మాతృమందిరంలో నవతార!

ABN , First Publish Date - 2020-10-31T06:07:46+05:30 IST

‘‘నా జీవితంలో ఇప్పటివరకూ జరిగిన అత్యద్భుతం, నాకు అన్నిటికన్నా ఆనందాన్నిచ్చిన అనుభవం... మాతృత్వం.

మాతృమందిరంలో నవతార!

ఆడబిడ్డకు తల్లిగా ఉండాలనేది ఆమె చిరకాల కోరిక.స్వయంగా బిడ్డను కనే పరిస్థితి లేకపోవడంతో దత్తత కోసం ఎంతో ప్రయత్నించారు.మూడేళ్ళ తరువాత ఆ నిరీక్షణ ఫలించింది. ఆమె ఇంట్లో ఒక ‘తార’ మెరిసింది.కిందటి ఏడాది ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రసిద్ధ బాలీవుడ్‌ నటి మందిరాబేడీ (48) మాతృత్వం గురించీ, దత్తత కోసం పడిన ప్రయాస గురించీ ఏమంటున్నారంటే...

‘‘నా జీవితంలో ఇప్పటివరకూ జరిగిన అత్యద్భుతం, నాకు అన్నిటికన్నా ఆనందాన్నిచ్చిన అనుభవం... మాతృత్వం. పెళ్ళయిన పన్నెండేళ్ళ తరువాత, ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో తొలిసారి తల్లిని అయ్యాను. ఈ ఆలస్యానికి కారణం వృత్తి జీవితంలో, దాని వల్ల కుటుంబ జీవితంలో తలెత్తిన ఒడుదొడుకులు. నిజానికి అప్పట్లో గర్భం ధరించడం అంటేనే నాకు భయంగా ఉండేది. ఎందుకంటే సినిమాలతో, టీవీ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉండేదాన్ని. గర్భణినైతే నా కెరీర్‌ ముగిసిపోతుందేమోనని భయపడ్డాను కూడా! నా భర్త రాజ్‌ కౌశల్‌కి పిల్లలంటే ఇష్టం. ఈ విషయంలో మా మధ్య తీవ్రమైన చర్చలు కూడా జరిగేవి. 

మా అబ్బాయి వీర్‌ పుట్టాక మరో బిడ్డ కావాలనిపించింది. ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. అయితే నా వయసు కారణంగానూ, వృత్తి పరమైన ఒత్తిళ్ళ వల్లా మరో బిడ్డను కనే పరిస్థితులు లేవు. మరోవైపు మా అబ్బాయి తనకో చెల్లి కావాలని మారాం చెయ్యడం మొదలు పెట్టాడు. అందుకే ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకున్నాం. అయితే అది అంత సులువుగా జరగలేదు. 

అధికారికంగా దత్తత తీసుకోవడానికి సెంట్రల్‌ అడాప్టేషన్‌ రిసోర్స్‌ అథారిటీ (సిఎఆర్‌ఎ)ని మూడేళ్ళ కిందట సంప్రతించాం. మాకు ఒక అమ్మాయి దత్తత కోసం కావాలని దరఖాస్తు చేసుకున్నాం. ఆ సంస్థ వాళ్ళు మా ఇద్దరి వివరాలూ తెలుసుకున్నారు. నాకూ, నా భర్తకూ నలభై అయిదేళ్ళు దాటాయి. మా అబ్బాయి అయిదేళ్ళ పిల్లాడు. కాబట్టి నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్టమైన వయసున్న బిడ్డను మాత్రమే మేము దత్తత తీసుకోగలం. దాంతో ఆ ప్రక్రియ ఆలస్యమయింది. ఈ మూడేళ్ళలో మేం ఆ సంస్థ ప్రతినిధులతో చాలా సార్లు మాట్లాడాం. రెండున్నర ఏళ్ళ నుంచీ నాలుగేళ్ళ మధ్య వయసున్న అమ్మాయి కావాలని కోరాం. మూడు రాష్ట్రాలను సూచిస్తూ, వాటిలో ఏ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డనైనా దత్తత చేసుకుంటామని చెప్పాం. కాలం గడిచిపోతోంది, కానీ ఫలితం మాత్రం కనిపించలేదు.

ఆరు నెలల క్రితం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాక, ఇంటికే పరిమితమైనప్పుడు మా అబ్బాయి వీర్‌ నుంచి మరింత ఒత్తిడి ఎక్కువైంది. దాంతో మా దరఖాస్తు ఏమయిందని మరోసారి అధికారులను అడిగాం. ఈ సారి కదలిక వచ్చింది. మా ఆకాంక్షలకు తగిన అమ్మాయి ఉందని చెప్పారు. ఆమెతో వీడియో కాల్స్‌ మాట్లాడాం. మా వివరాలు చెప్పాం. తరువాత మళ్ళీ వీడియోకాల్‌ చేసినప్పుడు, ‘‘మీరెప్పుడు వస్తారు? అని అడిగింది. అధికారిక లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాక, జూలై 28న మా కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించాం. అయితే చట్టబద్ధంగా ఆమె మా బిడ్డ అయ్యే వరకూ దీన్ని బహిరంగపరచలేదు.

అన్నట్టు, మేము దత్తత చేసుకున్న అమ్మాయికి ‘తార’ అని పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. తార ఇప్పుడు మాతో చాలా సంతోషంగా ఉంది. ఆమె అల్లరి చేస్తుంది, సరదాగా ఉంటుంది. అలాగని ఎదుటివారిని ఇబ్బంది పెట్దదు. మా అబ్బాయిని ‘వీరూ భయ్యా!’ అని పిలుస్తుంది. ఇక, వీరూ కూడా చెల్లెల్ని క్షణం వదిలిపెట్టడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసుల సందర్భంగా, ఆమెను తన తరగతిలో అందరికీ పరిచయం చేశాడు. నేనిప్పుడు తారకు పాఠాలు చెప్పడంలో తీరిక లేకుండా ఉన్నాను. బడులు తెరవగానే ఆమె కూడా తరగతులకు వెళ్తుంది. 



తల్లి ప్రేమకు ఎలాంటి షరతులూ ఉండవు. మా అబ్బాయిని నేను పెంచుతున్నప్పుడు అతని విషయంలో నేను పడుతున్న తపన నా తల్లితండ్రులు కూడా నా విషయంలో పడి ఉంటారని అర్థం చేసుకున్నాను. వారిపట్ల నా ప్రేమ, గౌరవం మరింత పెరిగాయి. తార మా ఇంట్లోకి వచ్చాక ఈ సరికొత్త అమ్మతనాన్ని బాగా ఆస్వాదిస్తున్నాను. ఆమె మా జీవితాల్లో నక్షత్రంలా కాంతిని నింపుతుందనే నమ్మకం ఉంది నాకు.’’ 


Updated Date - 2020-10-31T06:07:46+05:30 IST