో అత్యవసర పని మీద బయటకు వచ్చిన ప్రజలూ తమ స్మార్ట్‌ ఫోన్లలో కంటికి కనిపించిందల్లా అపురూపంగా క్లిక్‌మనిపిస్తున్నారు. 


అన్నీ ఒకప్పుడు మనం చుట్టివచ్చిన ప్రాంతాలే... కానీ కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ లేకపోవడంతో మనోహరంగా, సరికొత్తగా కనువిందు చేస్తున్నాయి.

Updated Date - 2020-04-25T06:27:59+05:30 IST